* అన్ని శాఖల నుంచీ ఏం చేస్తున్నారో తెలుసు
* వస్త్ర వ్యాపారం కోసం ఆప్కోకీ దెబ్బ
* మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
సకల శాఖల నుంచి పర్సంటేజీ వసూలు చేసే ప్రధాన బ్రోకర్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పని చేస్తున్నారని, ప్రతి శాఖకు టార్గెట్లు పెట్టారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “సాధారణ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి వందల కోట్లు ఎలా పోగు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. బ్రోకర్ సినిమాలో ఆర్పీ పట్నాయక్ రోల్ తరహాలో సజ్జల చెలరేగిపోతున్నారు. ఇన్ని తప్పుడు పనులు చేయడంతోనే భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పడానికి కూడా సజ్జల భయపడుతున్నారు.కోనసీమ అల్లర్ల ఘటనలో ప్రధాన నిందితుడు మీతో ఫోటోలు దిగితే దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు? మీ బ్రోకర్ పనులను ప్రజలంతా గమనిస్తున్నారు. వారు ఇక ఉపేక్షించరు.
* ఇసుక… మద్యంలోనూ పర్సెంటేజీలే!
ఇసుక రవాణా, నిర్వహణను జేపీ వెంచర్స్ సంస్థకు కట్టబెట్టి, ఏక మొత్తంలో వందల కోట్లు దండుకున్నారు. రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లను దింపి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ వివిధ డిస్టలరీల నుంచి వందల కోట్లు పిండుకుంటున్నారు. మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి వందల కోట్లు సంపాదిస్తున్నారు. గుడివాడ క్యాసినో అంశంలోనూ మాజీ మంత్రి కొడాలి నాని దగ్గర నుంచి భారీ మొత్తంలో లాక్కున్నారని చెబుతున్నారు. భయపెట్టి, బెదిరించి ఎంత మంది దగ్గర ఇలా దోపిడీ చేస్తారు.? మీ దోపిడీపైన జనసేన పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది.
* ప్రేక్షకులపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా?
సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తే పేదవాడికి వినోదం అందుతుంది అన్నట్లు చెప్పారు. మరి ప్రేక్షకులు మీద ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా? వారికి రీ కౌంటింగ్ ఫీజు 500 రూపాయలు పెట్టడంలో ఆంతర్యమేమిటి? రెండు లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారో సమీక్ష లేదు. వారి వద్ద నుంచి డబ్బులు దండుకునే ధ్యాస తప్ప ఇంకేం లేదు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెట్టి, వారిని ఇష్టం రీతిన బదిలీ చేసి వేధించింది ప్రభుత్వమే. ఈ కారణం చేతనే విద్యా వ్యవస్థలో లోపాలు ఏర్పడ్డాయి. దానిని రాష్ట్ర ప్రధాన సలహాదారుగా సరిచేయడానికి సలహాలు ఇవ్వాల్సిన సజ్జల దాని గురించి ఏ మాత్రం పట్టదు. తన కుటుంబ వస్త్ర వ్యాపారం కోసం ప్రభుత్వరంగ సంస్థ ఆప్కోని నిర్వీర్యం చేయడానికి సజ్జల చేస్తున్న ప్రయత్నాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెడతాం. మరోసారి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు” అన్నారు.