హైదరాబాద్ : హైదరాబాద్ బోయిగూడ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ప్రధాని మోడి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. బోయగూడ అగ్నిప్రమాదంపై మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పిఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.
బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సికింద్రాబాద్ బోయగూడ ఐడీహెచ్ కాలనీలోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. మంగళవారం రాత్రి
గోదాంలో 15 మంది కార్మికులు నిద్రించారు. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయటపడగా మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకున్నారు.
వీరిలో 11 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంపై
పూర్తి విచారణ చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు.
అగ్ని ప్రమాదంలో మరణించినవారి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.