– టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్=సీపీఐ=జనసేన
– ముందు సునీల్ దేవధర్.. వెనక సుజనా.. మాటలు సోము వీర్రాజువి.. స్క్రిప్ట్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లోది
– చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి దళపతులైన సుజనా, సీఎం రమేష్ లు బీజేపీలో పెత్తనమా..?
– బీజేపీలో చేరిన ఎంపీలపై అనర్హత వేటు వేయమని టీడీపీ ఎందుకు అడగటం లేదు..?
– తెలుగుదేశం పార్టీ అనుబంధ సభలా బీజేపీ సభ
– ప్రజల్లో బీజేపీ లేదు.. ప్రజల భావోద్వేగాలూ వారికి తెలియవు
– మాయల పకీర్ లాంటి బాబు మానిప్యులేషన్ గేమ్ లో బీజేపీ భాగం కావడంపై జాలేస్తుంది
– ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా జాతీయ పార్టీ పనిచేయడం దేశ చరిత్రలోనే తొలిసారి
– పేదలకు మేలు చేసే ఓటీఎస్ ను వ్యతిరేకిస్తున్నారంటే ఆ పార్టీల ఉమ్మడి కుట్రేంటో ప్రజలు అర్థం చేసుకోవాలి.
– 2018లో 39 లక్షలు ఉన్న పెన్షన్లు 61 లక్షలకు పెరిగాయంటే ఇంతకాలం బాబు మోసం చేసినట్టేగా..!
– కర్నూలు న్యాయ రాజధాని అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది.. మరి, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మద్దతిస్తారో లేదో చెప్పాలి
– వంగవీటి రాధా తనపై రెక్కీ అంటే.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బాబు చాంతాడంత లేఖ రాయడం విడ్డూరం
– బాబు అధికారంలో ఉన్నట్టైతే.. సెక్యూరిటీ అడిగినా, ఇచ్చేవాడు కాదు
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
నాడు వ్యక్తులతో.. నేడు పార్టీలతో బాబు తోలు బొమ్మలాట
నిన్న విజయవాడలో ఒక ప్రహసనం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభలాగా భారతీయ జనతా పార్టీ సభ జరిగింది. దానికి ప్రజాగ్రహ సభ అని పేరు పెట్టారు. వాళ్లు ప్రజల్లో లేరు. ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. అంతకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి మాట్లాడేవారు. అలాంటివాళ్లు బహిరంగ సభ పెట్టాలనుకోవడం అనేది వాళ్ల ఆలోచన అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు ఎజెండాలో భాగంగానే ఈ సభ పెట్టారు. వాళ్లు ఏదైతే అనాలనుకుంటున్నారో దానికి ఇంకో గొంతు కావాలి కాబట్టి, గతంలో సివిల్ సొసైటీ పేరుతో పదిరకాల ఇండివిడ్యూవల్స్‌ను తీసుకొచ్చి, పదిరకాల టీవీ డిబేట్లలో విశ్లేషకులుగా పెట్టి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. అలాంటివారిని ప్రజలంతా గమనించేఉంటారు. మీడియాలో డిబేట్‌లు ఉండాలి కాబట్టి వాళ్లు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. న్యూట్రల్ అభిప్రాయం అనే పేరుతో, సెకండ్ ఒపినీయన్ అనే పేరుతో, ప్రపంచం అంతా ఇదే అభిప్రాయం ఉందని చూపించేందుకు ఇటువంటి ఎత్తులు చంద్రబాబు వేస్తాడు.
వీళ్ళ అందరి టార్గెట్ ఒకటే. ఎరుపులో ఒక పార్టీ సీపీఐ నుంచి.. కాషాయ పార్టీ వరకూ అంతా ఒకటే తాను. టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్=సీపీఐ=జనసేన. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో, న్యాయస్థానం నుంచి దేవస్థానం అని 400మందితో పాదయాత్ర పేరుతో వందకోట్లు వసూలు చేసి తిరుపతి చేరుకుని అక్కడ సభలో వీరిందరు కలిసినప్పుడు ఫర్‌ఫెక్ట్ పిక్చర్స్ వచ్చింది. అది ఏ కారణం కోసం అనేది చూస్తే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అయింది. మొత్తం అందరూ కలిసి ఒకటే స్టాంప్… ఒకటే గొంతు.. అదే “జగన్ మోహన్ రెడ్డిగారిది రాక్షస పాలన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు” అని వరుసపెట్టి స్లోగన్స్ ఇచ్చారు.
