Suryaa.co.in

Telangana

అయ్యప్ప భక్తుడైన ఆర్టీసీ డ్రైవర్‌కు అవమానం

-నాగరాజుకు ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
-మండిపడ్డ అయ్యప్ప స్వామి భక్తి మండలి
-అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ డిపో మేనేజర్ క్షమాపణలు

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుకు ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది.

ప్రతి రోజు లాగా డ్రైవర్లందరికీ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో భాగంగా నాగరాజుపై కూడా పరీక్షలు చేపట్టారు. అయితే, తాను అయ్యప్ప మాల ధరించానని, తనపై ఈ పరీక్ష చేయవద్దని నాగరాజు కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం.

ఈ విషయంపై మండిపడ్డ అయ్యప్ప స్వామి భక్తి మండలి సభ్యులు ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు తీసుకున్న చర్యలు అయ్యప్ప భక్తుల ఆచారాలకు విరుద్ధమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన అనంతరం ఆర్టీసీ అధికారులు డిపోలో ఉన్న ఉద్యోగుల ఆచారాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE