కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలింతలు!
– 2023లోనే ఆ కాల నాగును కట్టెతో కొట్టి చంపేశా…
– ఆ చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా?
– బీఆర్ఎస్ అనే కాలనాగుపై ప్రజలు బండరాయి వేశారు
– కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షం
– దామచర్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం జిల్లా చైతన్యానికి మారుపేరు… ఇది ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమావేశం కాదు… పేదల గూడెంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభ… ఆనాడు పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇందిరాగాంధీ రోటీ, కప్డా ఔర్ మకాన్ నినాదం తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామచర్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
వైఎస్ హయాంలో పేదోడి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. పదేళ్లలో 25 లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానిది.
హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు. ఎన్నికల సమయంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆ హామీని నెరవేరుస్తున్నాం. పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని గృహ నిర్మాణ శాఖ బాధ్యత పొంగులేటి శ్రీనన్నకు ఇచ్చాం. సరిగ్గా పని చేసే మంత్రి ఉండాలని ఆయనకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు అప్పగించాం.
నా అంచనా తప్పలేదు.. ఆయన శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
ధరణిని బొందపెట్టి భూభారతిని తెచ్చినా.. పేదోడి సొంతింటి కలను నిజం చేసినా సమర్థవంతంగా చేశారు.
పేదోడి సొంతింటి కలను నిజం చేయడం కంటే సంతోషం మాకు ఇంకేం ఉంటుంది? పేదరికం మాకు ఎక్స్ కర్షన్ కాదు.. అది మా జీవన విధానం. పేదరికాన్ని పారద్రోలడమే మా ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షం.
పేదోళ్ల గుండెల్లో ఇందిరమ్మ స్థానం సంపాదించుకున్నారు. రేషన్ కార్డులు ఇచ్చాం.. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. లక్ష కోట్లు దోచుకున్నాయన కుటుంబ సభ్యులు ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. బావ, బామ్మర్ది, అన్న చెల్లి ఇంటిల్లిపాది ఎవరికి వారు కత్తులు బల్లేలు తీసుకుని వీపులో పొడుచుకుంటున్నారు.
ఎంత సంపాదిస్తే ఏం లాభం.. దోపిడీకి సొమ్ము వాళ్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. వాళ్లు వాళ్లు కొట్టుకుని మన పేర్లు తీసుకున్నరు. మేమేదో వాళ్ల వెనక, వీళ్ల వెనక ఉన్నామని అంటున్నారు. 2023లోనే ఆ కాల నాగును కట్టెతో కొట్టి చంపేశా… ఇప్పుడు ఆ చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే కాలకూట విషం ఉన్న కాలనాగును ప్రజలు డిసెంబర్ 3, 2023 న బండరాయితో మోది బొంద పెట్టారు. మీ పంపకాల్లో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గరకు వెళ్లండి. తెగకపోతే కులపెద్ద దగ్గరికి పోండి. అక్కడ కూడా తెగకపోతే మంత్రగాడి దగ్గరకు పోండి. అంతే తప్ప మీ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని లాగకండి. మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పని ఉంది.. సన్న బియ్యం ఇచ్చే పని ఉంది.
మన తలరాతను మార్చేది విద్య ఒక్కటే… విద్య మాత్రమే మన జీవితాలను బాగుచేస్తుంది… 20 వేల కోట్లు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాం… 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏటీసీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. చదువుకోండి.. చదువుకు ఏం కావాలో నన్ను అడగండి. ఎవరో సాయం చేయాలని ఎదురుచూసే స్థాయి నుంచి ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే చదువుకోవాలి. కీలక శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గదు. ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.