Suryaa.co.in

Andhra Pradesh

మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ

-మత్స్యకారులకు తోడుగా ఉంటాం
-ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు
-సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్‌ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది.

మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోందని, ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నామన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు నష్టం జరగకూడదనే అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారని, అధికారులు చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం అన్నారు.

దాదాపు రూ.162 కోట్లు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నామని, ఇప్పటి వరకూ రూ.644 కోట్లు ఇచ్చాం. ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం. 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా వారి కుటుంబాలకు ఇచ్చాం. మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నామన్నారు.

రూ.538 కోట్లు అందించాం : 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం. వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం. ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే. రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు. గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6 సబ్సిడీ ఇస్తే, మనం రూ.9కి పెంచాం. గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు.

ఇప్పుడు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. డీజిల్‌ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం. వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం. 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం. ఈ మూడు కార్యక్రమాలే కాకుండా డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం.

ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం. దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఈ ఆరు పథకాలకు రూ.4913 కోట్లు అందించాం. నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం. తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం.

తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం. బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను. దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు.

LEAVE A RESPONSE