Suryaa.co.in

Andhra Pradesh

మేధావులు, జర్నలిస్టులతో నాలుగేళ్ల పరిపాలనపై రౌండ్ టేబుల్ సమావేశం

వై.ఎస్. జగన్ మోహనరెడ్డి ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టి మంగళవారం (30.05.2023)నాటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయం లో మేధావులు, పాత్రికేయులతో రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహించడం జరిగింది. చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో “ప్రభుత్వ నాలుగేళ్ల పరిపాలన – తీరు తెన్నులు” పై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కొమ్మినేని శ్రీనివాస రావు, చైర్మన్ సి.ఆర్. మీడియా అకాడమీ: పేద ప్రజల పాలిట ఆంధ్ర ప్రదేశ్ స్వర్గధామం ప్రదేశ్ స్వర్గధామం. సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు ప్రాధాన్యతాంశాలు గా ముఖ్యమంత్రి పరిపాలన పై తమదైన ముద్ర వేశారు. గతం లో ఎన్నడూ లేని విధంగా వృద్ధాప్య, ఇతర సంక్షేమ పెన్షన్లు వాలంటీర్లు ఇళ్ల వద్దనే ప్రతి నెల 1 వ తేదీనే అందించడం ఆంధ్ర ప్రదేశ్ లో తప్ప ఎక్కడా అమలు అయి వుండదు.

గతంలో ఎం.ఆర్.ఓ కార్యాలయాల చుట్టూ, స్థానిక జన్మభూమి కమిటీల చుట్టూ పేదలు తమకు అందాల్సిన పథకాల కోసం తిరగాల్సిన పరిస్థితి జగన్ మోహన రెడ్డి పరిపాలనలో పూర్తిగా మారింది. వాలంటీర్ల ద్వారా అన్ని సేవలు ప్రజలకు సకాలంలో అందించడం ద్వారా నూతన ఒరవడికి ముఖ్య మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ విధానం నచ్చని పెత్తందారీ వ్యవస్థకు ప్రతినిధులు ప్రస్తుత పరిపాలను ను ‘నరకం’ గా అభివర్ణించడం లోని ఔచిత్యం వారికే తెలియాలి.

పి. విజయ బాబు, చైర్మన్, అధికార భాషా కమిటీ: రాష్ట్ర విభజన పూర్తి అశాస్త్రీయంగా జరిగింది. అనుభవానికి పెద్ద పీట వేసి అప్పటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగడం వల్ల అధికార పీఠం నుంచి వారిని 23 సీట్లకు పరిమితం చేశారు. సాంప్రదాయేతర రాజకీయాలకు జగన్ శ్రీకారం చుట్టి సంతృప్త (100%) పద్దతి లో కుల, మత, రాజకీయ, వివక్షతలు లేకుండా పేదలందరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఒక అపురూప శిల్పిలా అసంపూర్తి శిల్పం లాంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రూపు రేకల్ని మార్చుతున్నారు. జన నాయకుడుగా జనం కోసం పనిచేస్తూ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలనుఎన్ని కష్టాలకైనా ఎదురునిలిచి నెరవేరుస్తున్నారు. కోవిడ్ సమయం లో సైతం సామాన్య ప్రజలకు అండగా నిలిచి ప్రాణ నష్టాన్ని నివారించ గలిగారు. మేధావుల ముసుగులో, పరిశీలకుల ముసుగు లో కొందరు చేస్తోన్న విపరీత వ్యాఖ్యానాలను ప్రజలు గమనిస్తూన్నారు.

గాజులపల్లి రామచంద్రా రెడ్డి, సభ్యులు, అధికార భాషా కమిటీ: ముఖ్య మంత్రి గా జగన్ మోహన రెడ్డి చేపట్టిన పలు ప్రజాహిత కార్యక్రమాలను వక్రీకరించి ప్రజలను తప్పు దారి పట్టిస్తోన్న ప్రచారం పట్ల జాగ్రత్తవహించాలి. అటువంటి ప్రయత్నాలను ఖండించాలి.

డా జి. అనిత, జర్నలిజం హెడ్, నాగార్జున యూనివర్సిటీ: అభివృద్ధి లోని అంతరాన్ని సరిచేసేందుకు సరికొత్తగా వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలవ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడం పరిపాలనను కొత్త పుంతలు తొక్కించింది. నాడు- నేడు ద్వారా విద్యావ్యవస్థకు జవజీవాలునింపారు. ఆంగ్ల మాధ్యమం పాఠశాల విద్యనుంచి ఏర్పాటు చేయగలగడం విద్యార్థులకు మేలు చేయగలదు. మహళల భద్రతలో “దిశ” ప్రాముఖ్యత ఎనలేనిది.

వి.వి.ఆర్. కృష్ణం రాజు, ప్రధాన సంపాదకులు, జర్నలిస్ట్ ఆంగ్ల మాస పత్రిక: నాలుగేళ్ల పాలనలో జగన్మోహన రెడ్డి 2. 1 లక్షల కోట్లను ప్రజల ఖాతా లోకి ట్రాన్స్ఫర్ చేయగలిగారు. కేంద్రంలో ప్రధాని గత 9 ఏళ్లలో దేశ వ్యాప్తంగా 10 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకీ మళ్ళించారు. అన్ని రంగాల్లోనూ,రాష్ట్ర పరిస్థితి మెరుగైంది. ముఖ్య మంత్రి పరిణితి చెందిన రాజనీతి వేత్త గా మార్పు చెందారు. వాస్తవాల్ని మరుగున పరుస్తూ, ఆయన పై చేస్తోన్న దాడిని ఖండించాలి.

