-
తిరుమలపై ఆ హోటల్‌కు నిబంధనలు వర్తించవా?
-
గడువు తీరిన తర్వాత కూడా డిడిని ఆమోదిస్తారా?
-
అందుకు అనుమతి ఎవరిచ్చారు?
-
ఇచ్చిన స్థలం పక్కనే మరింత స్థలం ఆక్రమణ
-
అందులో కూరల సామాగ్రి కోసం షెడ్డు
-
బయటకు పొక్కడంతో హోటల్‌ను మూసివేయించిన వైనం
-
టెండరు నిబంధనలు తుంగలోతొక్కిన అధికారులు
-
టూరిజం హోటళ్ల లీజు సంగతేమిటి?
-
మెప్పించిన వారికే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తట్టలకు అనుమతులా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తిరుమలపై వాడుకున్న వారికి వాడుకున్నంత అన్నమాటలు వినిపిస్తూనే ఉంటాయి. దానికి ప్రభుత్వాలు, పార్టీలతో పనిలేదు. ఎవరిని సంతృప్తి పరిస్తే వారికి కావలసినవి వచ్చేస్తుంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఎంలు, చైర్మన్లు వస్తుంటారు. పోతుంటారు. మేము మాత్రం లోకల్ అన్నది కొండపై కొలువుదీరిన అధికారుల విధానం. బరువు పెడితే చాలు పరువు సంగతి చూడరు. ఇప్పటివరకూ వెలుగుచూసిన అనేక కుంభకోణాలే దానికి నిదర్శనం.
తాజాగా తిరుమల కొండపై వెలసిన ఒక హోటల్‌కు దయగల ప్రభువులు, ఇలాంటి మినహాయింపులే ఇచ్చి.. అది బయటకు పొక్కడంతో మళ్లీ దానిని మూయించివేసిన వైచిత్రి ఇది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ఠాకూర్‌లేన్‌కు చెందిన ఓ కంపెనీ.. సన్నిధానం వద్ద హోటల్‌ను లీజుకు తీసుకుంది. టెండరు నిబంధనల ప్రకారం అంతా కలిపి నెలకు 27 లక్షల రూపాయల అద్దెచెల్లించాలని, అందుకు డిపాజిట్‌ను 23-7-2024న డిడి రూపంలో చెల్లించాలని పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది.
అయితే సదరు హోటల్ యాజమాన్యం మాత్రం గడువు ముగిసిన తర్వాత, అంటే 24వ తేదీన.. ఒక కోటి నాలుగులక్షల 25 వేల 600 రూపాయలు 87644 నెంబరుతో ఎస్‌బీఐ హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ బ్రాంచి నుంచి డిపాజిడ్ తాలూకు డిడిని ఇచ్చారు. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఇచ్చిన డిడిలు చెల్లవని చెప్పాల్సిన అధికారులు, ఆ డిడిని మహాప్రసాదంలా తీసుకోవడమే విచిత్రం.
దానితోపాటు సదరు హోటల్‌కు కేటాయించిన స్థలం సరిపోక, పక్కనే ఉన్న నాలుగువేల చదరపు గజాల ఖాళీ స్థలం కూడా స్వాధీనం చేసుకుని.. అక్కడ వంట సామాగ్రి, ఇతర వస్తువులు పెట్టుకునేందుకు ఏకంగా షెడ్డు నిర్మించడం విమర్శలకు దారితీసింది. అయినా అవి టీటీడీ విజిలెన్స్, రెవిన్యూ అధికారులకు కనిపించకపోవడమే వింత. అసలు ఎక్కడైనా టెండరు నిబంధ నలు పాటించిన తర్వాతనే సదరు సంస్థలకు విద్యుత్‌తోపాటు.. విజిలెన్స్, హెల్త్, ఫైర్ సర్వీస్ విభాగాలు తనిఖీ చేసిన తర్వాత మిగిలిన అనుమతులు ఇస్తుంటాయి.