మీరు అంటున్న దానిలో వీసమెంత నిజం ఉందో ఆధారాలతో సహా చూపించమంటే దానికి సమాధానం ఉండదు. ఇక బీజేపీ నేత సునీల్ థియోదర్ ట్వీట్స్ అన్నీ పచ్చి అబద్ధపు కూతలే. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా మత మార్పిడులే అని బీజేపీ అంటే.. రెండోరోజు జనసేన ఎత్తుకుంటుంది. మధ్యాహ్నానికి ఇదే విషయాన్ని సీపీఐ రామకృష్ణ మొదలుపెడతారు. ఒకోరోజు పాత్ర మారొచ్చు. ఈ మూడు పార్టీలూ ఒక తానులో ముక్కలుగా తయారయ్యాయి. గతంలో చలసాని శ్రీనివాస్, గరుడ పురాణం శివాజీ మాదిరిగా. .ఒక్కొక్కరుగా ఉంటే ఇప్పుడు పార్టీలు ఆ పాత్రను పోషిస్తున్నాయి.
అప్పట్లో వ్యక్తులను తయారు చేసిన చంద్రబాబు ఇప్పుడు పార్టీలను విజయవంతంగా తన ఫింగర్ టిప్స్‌మీద తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. ఆయన ఏది అనుకుంటే అదే స్టేట్‌మెంట్. మూడు రోజులు పాటు వరుసగా ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడులో బ్యానర్ ఐటమ్ లతో వార్తలు వస్తాయి. వీటిని మూడురోజులు పాటు చదివేవాడికి, ఒకేసారి ఇంతమంది అంటున్నారంటే, అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది అనే అభిప్రాయానికి, అనుమానానికి తీసుకురావాలన్నదే వీళ్ళ ప్రయత్నం. పోనీ ఆరోపణలపై ఆధారాలు చూపిస్తారా అంటే ఒక్కటీ కనిపించదు.
టీడీపీ అనుబంధ విభాగంలా బీజేపీ…
ఇంత పెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ, జాతీయ స్థాయిలో కాకుండా, ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా పనిచేయడం బహుశా దేశంలోనే తొలిసారేమో. చంద్రబాబు నాయుడు అనే దుష్టశక్తి ఎత్తుగడలు, మ్యానిప్లేషన్స్‌లో భాగంగా, తన గేమ్‌లో ప్రతి ఒక్కరినీ పావులాగా వాడుకోగలిగిన, రాజకీయాల్లో మాయల పకీరు లాంటి బాబు ఎజెండాను పట్టుకుని సభ పెట్టడం చూస్తే జాలి కలిగిస్తోంది.
ఆ వేదిక మీద నిలబడి భీకరంగా ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. అందుకే బీజేపీ.. టీడీపీ అనుబంధ విభాగంలాగా పనిచేస్తోందని అనాల్సి వచ్చింది.
జాతీయ పార్టీ అంటేనే దానితో రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేస్తాయి. లేదా కూటమిలో భాగంగా ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయడం చూశాం. బహుశా దేశ చరిత్రలో తొలిసారి ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా జాతీయ పార్టీ పనిచేయడం. ఈ విషయంలో చంద్రబాబు శక్తి మామాలుది కాదు అని
ఒప్పుకోవాల్సిందే. వీళ్లకు తోడు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీ కూడా. అంతమాత్రాన వీరికి అభిప్రాయాలు ఉండకూడదని కాదు, విలువ ఉండకూడదని కాదు. కానీ ఎక్కడకు వచ్చి ఏం మాట్లాడుతున్నారేది ఆలోచించుకోవాలి కదా? ఎవరు వండితే.. దానిని నోట్లో పెట్టుకుని బయటకు వచ్చి కక్కుతున్నారో అందరికీ తెలిసిందే. ఎవరి పాత్రను వాళ్లు సమయోచితంగా, చంద్రబాబు గంట కొట్టగానే రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు వచ్చి వాళ్ల పాత్రలు పోషించి వెళ్లిపోయేరకంగా, ఆ తానులో ముక్కలాగే జాతీయ పార్టీ అయిన బీజేపీ తయారు కావడం పాపం అనిపిస్తోంది,జాలి వేస్తుంది.
