శాసన సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
రాష్ట్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో(CHCs) మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని, 16వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.550 కోట్ల మేర నిధులొచ్చే అవకాశముందని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు లేఖ రాశామని చెప్పారు.
మంగళవారంనాడు శాసన సభలో లఘు చర్చలో భాగంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీని సభ్యులు స్వాగతించడం పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే అభా కార్డుల జనరేషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని, ముందస్తు రోగ నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పదేపదే చెప్తున్న నేపథ్యంలో ఆరోగ్యం మీద ప్రజలు తమ జేబు నుంచి చేసే ఖర్చును తగ్గించడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర జనాభాలో మొత్తం 98% మందికి ఆభా ఐడీలు, 74 శాతం మేర ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను జనరేట్ చేశామని మంత్రి తెలిపారు. గతంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టిందన్నారు. దాదాపు 2,600 సిబ్బందిని నియమించడంతో ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని, సెకండరీ హెల్త్ లో కూడా 250 నియామకాలు చేపట్టామని, ఇన్ సర్వీస్ కోటా కింద నవంబర్ లో మరో 240 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ లు రానున్నారని మంత్రి తెలిపారు. అవసరమైన మేరకు ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
రూ.600 కోట్లతో 24 క్రిటికల్ కేర్ బ్లాకులు
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద దాదాపు రూ.600 కోట్లతో 24 క్రిటికల్ కేర్ బ్లాకుల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, 14 దాకా పూర్తిగా కావొచ్చాయని, మరో 10 శంకు స్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ క్రిటికల్ కేర్ బ్లాకుల్లో ట్రామా కేర్ సర్వీసులు కూడా అందుబాటులోకొస్తాయన్నారు. అయినప్పటికీ యాక్సిడెంట్ జోన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైజాగ్‌లోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(VIMS)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా అభివృద్ధి చేయడానికి అన్ని అర్హతలూ ఉన్నాయని, ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య యోజన కింద 61 లక్షల కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల వరకు సహకారం అందుతుందన్నారు.
రాష్ట్రంలో 650 డయాలసిస్ మిషన్లు
ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రవ్యాప్తంగా 650 డయాలిసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 90,000 డయాలిసిస్ సెషన్లను అదనంగా చేయగలిగామన్నారు. డిసీజ్ బర్డెన్ ఎక్కువగా ఉన్న చోట డయాలిసిస్ సెంటర్లను మంజూరు చేశామన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు