– మోదీ క్యాబినెట్లో 27 మంది బీసీలు
– బిజెపి ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు పూర్తిస్థాయిలో అన్యాయం చేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రస్తుతం బిజెపి మీద నిందను నెట్టాలని కుట్ర పన్నుతోంది. ఆ కుట్రను ప్రజల ముందు బహిర్గతం చేసేలా, బీసీల హక్కుల కోసం ఈ మహా ధర్నా చేపట్టాం.
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బిజెపి అడ్డుపడుతోందని ఢిల్లీలో ధర్నా చేసేందుకు రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీపై బీసీలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారు.
గత 10 సంవత్సరాలుగా పాలన చేసిన బీఆర్ఎస్, రెండు సంవత్సరాలుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తీరని ద్రోహం చేశాయి. ఈ పార్టీల కుట్రలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఈ ధర్నా నిర్వహించాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీలకు ఏ ప్రధాని చేయని మేలును, బిజెపి పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీలకు చేసింది.
మోదీ క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1650 మంది ఎమ్మెల్యేల్లో 489 మంది ఓబీసీలు ఉన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బిజెపిపై నెపం వేసే కుట్ర చేస్తోంది. ఈ కుట్రలను బహిర్గతం చేయాలి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు బీజేపీ పాలన స్వచ్ఛంగా, అవినీతిరహితంగా ఉందని నమ్మి అధికారంలోకి తీసుకువచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేయడానికి ప్రతి కార్యకర్త సమర్థంగా పనిచేయాలి.