నిన్న బీజేపీ సభలో కూడా ముందు సునీల్ దేవధర్, వెనుక సుజనా చౌదరి ఉంటాడు… ముందు మాటలు సోము వీర్రాజువి అయితే… ఆ స్క్రిప్ట్ మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తయారు అవుతుంది. ఆవిషయాన్ని దాచిపెట్టుకోవడానికి కూడా కనీసం వాళ్లు ప్రయత్నం చేయడం లేదు. ప్రజలకు ఏదైనా సమాధానం ఇవ్వాల్సి ఉందంటే అది భారతీయ జనతా పార్టీనే ఇవ్వాలి. ట్రాజెడీ ఏంటంటే టీడీపీ ఎజెండా మోస్తూ.. చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి దళపతులు లాంటి సుజనా చౌదరి, సీఎం రమేష్.. బీజేపీ ప్రజాగ్రహ సభను నడపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంత పెద్ద మేధావులు, చింతన్ బైఠక్‌లు నిర్వహించేవారికి ఇది ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదు.
వాళ్ళిద్దరూ బీజేపీ వేదికపై కూర్చొని టీడీపీ ఎజెండాను నడిపించారు
నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలకు చంద్రబాబు చేతిలో దారుణంగా దెబ్బతిన్న అనుభవం ఉంది. చంద్రబాబు ఎంత ప్రమాదకరమైన శక్తో, వ్యక్తో అని అందరూ దూరంగా పెడుతున్నారు. ” టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని బీజేపీతో చెప్పగానే.. మైనస్ బాబు తప్ప మిగతా అందర్నీ తీసుకువస్తే కలుపుకుంటామన్నారట. దానికి బాబుగారు .. నిన్ను చూపించి మనవాళ్ల అందర్నీ నేను ఇక్కడ ఆపుతాను. లేకుంటే వాళ్లంతా దూకినా దూకుతారు. నువ్వు మాత్రం అందర్నీ కట్టకట్టుకుని తీసుకువస్తానని వాళ్లను నమ్మించు.
బీజేపీతో ఒక చేయి, జనసేనతో మరో చేయి, చిన్నపాటి ఊతం వస్తే ఇన్‌డైరెక్ట్‌గా సీపీఐని కూడా తీసుకురావచ్చు. ఆ రకంగా వచ్చే ఎన్నికల్లో మనం ఒక పవర్‌ఫుల్ కూటమిగా మారి, మనమే లీడ్ చేసి తానే ముఖ్యమంత్రిని అవుతాననే భ్రమతో పార్టీని ఈ రెండేళ్లపాటు లాగితే… ఆరోజుకు పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకుందాం అనే ఏర్పాటే ఇదంతా..” అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకోసమే వీళ్లిద్దరూ బీజేపీ వేదిక మీద కూర్చుని టీడీపీ ఎజెండాను సక్సెస్‌ఫుల్‌గా నడిపించగా…. వాళ్లను చూపిస్తూ చంద్రబాబు తన పార్టీలో వాళ్లను బుజ్జగిస్తూ మునిగే పడవలో మనమెందుకు అనేవాళ్లను ఆపేసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారనేది విశ్లేషకుల పరిశీలన. అది నిజం కూడా కావచ్చు.
రాజ్యాంగాన్ని అవమానించేలా టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్… బీజేపీ అఫిషియల్ ఎంపీలుగా వ్యవహరిస్తుండటం, వారిని మీడియాతో సహా అంతా బీజేపీ ఎంపీలుగా గుర్తించేసి, యాక్సెప్టెన్స్ ఆ లెవల్‌కు తీసుకువెళ్ళారు. టీడీపీ పొరపాటున కూడా వారిపై అనర్హత వేటు వేయమని అడగదు. సంప్రదాయంగా అయినా వారిపై అనర్హత వేటు వేయాలని ఎందుకు అడగడం లేదు. రాజ్యసభ చైర్మన్ గారు అంతకు ముందు పార్టీ ఫిరాయించి వారిపై ఒక్కరోజులోనే అనర్హత వేటు వేసిన ఆయన.. ఈ ఇద్దరిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదు. ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు. మళ్ళీ వీళ్ళు అందరూ రాజ్యాంగం గురించి మాట్లాడతారు.
