Suryaa.co.in

Telangana

విలువలు, ప్రశాంత జీవితానికి చిరునామా రోశయ్య

– రాజకీయ ఒడిదుడుకులు, ఉద్యమాలు ఎదుర్కొని ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు
– ప్రతిపక్షాల విమర్శలకు సహేతుక సమాధానాలు ఇస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనుడు
– ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం
– దివంగత సీఎం రోశయ్య మూడవ వర్ధంతి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: విలువలు, ప్రశాంతతో కూడిన జీవితాన్ని గడిపి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు కొణిజేటి రోశయ్య గారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీర్తించారు. బుధవారం హైటెక్స్ లో జరిగిన రోశయ్య మూడవ వర్ధంతి సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. రోశయ్య గారి జీవితం అందరూ అనుకున్నట్టు సజావుగా సాగలేదని, ఆయన రాజకీయంలో అనేక ఒడిదుడుకులు, రాజకీయ ఉద్యమాలకు తట్టుకొని ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని అన్నారు.

క్రమశిక్షణ, నిజాయితీ
విద్యార్థి నాయకుడి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా రోశయ్య ఎదిగేందుకు దోహద పడింది అన్నారు. ఆయన ఆర్థిక మంత్రిగా, సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, చీఫ్ విప్పుగా ఆయన నాయకత్వంలో తనకు పని చేసే అదృష్టం కలిగింది అన్నారు.

ఆయన రాజనీతి, సరళమైన భాష, ప్రతిపక్షాల విమర్శలకు సహేతుకమైన సమాధానాలతో ప్రభుత్వాన్ని నిలబెట్టిన విధానం అందరికీ ఆదర్శం అన్నారు. వ్యక్తిగత దూషణలు లేకుండా సమాధానం చెప్పే విధానం రోశయ్య దగ్గర నేర్చుకోవాలి అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వారికి కట్టుబడి పని చేయాలి. పదవికి వన్నెతెచ్చేలా మసులుకోవాలి అని ఆయన పరితపించేవారు అన్నారు.

ఉమ్మడి రాష్ట్ర ఆదాయం, ఖర్చులపై ఆయనకు అపార అనుభవం ఉంది, అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో వారికే దక్కింది అన్నారు. ఆయనకు వ్యవసాయం, వైద్యం గురించి లోతైన అవగాహన ఉందని… ఆచార్య ఎన్.జి.రంగా శిష్యునిగా వ్యవసాయ రంగంపై అవగాహన పెంచుకొని ఆయనకు ప్రియ శిష్యునిగా గుర్తింపు సాధించారని వివరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా పనిచేసి ఆ తర్వాత అధికార ప్రతినిధి బాధ్యతలో కూడా సమర్థవంతంగా పనిచేయడం అందరికీ ఆదర్శం అన్నారు. అధికార ప్రతినిధిగా ఆయన ప్రతిరోజు పిసిసి కార్యాలయానికి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించేవారని, తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో దాగి ఉంది అన్నారు. మహాత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలను ఆయన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారని తెలిపారు

LEAVE A RESPONSE