Suryaa.co.in

Telangana

సన్న వడ్లకు రూ.500 బోనస్

– బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: రాష్ట్ర రైతులనుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) చెల్లిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో సన్న రకాల వరిసాగు గణనీయంగా పెరిగింది.

అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా, పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరుగకుండా, గంట గంటకూ వాతావరణ సూచనలను అటు రైతులకు, ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అధునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది.

2024-25 ఖరీఫ్ సీజన్ లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు (10,35,484) మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు (12,511.76 కోట్లు) వారి ఖాతాలలో జమ చేయడమైనది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో, ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో 24,439 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము.

పశుసంవర్ధక రంగం

పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్, శాంతినగర్ లో ఉంది. ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి, 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం. అంతేకాకుండా, క్రొత్త వ్యాక్సీన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం, 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్ లు, ఆర్ అండ్ డి, యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు, స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం.

భూ భారతి

42. భూమి అనేది ఒక స్థిరాస్థి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు. అటువంటి, భావుకతతో ముడిపడి ఉన్న అంశంలో, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, ప్రజలు చేసుకున్న ధరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది. వీటి పరిష్కరణను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్/ఆర్.డి.ఓలకు బదిలీ చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసాం.

నూతన రేషన్ కార్డుల జారీ

తెలంగాణ అవతరించిన తరువాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. నూతన రేషన్ కార్డుల జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం. పౌరసరఫరాల శాఖకి ఈ బడ్జెట్ లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

LEAVE A RESPONSE