ఈ. శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి: జగన్ మోహన రెడ్డి కి 2. లక్షల కోట్ల అప్పుతో, 41 వేల కోట్ల బకాయిలతో కూడిన రాష్ట్రాన్ని అప్పటి ప్రభుత్వం అప్పచెప్పింది. తదనంతరం కరోనా విజృంభణ వల్ల ఆదాయం అంతంత మాత్రం. అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందించారు. మేనిఫెస్టో లో ప్రజలకిచ్చిన హామీలను 98 శాతం పూర్తిచేసిన ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది. రాష్ట్రం లోని కోటి 53 లక్షల కుటుంబాలలో ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం క్రింద లబ్ది పొందింది.

నిమ్మరాజు చలపతి రావు, సీనియర్ పాత్రికేయులు: నిజాలు వ్రాసి వాస్తవాలు ప్రజలకు వివరించాల్సిన పత్రికలు కొన్ని వాటి బాధ్యతను విస్మరించడం విచారకరం. ముఖ్య మంత్రి స్థాయి లో ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం చూశాం. అయితే, ప్రతి హామీ ని జగన్ మోహన రెడ్డి అమలుచేశారు.

కె.బి.జి. తిలక్, సీనియర్ పాత్రికేయులు: అభివృద్ధి అనేది మనం చూసే దృక్పథం బట్టి ఉంటుంది. అమరావతి లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లో చోటు చేసుకున్న పరిణామాలను చూశాం . జగన్ మోహనరెడ్డి పేదల పక్షం అని పలు సందర్భాల్లో నిరూపణ అయ్యింది. రాజకీయ పక్షాలు, కొన్ని పత్రికలు, న్యూస్ చానెళ్లుతో అనుక్షణం పోరాటాల తో ఆయన ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే వున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పక్షాలు ఆయన అమలు చేస్తోన్న పథకాలను వేరే పేర్లతో తమ తమ మానిఫెస్టోల్లో ప్రకటించుకోవడం చూస్తున్నాం. విద్య, వైద్యం వంటి రంగాల్లో మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరుగుతోంది.

రెహానా బేగం, బ్యూరో చీఫ్, ఎన్.టి.వి: వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేయడం తో పాటు, జిల్లాల విభజన కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు ద్వారా పరిపాలన ను సరళతరం చేయడం జరిగింది. “వెల్ఫేర్ ఎకానమీ” ద్వారా ప్రజలకు నేరుగా నిధులు ఇవ్వడం, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి ఆ డబ్బు చలామణి అవ్వడం ద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగింది.

సామాజికంగా బి.సి.,ఎస్.సి. ఎస్.టి., మైనారిటీలకు 50 శాతం పదవులు ఇవ్వడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. అదేవిధంగా మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చి రాజకీయంగా వారిని ప్రోత్సహించడం జరిగింది. 31 లక్షల ఇళ్ల స్థలాలకు మహిళలకే ఓనర్ షిప్ కల్పించడం జరిగింది. అంతెందుకు రేషన్ కార్డు ల్లో గృహ యజమాని గా మహిళలనే గుర్తించడం చూస్తున్నాం. “దిశ” చట్టం కాకపోయినప్పటికీ, మహిళల అత్యాచారం కేసుల్లో త్వరితమైన న్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి.

ఎం.సి. దాస్, రిటైర్డ్ ప్రొఫెసర్: జగన్ మోహన రెడ్డి పాలనలో రాష్ట్రం “సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు” సాధనలో దేశంలో 4 వ స్థానం లో నిలిచింది. వ్యవసాయ రంగం లో 13. 8 శాతం,పారిశ్రామిక రంగంలో 16.36 శాతం,సేవల రంగం లో 18.91 శాతం అభివృద్ధిని సాధించింది. ప్రజా వనరుల పై పెట్టే పెట్టుబడి అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ దిశ లోనే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉత్పాదకత పెంచే విధంగా సంక్షేమ పథకాలు ఉండాల్సిన అవసరం గుర్తించాలి.

ఎం.వి.ఎస్. నాగి రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమీషన్ ఉపాధ్యక్షులు: పేదలకు నివాస యోగ్యమైన ఇల్లు నిర్మించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ఇందుకోసం న్యాయ పోరాటాన్ని చేసి పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో లో వున్నా అన్ని హామీలు అమలుచేసిన ఏకైక ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డి. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి విద్య అని ముఖ్య మంత్రి చెబుతూంటారు.

ఆ దిశలోనే ఆయన పనిచేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదని ఎవరు అనగలరు? పెన్షన్లు గతంలో 39 లక్షలుండగా, ప్రస్తుతం 62 లక్షల 30 వేలకు పెంచి ఇస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తేవడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ను ముస్సోరి లోని లాల్ బహుదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేషన్ అకాడమీ అఖిల భారత సర్వీసు అధికారులకిచ్చే శిక్షణ లో ఒక అంశం గా చేర్చుకోవడం గర్వకారణం. అభివృద్ధి కార్యక్రమాల పై, ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాన్ని చూస్తూ మేధావులు మౌనంగా ఉండకూడదు.

LEAVE A RESPONSE