– కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి ‘యూరియా యాప్’ ఒక నిదర్శనం
– కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ రైతు వ్యతిరేక విధానం
– యూరియా యాప్ నాటకం – లైన్లను దాచే కుట్ర
– బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
హైదరాబాద్: గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.
తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ ‘మొబైల్ యాప్ నాటకాన్ని’ కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. “కేసీఆర్ గారికి రైతులపై ఉన్నట్లుగా గుండెల్లో ప్రేమ ఉంటే, రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రేమ, చిత్తశుద్ధి రెండూ లేవు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ‘లైన్లను దాచే’ ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరని, గ్రామాల్లో సర్పంచులే అసలైన కథానాయకులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, విధులు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా సర్పంచులకే చెల్లుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఏ ఎమ్మెల్యే లేదా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని గుర్తు చేశారు. మనం కేవలం ఆ ప్రజా ధనానికి ధర్మకర్తలుగా ఉండి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో పల్లెలే పట్టుకొమ్మలనే నినాదంతో గ్రామాలను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేశామని, దీనివల్ల తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులను గెలుచుకున్నాయని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ గ్రామ పంచాయతీ తీర్మానమే కీలకమని, సర్పంచుల సంతకం లేకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసినా, కనీసం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నిధులు లేక ఇబ్బంది పడుతున్నారని, ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉందని మండిపడ్డారు.
తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, 67 మంది సర్పంచులు గెలవడం శుభపరిణామమని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఉన్నా, ప్రజల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అప్పులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, కర్నె ప్రభాకర్, తాండుర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నేతలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.