బీజేపీ నాయకులకు ఇదంతా తెలియనిది కాదు. వాళ్లంత భ్రమల్లో ఉంటారనుకుంటారనుకోను. 2024లో తమని ఎన్నుకుంటే రూ.50కే బ్రాందీ ఇస్తానని ఒకాయన, ఒకవైపు స్కామ్ రాజధాని అమరావతి అంటూనే మూడేళ్లలో అమరావతిలో రాజధాని కట్టేస్తామని అని మరొకాయన చెబుతారు. విచిత్రం ఏంటంటే మొన్న జరిగిన తిరుపతి సభలో కూడా వీళ్ళంతా కలిశారు. బీజేపీ వాళ్లు కర్నూలులో హైకోర్టు, ఇక్కడ రాజధాని ఉండాలని చెప్పే మీరు… మరి విశాఖలో ఏమి వద్దు అనుకుంటే అదే చెప్పండి.
హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్నది మీరే కదా..!
గతంలో చంద్రబాబుతో అధికారం పంచుకున్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఏపీకి అయిదేళ్లు కాదు, పదేళ్లు ప్ర్తత్యేక హోదా ఇవ్వాలని చెప్పింది వాస్తవం కాదా? ఆ తర్వాత తిరుపతి సభలో మోదీ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అని చెప్పారు. అదే 2017లో హోదా లేదు ప్యాకేజీ ముద్దు అంటారు. ఆ ప్యాకేజీ ముద్దు అన్న వీళ్ళు ఆ రోజు హోదా అడగలేదు. ప్యాకేజీనే ముద్దు అన్నారు. మాకేమీ బాధ్యత అని ఇవాళ బీజేపీ వాళ్లు అంటున్నారు. ఇక బీజేపీ మిత్రుడు అయిన పవన్ కల్యాణ్ పోరాడాల్సింది మీరు అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రైవేటీకరణ తప్పదని వాళ్లే అంటారు. పైపెచ్చు వైయస్సార్ సీపీ ఎంపీలు ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తుంటారు. ఇవ్వాల్సింది మీరు, నచ్చచెప్పాల్సింది మీరు.. మాపై విమర్శలు చేస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తుందా? లేక టీడీపీ తరపున బీజేపీలో పనిచేస్తున్నారా? అన్నది చెప్పాలి. దీనికి టీడీపీ అయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా?
రాజధాని కట్టాలనుకుంటే బాబుకు ఎవరైనా అడ్డొచ్చారా..?
అయిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజధానిని కట్టాలనుకుంటే ఎవరైనా అడ్డం వచ్చారా? దానికి సమాధానం లేదు. అసలు ఏం జరుగుతుందో, ఇంతటి ప్రహసనం, హాస్యాస్పదమైన విషయం, దిగజారుడు రాజకీయం అన్నా… రాజకీయాన్ని కూడా అవమానించినట్లు అవుతుంది. ఇంత దిగజారుడు వ్యభిచారం లాంటి వ్యవహారం, బహుశా అనైతికం కూడా దాటిపోయింది. మా పార్టీని, జగన్ మోహన్ రెడ్డిగారిని ఎదుర్కొనేందుకు ఎవరికి వారు ప్రత్యేకమైన, సొంత ఎజెండా పెట్టుకోలేకపోతున్నారు. ఫలానా లోపం ఉందంటూ ఆధారాలతో సహా ఎత్తి చూపలేకపోతున్నారు.
ఓటీఎస్ పై దుష్ప్రచారం చూస్తే.. వీళ్ళు ఎంతకైనా బరితెగిస్తారనిపించింది
ఓటీఎస్ మీద టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారం చూస్తే నిజంగానే వీళ్లు ఏదైనా చేయగలరు అనిపించింది. ఓటీఎస్ స్వచ్ఛందమే ఎలాంటి నిర్బంధం లేదని ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసినా అవాస్తవాలు ప్రచారం చేశారు. గతంలో వడ్డీ కూడా మాఫీ చేయని టీడీపీ.. ఇవాళ రోడ్లు ఎక్కి ధర్నాలు, దీక్షలు చేయగలుగుతుంది అంటే స్వచ్ఛందం అయినదాన్ని దోపిడీగా చూపే ప్రయత్నం చేయగలుగుతున్నారు. పది రోజులు అయ్యేసరికి ఓటీఎస్ అంటే అదేదో బూతు మాటలాగా చేయగలిగారంటే… ఈ అరేంజ్‌మెంట్స్ వల్లే అది సాధ్యం అవుతుంది. పది తలల రావణాసురుడిలా ముందు చంద్రబాబు ఉంటే.. మిగతా శక్తులు అన్నీ ఆయన వెనక ఉంటారనుకుంటా. వీటన్నింటిని వండివార్చే టీవీ చానల్స్, ఆ రెండు పత్రికలు వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
రాజధాని అంశం, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, ఓటిఎస్, సినిమా టికెట్లు, ఉద్యోగ సంఘాలతో చర్చలు.. ఈ అంశాలలో వాస్తవాలను మసిపూసి మారేడుకాయను చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అనేవి లోపాలను ఎత్తి చూపడంలో తప్పులేదు. ఇక్కడ పొరపాటు జరిగింది. అదే మేము అయితే ఇలా చేసేవాళ్లమని చెబితే బాగుంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు.. ఇక్కడకు వచ్చి ఈ ప్రభుత్వంలో చిరుగులు వెతకాలని చూడటం విడ్డూరం. మాట్లాడేటప్పుడు ఎదుటవాళ్లు పాయింట్ అవుట్ చేస్తారని కనీసం ఆలోచిస్తే బాగుంటుంది. ఒక వేలు ఇలా చూపిస్తే.. మిగతా నాలుగు వేళ్ళు మీవైపు చూపిస్తాయనే ఇంగిత జ్ఞానం ఉండాలి.
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా పథకాలకు వాళ్ల పేర్లు పెట్టుకోవడం సహజం. రాష్ట్రాలు ట్యాక్స్ కడితేనే కేంద్రానికి ఆదాయం వచ్చేది. అది నోషనల్ సిస్టమ్ తప్ప, మీకేం అయినా ప్రత్యేకమైన టెరిటరీ ఉందా? రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్నే మీరు కొంత వెనక్కి ఇస్తున్నారనేది మరిచిపోతే ఎలా? ఇవాళ ఏమైనా కొత్తగా ఈ సంప్రదాయం ఉందా? కేంద్రం దయాదాక్షిణ్యాలతోనే బతుకుతున్నట్లు మాట్లాడితే ఎలా? పరిపక్వత ఉన్న నాయకులు ఇలాగేనా మాట్లాడేది?
ఇదే చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్లను గ్రౌండ్ ప్లస్ త్రీ ఎలా కట్టించారు. ఆ ఇళ్లల్లో పేదలను ఎలా ఉంచుదామనుకున్నారని సూటిగా అడుతున్నాం? పెద్దవాళ్లు ఎలా మెట్లు ఎక్కి దిగుతారని ప్రశ్నిస్తున్నాం. పైగా మూడువందల చ. అడుగులకు ముడు లక్షల అప్పువేసి 20ఏళ్లు కట్టుకోమని వాళ్ల నెత్తిన వేశారే? ఆంధ్రజ్యోతిలో ఆ మూడు లక్షలు తీసేశారు కదా, మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు పదివేలు అడుగుతున్నారని అడ్డగోలు రాతలు రాస్తారు?
తమిళనాడులో 14 శాతం డీఏ పెంచితే అద్భుతమా.. అదే ఇక్కడ అయితే మోసమా..?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఒకేసారి 14 శాతం డీఏ ప్రకటన అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది. అదే ఇక్కడ అయితే డీఏలతో సరిపెడుతున్న జగన్ మోహన్ రెడ్డి, మోసం గురూ… అని హెడ్డింగ్ లు పెట్టి రాస్తారు. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని. దీన్ని పట్టుకుని టీడీపీ, బీజేపీ ఆ తర్వాత రెండునెలలకు ఒకసారి పవన్ కల్యాణ్ వచ్చి మాట్లాడటం సిగ్గుచేటు. ఈ ఛండాలమైన డ్రామా రాష్ట్రంలో నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది కాబట్టి , పోనుపోనూ ఈ డ్రామా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.