కానీ విచిత్రంగా ఈ హోటల్‌కు మాత్రం అవేమీలేకుండానే.. ముందుగానే అన్ని అనుమతులు ఇచ్చేశారు. పైగా దానిని టీటీడీ పెద్ద తలలే ప్రారంభించడం ఇంకో విశేషం. సహజంగా కొండపైన హోటళ్లు, రెస్టారెంట్లను టీటీడీ పెద్ద తలలు ప్రారంభించరు. ఎందుకంటే లీజుకు సంబంధించిన బకాయిలు, విజిలెన్స్ ఫిర్యాదులుంటాయన్న లంపటాలుంటాయి కాబట్టి. అయినా సరే ఆ హోటల్‌కు మినహాయింపు ఇచ్చేయడం విమర్శలకు దారితీసింది.
కాగా హోటల్ ప్రారంభించిన తర్వాత.. టీటీడీ హెల్త్ డిపాజిట్ దానిని పరిశీలించి, అక్కడి పరిసరాలు, వస్తువుల నాణ్యత బట్టి హోటల్‌లో తినుబండారాల రేట్లు నిర్దేశిస్తుంటారు. అంతేగానీ.. మా ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటామంటే కుదరదు. ఆ ప్రకారంగా సదరు హోటల్ యాజమాన్యం భోజనం ధరను 150 రూపాయలుగా నిర్ణయించింది. అయితే హోటల్ యాజమాన్యం మాత్రం భోజనానికి టాక్సులతో కలిపి 428 రూపాయలు, ఫ్రైడ్‌రైస్ 367 రూపాయలు తీసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై టీటీడీకి సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ బయటకు పొక్కిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ‘మహానాడు’ టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.భాస్కర నారాయణ చౌదరిని వివరణ కోరింది. గడువు ముగిసిన త ర్వాత హోటల్ యాజమాన్యం ఇచ్చిన డిడిని ఎలా తీసుకున్నారని, అందుకు ఎవరు అనుమతించారని ప్రశ్నించింది. దానితో తనకు సంబంధం లేదని, ఈఓ గారు పర్మిషన్ ఇచ్చారని వివరించారు. ఆ తర్వాత ఆ హోటల్‌ను మూసేసినట్లు వాట్సాప్ సందేశం పంపించారు.
అసలు నిర్దేశించిన తేదీ ప్రకారం డిడి చెల్లించకుండానే హోటల్ ప్రారంభించడం ఏమిటి? తేదీ దాటిన డీడీని అధికారులు తీసుకోవడం ఏమిటి? మరి ఈఓ అందుకు అనుమతి ఇస్తే ఇక టెండరు నోటిఫికేషన్లు ఎందుకు? అసలు ప్రారంభించిన కొద్దినెలలకే ఆ హోటల్‌ను మూసేయడమేమిటి? అంటే టీటీడీ లోని సంబంధిత విభాగాలు, తమ పని తాము చేయడం లేదా? పక్కనే ఉన్న నాలుగువేల చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించుకుంటే టీటీడీ రెవిన్యూ, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారన్నది భక్తుల ప్రశ్న.
కాగా.. తిరుమలపై విశాఖ పీఠాథిపతి నిర్మించిన మఠంలో అక్రమ కట్టడాలు జరిగాయంటూ గతంలో హడావిడి చేసిన ఓ జనసేన నేత, ఈ హోటల్‌లో అనధికార భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నేత అందులో పెట్టుబడి పెట్టకపోయినా, అనుమతులు, టీటీడీ వారితో సంబంధాల కోసం సదరు యాజమాన్యం.. ఆయనకు కొంత వాటా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
టూరిజం హోటళ్ల లీజు సంగతేమిటి?
కాగా తిరుమలపై ఉన్న మూడు టూరిజం హోటళ్ల లీజుపై ‘హైదరాబాద్ స్థాయిలో చర్చలు’ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి రోజా హయాంలో బెంగళూరుకు చెందిన వ్యాపారికి టూరిజం హోటల్‌ను, 5 కోట్లు తీసుకుని లీజుకు ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కూడా తమకు అదే రేటు ఇవ్వాలన్న చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు పెద్దతలల పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు.
