-పోలవరం నిర్వాసితనిర్వాసితుఏదీ ?
-బాధితులకు అందని పునరావాస సహాయం
-వరదలు ప్రభుత్వానికి చెప్పి వస్తాయా?
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
జంగారెడ్డి గూడెం : వరద సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయం చేయడం తగదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. తాడేపల్లి ప్యాలస్ లో కూర్చుని బాధితులను వారి మానాన వారిని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి రూ. 10 లక్షల నష్ట పరిహారం తక్షనమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వరదలు చెప్పి వస్తాయా ? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని, పోలవరం ముంపు బాధితులకు తక్షణం పరిహారం అందించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఎన్ ఆర్ జీ ఎస్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఆయన జంగారెడ్డి గూడెంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత ప్రభుత్వం మాట అటుంచితే మీరు మూడేళ్ళలో ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. వరద బాధితులకు రూ.25వేలు తక్షణ సాయం ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయని, జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే వరద నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై రాష్ట్రం ప్రభుత్వం ఒత్తిడి తేవాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.
కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి
రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చక పోయినా వంగి వంగి ఓట్లు వేశారని శైలజనాథ్ ఆరోపించారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు దిష్టి బొమ్మలుగా మారారని ఆరోపించారు. ప్రభుత్వం కచ్చితంగా ప్రజల సమస్యను తీర్చాలని, స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.