– ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్
కంకిపాడు: ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు పరిష్కరించేంతవరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పిజిఆర్ ద్వారా అందుతున్న సమస్యల్లో 65 శాతం సమస్యలు భూ సంబంధ సమస్యలే ఉంటున్నాయని అన్నారు. శుక్రవారం నాడు క్రిష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాపాల ఫలితంగానే రాష్ర్టంలో భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. వాటన్నింటనీ తమ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. రీ సర్వే నిర్వహించడంలోనూ గత ప్రభుత్వం తప్పులు తడకగా వ్యవహరించిందని, అందువల్లే తాము రీ సర్వే నిర్వహించిన గ్రామల్లో సభలు పెడితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వం రీ సర్వేను మొదటి నుంచి చేస్తుందని, చాలా పకడ్బందీగా ఎటువంటి తప్పులకు తావు లేకుండా రీ సర్వే పూర్తి చేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేలో జరిగిన తప్పుల తోపాటు ఇతర భూ సంబంధ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మొదట 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరపాలనుకున్నామని, కానీ ప్రజల ఎదుర్కొంటున్న భూ వివాదాలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించేంత వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ నెల ఆరో తేదీ నుండి రెవెన్యూ సదస్సులను ప్రారంభించగా ఇప్పటికే నాలుగు లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, లక్షకు పైగా ఫిర్యాదులు ఇచ్చారని తెలిపారు. ప్రజలంతా రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.