కొండపై ‘సాయి’ మహిమ
తిరుమల కొండపై వెంకన్న మహిమలు మాత్రమే తెలిసిన వారు.. ఇప్పుడు ‘సాయి మహిమ’లు తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారట. ఆయన ఓ పెద్దతలకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ, కొండపై వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తట్టలు, హాకర్స్‌కు స్థలం కేటాయింపు వ్యవహారాలలో, ‘సాయి మహిమ’ బాగా పనిచేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ‘తాతగారికి చెప్పి మీ పనులు పూర్తి చేస్తా’నని భరోసా ఇస్తున్నట్లు కొండపైన, కింద విపరీతమైన ప్రచారం బహిరంగంగానే జరుగుతోంది.
ఎందుకంటే.. కొండపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తట్టలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీరికి వాటిని కేటాయిస్తే లక్షల ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళుతుంది. హాకర్స్‌కు స్ధలం కేటాయింలతో, పరోక్షంగా లక్షల్లో లాభం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. ఇందులో ఎవరి వాటాలు వారివే. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న సంప్రదాయమే. వైసీపీ జమానాలో తిరుమలలో వీటిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డికి పట్టుండేది. వారి ప్రధాన అనుచరులు సూచించిన వారికే, వాటిని కేటాయించేవారు. ఇక మాజీ మంత్రి రోజా జమానాలో.. బెంగళూరుకు చెందిన ఒక కాంట్రాక్టరుకు టూరిజం హోటల్ దక్కినందుకు, కోట్ల రూపాయల ముడుపులు మారిన ఆరోపణలు మీడియాలో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అధికారం మారిన నేపథ్యంలో వచ్చిన కొత్త బోర్డును, ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే పైరవీకారులు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ‘సాయి’మహిమలు వెలుగుచూస్తుండం, విమర్శలకు దారితీస్తోంది. పేరుకు ‘సాయి మహిమ’ అయినప్పటికీ, అసలు మహిమలన్నీ ‘పితృదేవుడి’దేనన్న ప్రచారం భారీగా సాగుతోంది. నిజం నారాయణుడికెరుక?
పెద్దల పెంట్‌హౌస్‌లపై రణమా? రాజీనా?
కొండపై నిర్మించే ఏ కట్టడమైనా అది స్వామివారిదే. అంటే పూర్తిగా టీటీడీకే చెందుతుంది. ప్రైవేటు ఆస్తులకు కొండపైన స్థానం లేదు. కానీ జగన్ జమానాలో కొండపై కొలువు తీరి, అంతా తానయి నడిపించిన ఈఓ ధర్మారెడ్డి హయాంలో ఆ నిబంధనను తిరగరాశారు. ఆ ప్రకారంగా తిరుమలపై బడా బాబులు నిర్మించిన 15 గెస్ట్‌హౌస్‌లపైన ఉన్న పెంట్‌హౌస్‌ల నిర్వహణను వారికే ధారాదత్తం చేసింది.
ఫలితంగా ఆ ఫ్లోర్లు నిర్మించిన దాతలకు పైన ఒక పెంట్‌హౌస్‌ను శాశ్వతంగా.. అంటే టీటీడీతో సంబంధం లేకుండా పవర్‌ఆఫ్ అటార్నీ లాంటిది ఇచ్చేశారన్నమాట. సహజంగా ఎంత పెద్ద దాతకయినా ఏడాదికి 30 సార్లు మాత్రమే, వారు నిర్మించి ఇచ్చిన గెస్ట్‌హౌసులు వాడుకోవాలి. కానీ ధర్మారెడ్డి జమానాలో మాత్రం.. పైన నిర్మించుకున్న పెంట్‌హౌస్‌లపై టీటీడీకి ఎలాంటి పెత్తనం లేదు. ఏడాదిపొడవునా, దాతలు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు.
