* ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాల సేకరణ
* కూటమి ప్రభుత్వానికి మహిళా ప్రయాణికుల కృతజ్ఞతలు
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ/రొద్దం/శ్రీసత్యసాయి : ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ పథకాల అమలును తెలుసుకునే క్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం నుంచి హిందూపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తి’ పథకం కింద కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై మంత్రి సవిత మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ ఖర్చులు తగ్గాయని, ఉద్యోగాలు, వైద్య అవసరాలు, విద్య తదితర పనుల కోసం సులభంగా ప్రయాణించగలుగుతున్నామని మహిళలు మంత్రికి వివరించారు.
మహిళల ఆర్థిక భద్రత, స్వావలంబన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోందని మంత్రి సవిత ఈ సందర్భంగా తెలిపారు. మహిళలు స్వేచ్ఛగా, భద్రంగా ప్రయాణించే అవకాశం కల్పించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యమని ఆమె పేర్కొన్నారు.
మంత్రి వెంట ప్రయాణించిన మహిళా ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం వల్ల కుటుంబ ఆదాయంపై భారం తగ్గడంతో పాటు మహిళల ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రజల అవసరాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.