పక్క పక్క ఊర్లకు అయితే ఈ బస్సు ఎక్కవద్దు…మీరు వేరే బస్సు ఎక్కండి అంటూ ప్రయాణీకుల బ్యాగులను ఆర్‌టీసీ సిబ్బంది బయటకు పారబోసిన సంఘటన సీలేరులో బుధవారం జరిగింది. దీనికి సంబందించి ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సు భద్రాచలం నుంచి విశాఖ వెళుతూ బుధవారం ఉదయం సీలేరు మెయిన్‌రోడ్డు వద్ద ఆగింది. దీంతో ఒడిశా నుంచి వచ్చిన ప్రయాణీకులు ధారకొండ, దుప్పిలవాడ వెళ్లడానికి బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు.
దీంతో బస్సులో ఉన్న ఆర్‌టీసీ సిబ్బంది ప్రయాణీకులు పట్ల దురుసుగా వ్యవహరించారు. మీరు ఈ బస్సు ఎక్కడానికి వీలుపడదు. వేరే బస్సు ఎక్కండి అంటూ వారి బ్యాగులను బయటకు విసిరేసారు. దీంతో ఆ గిరిజనులు బిక్కచచ్చిపోయారు. సిబ్బందిలో బి.ఏ.నాయుడు అనే డ్రైవర్ చాలా దారుణంగా వ్యవహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో అక్కడున్న వి.అప్పారావు, బషీర్, రవి అనే గ్రామస్థులు వెంటనే కలుగచేసుకుని సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి అయ్యే చార్జీ డబ్బులు మేము ఇస్తామని చెప్పడంతో డ్రైవర్ నాయుడు వారిని బస్సు ఎక్కించుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ తీరు పట్ల పలువురు ఖండిస్తున్నారు.
ఇటువంటి వారి తీరు వల్ల ఈ ప్రాంతంలో బస్సులకు సర్వీసు ఉండటం లేదని, మన్యంలో తిరిగే బస్సు సర్వీసులు గిరిజనులకు సేవ చేయడం మానేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం ఎంతవరకూ సబబని డీసీసీ కార్యదర్శి కారేశ్రీనివాసు , వర్తకసంఘం అధ్యక్షుడు సిధ్దూ ప్రశ్నించారు. ఆర్‌టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్సు సర్వీసలు జరగకుండా ప్రయాణీకులను ఇబ్బందులు పాలజేస్తున్న డ్రైవర్‌లు పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.