పెంట్‌హౌసులంటే అట్టాంటి ఇట్టాంటి పెంట్‌హౌసులు కాదు. స్టార్ హోటల్‌ను తలదన్నే సౌకర్యాలుంటాయి అందులో! వాటిని నిర్మించిన బడా బాబులు.. తమ కంపెనీల ఉన్నతికి పనికివచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపిఎస్‌లకు, పైరవీకారులకు మాత్రమే వాటిని ఇస్తుంటారు. చివరకు ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆ పెంట్‌హౌస్‌లోనే దిగుతున్నారంటే.. బడా బాబుల పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి 15 పెంట్‌హౌస్‌లపై నిర్మించిన 15 గెస్ట్‌హౌసుల్లో మీడియా అధిపతులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలవి ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ నాయుడు చైర్మన్‌గా ఉన్న బోర్డు వాటిని స్వాధీనం చేసుకుని, టీటీడీకి అప్పగిస్తుందా? లేక బడా బాబులతో మనకెందుకని.. జగన్ జమానాలో ధర్మారెడ్డి గారి విధానాలనే అమలుచేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే పెంట్‌హౌసులు నిర్మించిన బడాబాబులు కొందరు, ఇప్పటికే పెద్దతలలతో ‘మాటముచ్చట’ పూర్తి చేశారన్న ప్రచారం జరుగుతోంది. నిజంగా తిరుమలపై జగన్ సర్కారు విధానాలను సమూలంగా మార్చాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఆ పెంట్‌హౌసులను టీటీడీ స్వాధీనం చేసుకోవాలి. లేదంటే జగన్ విధానమే సరైనదని భక్తులు భావించక తప్పదని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి వాటిని స్వాధీనం చేసుకుంటే, ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎం, మంత్రులు బడా బాబుల దయాధర్మంపై ఆధారపడవలసిన అవ సరం ఉండదు. ఆ సంబంధాలను అడ్డుపెట్టుకునే బడా బాబులు ఇకపై తమ వ్యాపారాభివృద్ధికి వీఐపీలను వాడుకునే అవకాశమూ ఉండదు. మరి బోర్డుది రణమా? రాజీనా అన్నది చూడాలి.
‘పింక్ డైమండ్’ను వదిలేస్తారా?
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల ముందు.. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి స్వామివారి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని బాంబు పేల్చి, హిందువుల మనోభావాలను రెచ్చగొట్టారు. అప్పటి ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కూడా దానికి వకాల్తా ఇచ్చారు. దానిపై ఆగ్రహించిన నాటి టీటీడీ పాలకవర్గం విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేసింది. అందుకోసం 2 కోట్ల రూపాయలను కోర్టుకు చెల్లించింది. తర్వాత ఎన్నికల్లో వైసీపీ దానిని ఓ ప్రధానాంశంగా మార్చేసి, చంద్రబాబును ఓడించడంలో ఆ అంశాన్ని అస్త్రంగా సంధించారు.
జగన్ సీఎం అయిన తర్వాత ఏఈఓగా వచ్చిన ధర్మారెడ్డి.. అసలు స్వామివారికి పింక్‌డైమండే లేదని, మీడియా సమక్షంలో కుండబద్దలు కొట్టారు. అంటే చంద్రబాబు వ్యక్తిత్వ హననం చేసి, ఆయనపై బట్టకాల్చి నెత్తిన వేసినట్లు ధర్మారెడ్డి మాటలు స్పష్టం చేశాయి. అంతకుముందు టీటీడీ బోర్డు, విజయసాయిరెడ్డిపై వేసిన పరువునష్టం దావా కేసు ఏమైందో తెలియదు. ఈలోగా ఎన్నికలు వచ్చి కూటమి విజయం సాధించింది.
మరి ఇప్పుడు భక్తుల డబ్బుతో చెల్లించిన ఆ 2 కోట్లు ఎవరి నుంచి వసూలు చేస్తారు? విజయసాయిరెడ్డిపై పరువునష్టం కేసును మళ్లీ తిరగతోడతారా? లేక ‘మంచి ప్రభుత్వం’ కాబట్టి.. కక్ష -కార్పణ్యాలు లేకుండా.. ‘క్రిస్మస్ కానుక’గా విజయసాయిరెడ్డిని విడిచిపెట్టి, కరుణామయుడి అవతారం ఎత్తుతారా అన్నది చూడాలి.
