– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చూపించిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు గురువారం శ్రీకాకుళం నుండి సామాజిక న్యాయభేరి పేరుతో వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత మూడేళ్లలో అమలు చేసిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు బస్సు యాత్రలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కృషికి ప్రజలకు చాటిచెబుతూ యాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోందని అన్నారు. శ్రీకాకుళంలో మ్రోగిన సామాజిక న్యాయభేరి రాష్ట్రమంతటా వినిపిస్తోందని అన్నారు.