Suryaa.co.in

Andhra Pradesh

ఇలా చెక్క భజన మంత్రులు అవుతారనుకోలేదు

-డమ్మీ మంత్రులే అనుకున్నాం, కానీ ఇలా చెక్క భజన మంత్రులు అవుతారనుకోలేదు
– రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా?

-నాలుగో స్తంభమైన మీడియాను అవమానిస్తారా
-జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత
-తక్షణమే జర్నలిస్టులకు మంత్రి క్షమాపణలు చెప్పాలి
-ఇలాంటి డమ్మీలతో చెక్కబజన చేయించుకుంటున్న జగన్ రెడ్డి
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : సీఎంను ఆరాధిస్తే తప్పక ఇళ్ల స్థలాలు వస్తాయంటూ సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తప్పుపట్టారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి మంత్రి ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. నాలుగో స్తంభమైన మీడియాను పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే అవమానిస్తారా అని ధ్వజమెత్తారు. పాత్రికేయుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాల్సిన మంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లడడం తగదని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని శైలజనాథ్ గుర్తు చేసారు. వారికీ హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్ప మిగతా ప్రభుత్వాలు ఇంతవరకు ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధించాలని, సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయన్న వ్యాఖ్యలను చూస్తే జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వానికి యెంత చిత్తశుద్ధి ఉందొ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. జగన్‌ను ఆరాధించకుండా ఆయన గురించి ఆరా తీస్తున్నారని, అది మానుకొని ఆరాధించాలని, సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని అనడం వారిని అవమానించడమేనని పేర్కొన్నారు. తక్షణమే జర్నలిస్టులకు మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE