ఏటా 15 కోట్ల లీటర్ల నీటి సంరక్షణ
ఇంకుడు గుంతలు, ఓపెన్ వెల్స్ ద్వారా భూగర్భ రిచార్జ్
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ, వనరుల సంరక్షణలో ఆదర్శ విధానాలు పాటించడమే కాకుండా ఆయా పద్ధతులపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తోన్న హైదరాబాద్ ఎల్.బి.నగర్ సమీపంలోని సహారా స్టేట్స్ నివాసితులు… వాననీటిని ఒడిసి పట్టేందుకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
42 ఎకరాల్లో విస్తరించి, 900 కంటే ఎక్కువ కుటుంబాలతో కలిగి ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఏడాదికి 1500 మిలియన్ లీటర్లని ( 15 కోట్ల లీటర్లు ) సంరక్షించే ప్రాజెక్టుని ప్రారంభించారు. ఇగ్నైటింగ్ మైండ్స్ – వాక్ ఫర్ వాటర్ ఫౌండేషన్ కన్సల్టెన్సీలో.. ఆ సంస్థ వ్యవస్థాపకులు, కమ్యూనిటీ నివాసి కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వర్షపు నీటిని ఒడిపిపట్టే సరికొత్త ప్రాజెక్టుని ప్రారంభించారు.
ఇందులో భాగంగా గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో 12 ఇంకుడు గుంతలు, 2 ఓపెన్ వెల్స్ ను పునరుద్దరించనున్నారు . సహారా స్టేట్స్ లో పడిన వర్షపు నీటిని ఆ ఇంకుడు గుంతలు, ఓపెన్ వెల్స్ లోకి మళ్లించి భూగర్భ జలాలను రీచార్జ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు . తద్వారా పట్టణ నీటి ఎద్దడి, వాతావరణ మార్పులను సులువుగా ఎదుర్కోగలమని, నగరాల్లో ఉన్న ప్రతి గేటెడ్ కమ్యూనిటీ ఇలాంటి విధానాలను పాటించాలని సూచిస్తున్నారు సహారా స్టేట్స్ నివాసితులు.
ఇటీవల కమ్యూనిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సయ్యద్ జానీ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ ఈ నీటి సంరక్షణ ప్రాజెక్ట్ను ఆచరణలోకి తీసుకువచ్చారు. సహారా స్టేట్స్ ని నీటి సమృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఘన మరియు ద్రవ వ్యర్థాల కంపోస్టింగ్ కూడా చేపడుతూ ఇతరులకి ఆదర్శంగా నిలువనున్నారు .
వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులతో నీటి కోసం నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని, ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అందరం కలిసి ఐక్యంగా వర్షపు నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సహారా స్టేట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ జానీ అన్నారు.
ఈ ప్రాజెక్టుకి కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. వాననీటి సంరక్షణ కోసం కమ్యూనిటీ వాసులు కలిసికట్టుగా ముందుకు రావడం అభినందనీయమని ఇగ్నైటింగ్ మైండ్స్ – వాక్ ఫర్ వాటర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డి అన్నారు.
ఈ ప్రాజెక్టుని విజయవంతం చేసి హైదరాబాద్ నగరంలో ఇతర గేటెడ్ కమ్యూనిటీలకి సహారా స్టేట్స్ మార్గదర్శిగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడని ఎదుర్కోవడానికి ఉపకరిస్తాయని, భూతాపాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. వాననీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, ఈసీ సభ్యుడు నరసింహ గౌడ్, దేవాలయ కార్యదర్శి కృష్ణా రెడ్డి, రిటైర్డ్ ఎమ్ఆర్ఓ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.