మా ప్రభుత్వం శాచురేషన్ బేసిస్ మీద ప్రతిదీ చేసి చూపిస్తున్నాం. అనర్హులను తీసివేస్తూ.. అర్హులకు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఆఖరుకు జగన్‌గారి శాచురేషన్ పద్ధతి ఏవిధంగా వెళ్లిందంటే.. సంక్షేమ పథకాలకు ఇవ్వగా, ఇంకా ఎవరైనా అర్హులుంటే వారికి ఇవ్వాలంటూ నిన్ననే రూ.705 కోట్లు విడుదల చేశారు. ఇది ముఖ్యమంత్రి జగన్ గారి నిజాయితీ, నిబద్ధత. అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే ఆయన తీసుకునే నిర్ణయాలను జనం నమ్ముతున్నందునే, వరుసగా జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ సీపీకి పది, పదిహేను శాతం ఓటింగ్ పెరిగింది. ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇది వాస్తవ పరిస్థితి. వీటన్నింటీని ప్రజలు గమనించాలి.
విలేకర్లు ప్రశ్నలకు సమాధానమిస్తూ…
అధికారంలోకి వస్తే.. మద్యం ధరల తగ్గిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతున్నాడు. బీజేపీ ఎలాగు అధికారంలోకి రాదు కాబట్టే సోము వీర్రాజు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారేమో. బహుశా, జాతీయ స్థాయిలో ఇదే పాలసీని ఆ పార్టీ నేతలు చర్చించి అమలు చేస్తారేమో చూడాలి. చంద్రబాబు నాయుడే మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమతో… బహుశా బీజేపీ వాళ్లతో ఆ మాట చెప్పించి ఉంటారనుకుంటాను.
మద్యం విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో అందరూ చూశారు. మద్యం ధరలను రేషనలైజ్ చేసి రీజనబుల్‌గా రేట్లు తగ్గించాం.జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత ఏమిటో ప్రతి ఎన్నికల్లో రుజువు అయింది. ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచారు, ఉన్నారు కూడా. దాన్ని పోగొట్టాలంటే ఇది పద్ధతి కాదు. బురదవేసో, రాయో రప్పో వేయడం సరికాదు. ‘నువ్వు భ్రమ తప్ప, ఏమీ చేయడం లేదు. నీ చేతిలో మోసపోయాం అని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఏ జనం అయితే మిమ్మల్ని (చంద్రబాబు) చెత్తబుట్టలో పడేశారో.. ఆ జనమే అనుభవపూర్వకంగా జగన్ మోహన్ రెడ్డిగారే సరైన నాయకుడు, ఆ పార్టీనే సరైన పార్టీ అనుకున్నారు కాబట్టే… మా పార్టీ అన్ని స్థానాలలో గెలవగలిగింది’. దానికన్నా ఫ్రూప్ ఇంకేముంది.
బీజేపీ వాళ్ళు ఉత్తరాంధ్రలో ఏ ఉద్యమం చేస్తారో?, దానికంటే ముందు చెప్పాల్సింది కర్నూలును న్యాయ రాజధాని అని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరోవైపు అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇక విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మద్దతు ఇస్తారా లేదా అనేది చెప్పి, ఏ ఉద్యమం చేస్తారో చేసుకోవాలి.
చంద్రబాబు రాసిన లేఖను చూస్తే నవ్వు వస్తోంది. వంగవీటి రాధాకు భద్రత కల్పిస్తామని ప్రభుత్వమే చెప్పింది. దీనిమీద 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. వంగవీటి రాధా ఓ సభలో తనపై రెక్కీ నిర్వహించారని చెప్పిన మాటలను పట్టుకుని.. గూండారాజ్, హింసారాజ్ అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చాంతాడంత లేఖ రాయడం ఆశ్చర్యమేస్తోంది.
చంద్రబాబు, తానే తుమ్ముకుని, తానే శ్రీరామ అనుకునే బాపతు. రాధా మాటలను పట్టుకుని, రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందని చంద్రబాబు మాట్లాడటం సరికాదు. ఈ అంశంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందిస్తే… చంద్రబాబు దానిపై లేఖ రాయడం చూస్తే ఆయనకు ఏమనాలో కూడా అర్థం కావడం లేదు.