Home » ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు…

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు…

ఒకటో తేదీన జీతాలొచ్చేయోచ్!
– ఠంగు ఠంగుమన్న ‘శాలరీ శబ్దాల’తో ఖుషీ
– థ్యాంక్స్.. బాబూ అంటున్న ఉద్యోగులు
– ఐదేళ్ల తర్వాత ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు
– మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
– జగన్ హయాంలో 15 వ తేదీ వరకూ ఎదురుచూపులే
– ఖుషీ అవుతున్న ఆంధ్రా ఉద్యోగులు
– తెలంగాణలో కేసీఆర్ జమానాలో జిల్లాల వారీగా జీతాలు
– రేవంత్ వచ్చాకే జీతాలకు మోక్షం
– అప్పట్లో రెండుచోట్లా నోరెత్తని ఉద్యోగ సంఘాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు.. ఇది కలా? నిజమా?.. ఉదయం ఎనిమిదన్నర నుంచి, మద్యాహ్నం పన్నెండుగంటల వరకూ.. తన సెల్‌ఫోన్లలో ఠంగుమంటూ వినిపించిన శబ్దాలను చూసి, మురిసిముక్కలయిన ఆంధ్రా ఉద్యోగుల ఆనందం ఇది. ఐదేళ్ల తర్వాత ఒకటో తేదీన జీతాలు అందుకున్న ఏపీ ఉద్యోగుల ఆనందం వర్ణనాతీతం.

ప్రతి నెల ఒకటో తేదీన జీతాలకు ముఖం వాచిపోయిన ఏపీ ఉద్యోగులు.. ఐదేళ్ల తర్వాత, మళ్లీ ఒకటో తేదీన జీతాలందుకునే పాతరోజులకు చేరారు. తాము అధికారం లోకి వస్తే ప్రతి నెల ఒకటోతేదీనే జీతాలిస్తామని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు జులై1న జీతాలిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ కలిగింది.

జగన్ ఊడ్చివెళ్లిన ఖజానా.. 15 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి రోజుకు 90 కోట్లరూపాయల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. పైగా ఉద్యోగులు-పెన్షన్ల జీతాలకు ప్రతినెలా 5500 కోట్ల రూపాయలు అవసరం. దానికితోడు పాతబిల్లుల పెండింగ్ బకాయిల నేపథ్యంలో.. ఉద్యోగులకు జులై ఒకటిన జీతాలు ఎలా చెల్లిస్తారన్న ఉత్కంఠ, అన్ని వర్గాల్లో వ్యక్తమయింది. అటు వైసీపీ కూడా ఒకటో తేదీన జీతాలివ్వకపోతే, విమర్శలు గుప్పించేందుకు సిద్ధమయింది.

కానీ అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ.. చంద్రబాబు సర్కారు.. ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే జీతాలు చెల్లించి.. ఉద్యోగుల పెదవులపై చిరునవ్వులు పూయించింది. అటు పెన్షనర్లకు సైతం పెన్షన్ల కోసం, సీఎఫ్‌ఎంఎస్ గ్రీన్‌చానెల్‌లో పెన్షన్ బిల్లులు పెట్టింది. దానితో వారి పెన్షన్లకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లయింది.

దీనికోసం బాబు సర్కారు.. తన అవసరాలను పక్కనపెట్టి, ఉద్యోగుల జీతాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఆ మేరకు ఆర్ధిక అవసరాలపై కసరత్తు చేసిన బాబు సర్కారు, సామాజిక పెన్షన్లకు 4 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేసింది. దానికితోడు వాలంటీర్ల జీతాలు కూడా నిలిపివేయడంతో, ఖజానాపై కొంత ఆర్ధిక భారం తగ్గి, ఆదా అయింది.

నిజానికి కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలివ్వడం సంప్రదాయంగా వస్తోంది. కానీ జగన్ సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయి, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని అగమ్యగోచర పరిస్థితి తలెత్తింది. ఆ ప్రకారంగా ఐదో తేదీ నుంచి 15 వ తేదీవరకూ ఉద్యోగులు- పెన్షనర్లు.. సెల్‌ఫోన్ మెసేజ్ కోసం చకోరపక్షుల్లా ఎదురచూడాల్సిన దుర్గతి పట్టింది. బటన్ల నొక్కుడికే ఉన్న డబ్బులు ఖర్చు చేసిన జగన్ సర్కారు., ఉద్యోగుల జీతాల అంశానికి చివరి ప్రాధాన్యం ఇచ్చింది.

అయినా ఉద్యోగ సంఘ నేతలు కిక్కురుమనేవారు కాదు. ప్రశ్నిస్తే ఎక్కడ ఏసీబీని ఉసిగొల్పుతారనే భయంతో.. నవరంధ్రాలూ మూసుకుని, జగన్ సర్కారు ఇచ్చినప్పుడు తీసుకునేవారు. ఫలితంగా మిగిలిన ప్రధాన డిమాండ్లు పక్కనపెట్టి.. అసలు ప్రతి నెల జీతాలు వవస్తే, అదే పదివేలనుకుని తృప్తిపడాల్సిన పరిస్థితి ఉండేది.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఎన్నికల హామీలో, ఉద్యోగులకు ప్రతినెలా ఒకటిన జీతాలను చేర్చారు. అనుకున్నట్లుగానే తొలి నెలలో ఉద్యోగులకు జీతాలిచ్చి.. ఐదేళ్ల తర్వాత వారి పెదవులపై చిరునవ్వులు పూయించారు. ఉదయం నుంచి ఠంగు ఠంగుమన్న ‘శాలరీ శబ్దాల’తో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉద్యోగులు, మాటనిలబెట్టుకున్న చంద్రబాబుకు, థ్యాంక్స్ బాబూ.. అని కృతజ్ఞతలు చెబుతున్నారు.

అటు తెలంగాణలో కేసీఆర్ జమానాలో కూడా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలిచ్చే సంప్రదాయం అటకెక్కింది. ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీన జీతాలిచ్చే దుస్థితిని, రేవంత్‌రెడ్డి సర్కారు మార్చివేసింది. తెలంగాణలో కూడా నిర్ణీత సమయానికే జీతాలిచ్చి ఉద్యోగులను మెప్పించారు. అంటే ప్రభుత్వాలు మారితే తప్ప.. ఉద్యోగుల ఒకటోతారీఖు జీతాలకు మోక్షం రాలేదన్నమాట.

Leave a Reply