– రైతుల కష్టాలు గాలికొదిలేసి గాలి మోటార్లలో ముఖ్యమంత్రి, మంత్రుల విహారాలు
– ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ
– భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు
– గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా?
– మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?
– కొనుగోళ్లు ఆగిపోయాయన్న సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా?
– పండిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే
– సదాశివపేట కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
సదాశివపేట: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగింది. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోంది.సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారు.
గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదు. భూమి మీద తిరుగుడు తక్కువైపోయి గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయింది. సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారు.
వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు? రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయి. వెంటనే రూ. 5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. లేదంటే రైతులు బయట అమ్ముకుని క్వింటాల్ కు రూ. 1000 చొప్పున, ఎకరానికి పది వేల రూపాయలు నష్టపోతారు.
రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే, సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని చెబుతున్నారు. మద్దతు ధర రూ. 2400 ఉంటే రూ. 1600-1700 కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారు.
జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చింది. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయి. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసింది.
మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదు. కనీసం సన్న వడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా స్పష్టం చేయాలి. గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలి. ముఖ్యమంత్రి ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలి. భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా? కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా?
ఇక్కడ మల్లేషం అనే రైతు చెబుతున్నాడు.. రోజుకు కేవలం 10 గంటల కరెంటే ఇస్తున్నారని. పొద్దున ఎనిమిదింటికి కరెంటు వస్తోందని రైతులు వాపోతున్నారు. కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?
ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
హరీశ్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.