‘ఇప్పుడు బోర్డు మళ్లీ ఆ కేసును పరుగులు పెట్టించవచ్చు. ఎందుకంటే అందులో 2 కోట్ల రూపాయల భక్తుల డబ్బు ఉంది. పైగా బోర్డు కూడా పరువునష్టం దావాను ఉపసంహరించుకోలేదు. ఒకవేళ ఉపసంహరించుకున్నా, కొత్త బోర్డు తీర్మానం చేసి మళ్లీ ఆ కేసును లైవ్‌లోకి తీసుకురావచ్చ’ని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు వ్యాఖ్యానించారు.
నిజానికి చంద్రబాబునాయుడు వ్యక్తిగత పరువును, టీడీపీ ప్రతిష్ఠను దెబ్బతీసిన పింక్‌డైమండ్ ఆరోపణను తేల్చకపోతే.. అది జీవితాంతం చంద్రబాబుకు మచ్చగా మారే ప్రమాదం ఉంది. గతంలో ఆయన వ్యవసాయం దండగ అని అనకపోయినా, అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారం చేసి టీడీపీ ఓటమికి కారణమయింది. దానిని ఆయన ఇప్పటికీ కడుక్కుంటూనే ఉన్నారు. రేపు పింక్‌డైమండ్ వ్యవహారం కూడా అలాగే మారుతుంది. టీటీడీ చైర్మన్ దీనిపై ఎలాంటి చొరవ తీసుకుంటారో చూడాలని అటు మంత్రులు, పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ధర్మారెడ్డి ‘మాఫీ బకాయిలు’ వెలికితీస్తారా?
కాగా కొండపై షాపులు, హోటళ్ల లీజుకు సంబంధించి బకాయిపడ్డ వ్యాపారులను నాటి ఏఈఓ ధర్మారెడ్డి.. బహు దొడ్డమనసుతో వదిలేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించేవి. ఆ రకంగా దాదాపు 9 కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేశారన్న ఆరోపణలొచ్చినా, నాటి సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త పాలకవర్గం బకాయిలున్నవారికి మళ్లీ నోటీసులిచ్చి, బకాయిలు రాబడతుందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు మూసివేసిన హోటల్‌ను.. వైసీపీ జమానాలో లీజుకు తీసుకున్న ప్రముఖుడు చెల్లించాల్సిన బకాయిలను కూడా, పాత పాలకవర్గం మాఫీ చేసిందన్న ఆరోపణలు లేకపోలేదు.
టీటీడీకి ఆర్టీఐ ఎందుకు వర్తించదు?
ప్రధానంగా టీటీడీకి ఆర్టీఐ చట్టం ఎందుకు వర్తించదని నాటి టీడీపీ నేత, ఇప్పటి కార్పొరేషన్ చైర్మన్ ఒకరు అప్పట్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పట్లో ఆయన టీటీడీ వ్యవహారాలు, కొండపై జరుగుతున్న అవకతవకలపై విరుచుకుపడేవారు. నిజానికి తిరుమలలో స్వామివారి సేవలు, కైంకర్యాలు మినహా.. అడ్మినిస్ట్రేటివ్, బోర్డు తీర్మానాలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ఎందుకు వర్తించదన్న దానిపై, ఇప్పటివరకూ ఎవరి వద్దా సమాధానం లేదు. దేశంలో ఒక్క రక్షణ శాఖ వ్యవహారాల్లో తప్ప, మిగిలినవి ఏవీ రహస్యాలు కాదు.
సుప్రీంకోర్టును కూడా ఆర్టీఐ పరిథిలోకి చేరిస్తే.. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు అంత గోప్యంగా ఉండాల్సిన అవసరం ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టదు. భక్తులకు తాము సమర్పించిన కానుకలు ఏమవుతున్నాయని తెలుసుకునే హక్కు ఉండదా? అసలు ఎలాంటి అవకతవకలు జరగనప్పుడు, కొండపై అంతా ధర్మారెడ్డి లాంటి ధర్మాత్ములే కొలువుదీరినప్పుడు, ఆర్టీఐకి భయపడాల్సిన పనేమిటన్నది భక్తులు, సమాచారహక్కు చట్ట కార్యకర్తల ప్రశ్న. సో కొత్త పాలకవర్గం .. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్, బోర్డును ఆర్టీఐ పరిథిలోకి తీసుకువస్తుందో లేదో చూడాలి.