Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి దిష్టి బొమ్మగా మారిన జగన్ రెడ్డి

– ముఖ్యమంత్రి స్థాయిలో చిల్లర మాటలా ?
– ప్రతిపక్ష పార్టీలకు జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
– రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రిపై గవర్నర్ స్పందించాలి
– జగన్ రెడ్డి- మంత్రి బాలినేని విద్యుత్ దొంగలు
– వీధుల్లో పోరాటాలు..హస్తినలో సాష్టాంగ నమస్కారాలు
– 23 మంది ఎంపీలు ప్రత్యేక హోదా సాధించారా?
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : అసమర్ధత.. అభద్రత…అవినీతి పాలనతో జగన్ రెడ్డి రాష్ట్రానికి దిష్టి బొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ రాష్టాన్ని అగాధంలో నెట్టారని విమర్శించారు. వెంట్రుక పీకలేరంటూ అత్యంత జుగుప్సాకరమైన బజారుభాష మాట్లాడటం జగన్ రెడ్డి నెలకొన్న అసహనానికి, దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే ప్రతిపక్షాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రిపై గవర్నర్ స్పందించాలని శైలజనాథ్ కోరారు. ఈ మేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి చిల్లర మాటలు తగవని శైలజనాథ్ హితవు పలికారు. వెంట్రుక పీకలేరంటున్న జగన్ రెడ్డికి గుండు కొట్టించి సున్నపు బొట్లు పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయని గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో, లేదోనన్న అనుమానం కలిగేవిధంగా పాలన సాగుతోందని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి ప్రతిపక్షాలపై బూతులు లంకించుకోవడం మీ చేతగానితనానికి, అసమర్థతకు అద్దంపడుతోందని ఆరోపించారు.

ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్షాలు, పత్రికలనుద్దేశించి ఇటువంటి బజారుభాష ఉపయోగించడం శోచనీయం…ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని, గత మూడేళ్లుగా మీ అడ్డగోలు, దోపిడీ పాలనను చూశాక మీ వెంట్రుక పీకడం కాదు…రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని శైలజనాథ్ హెచ్చరించారు.

ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ పార్టీ దే
ప్రతిపక్ష నేతగా రైతులకు ఉచిత విద్యుత్…ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం… అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని శైలజనాథ్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి- మంత్రి బాలినేని విద్యుత్ దొంగలు అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని డిస్కంలు పరిశ్రమలకు విద్యుత్ హాలిడే ప్రకటించడం జగన్ రెడ్డి చేతగాని తనానికి నిదర్శనమని విమర్శించారు. విద్యుత్ హాలిడేతో ఒక్క దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే దాదాపు 1700 పరిశ్రమలు మూతపడనున్నాయని, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో మూతపడే పరిశ్రమలతో ఈ సంఖ్య దాదాపు 4 వేలకు పైనే ఉంటుందన్నారు.

ఇంతటి అసమర్ధ పాలకుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేడంటే అతిశయోక్తి కాదని, 2019 లో విద్యుత్ మిగుల రాష్ట్రంగా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ కు ఇంతటి విద్యుత్ కష్టాలు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజలపై భారాలు వేయకుండా దళిత వర్గాలకు ఉచిత కరెంటు , రైతన్నలకు ఉచిత విద్యుత్ అందించారని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు.

కొత్త మంత్రులు వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు
వేల కోట్లు దోచుకోవడం..దాచుకోవడం జగన్ రెడ్డి పార్టీ నాయకుల నైజం అని, మాట తప్పం.. మడమ తిప్పం అన్న జగన్ రెడ్డి 150 మంది శాసన సభ్యుల్లో ఒక్కరి వల్లా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. కొత్త మంత్రులు వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, వీధుల్లో పోరాటాలు చేస్తూ హస్తినలో సాష్టాంగ నమస్కారాలు చేయడం వారికే చెల్లిందని ఆరోపించారు.

23 మంది ఎంపీలు ప్రత్యేక హోదా సాధించారా? అని ప్రశ్నించారు. మంత్రులు ఉన్న, లేకున్నా తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని, కొత్త మంత్రి వర్గం తో ఏం సాధిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలే పేర్లు మార్చారని, జగన్ రెడ్డి వచ్చాక ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాత్రం దక్కించుకున్నారని విమర్శించారు.

LEAVE A RESPONSE