-
నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
-
సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగ్-చైతన్య ఒత్తిడి చేశారన్న సురేఖ
-
సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి ఆరోపణ
-
నాగార్జున-సమంతపై సురేఖ వ్యాఖ్యలు ఖండించిన సినీ పెద్దలు
-
మంత్రి వ్యాఖ్యలు ఖండించిన జూనియర్ ఎన్టీఆర్, ప్రకాష్‌రాజ్, పోసాని, రోజా, వర్మ
-
నాడు జిత్వానీని జైలులు పంపిన జగన్ చర్యను ఖండించని సినీ పెద్దలు
-
సమంత తెలుగునటి కాకున్నా నాగార్జునకు సినీ పెద్దల మద్దతు
-
మరి జిత్వానీ అరెస్టును ఎందుకు ఖండించలేదంటున్న సినీ ‘నెటిజనం’
-
జగన్‌ను చూస్తే ఫ్యాంట్లు తడుస్తాయా అంటూ ఎద్దేవా
-
మీ సినిమా టికెట్ల రేట్లు పెంచరన్న భయమా అంటూ ప్రశ్నల వర్షం
-
నాగార్జునకు ఒక రూలు.. జిత్వానీకి ఇంకో రూలా అంటూ లా పాయింట్లు
-
తమ్మారెడ్డి, ఎన్టీఆర్, పోసాని, శివాజీ, రోజా, అలీ, వర్మ, నట్టికుమార్ స్పందిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు సినిమా పెద్దలు ధృతరాష్ర్టపాత్ర పోషిస్తున్నారా?.. పైసలు, పలుకుబడి ఉన్న వారి చంకెక్కే పద్ధతి ఇంకా కొనసాగిస్తున్నారా? నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండించేందుకు చూపిన ఉత్సాహం, నటి జిత్వానీ అరెస్టుపై ఎందుకు చూపలేదు? సమంత తెలుగునటి కానప్పుడు, జిత్వానీ కూడా తెలుగునటి కాదు కదా? మరి ఆగ్రహం-ఆవేదన-రోదన-వేదనలో ఎందుకీ పక్షపాతం? అప్పుడు జిత్వానీని అరెస్టు చేయించిన జగన్‌పై ఈ ఫైర్ ఏదీ? ఈ ఏడుపులూ పెడబొబ్బలు ఏవీ? అప్పుడు ఈ సినీ పెద్దలు ఎందుకు నవరంధ్రాలు మూసుకున్నారు? జగన్‌ను చూస్తే ఫ్యాంట్లు ఎందుకు తడిపేసుకున్నారు? బడా హీరోల బాక్సులు బద్దలవుతాయన్న భయమా? జిత్వానీకి ఒక న్యాయం- నాగార్జునకు మరో న్యాయమా? వాటీజ్ దిస్ నాన్సెన్స్? అసలు సినీ ఇండస్ట్రీ పెద్దలు కళ్లున్న ధృతరాష్ర్టులా?.. ఇదీ ఇప్పుడు సినీ పరిశ్రమ తీరుపై, సినీ ‘నెటిజనం’ విమర్శనాన్త్రాలు.
తన ఎన్ కన్వెన్షన్ రక్షణ కోసం నాగార్జున ఫ్యామిలీ అనైతిక వ్యవహార తీరుపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల రగడ-చర్చ ఇంకా కొనసాగుతోంది. ఈ చర్చ సినీ పెద్దల ధృతరాష్ట్ర ప్రేమ దిశగా సాగుతోంది.
నాగార్జున ఫ్యామిలీపైమంత్రి సురేఖ చేసిన ఆరోపణలను.. జూనియర్ ఎన్టీఆర్, రోజా, ప్రకాష్‌రాజ్, పోసాని, రాంగోపాల్‌వర్మ తదితరులు ఖండించారు. వీరిలో అందరికంటే మంత్రి వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆరే ఎక్కువగా బాధపడిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై.. టీ డీపీ సోషల్‌మీడియా సైనికులు, ఘాటైన పదజాలంతో వాతలు పెడుతూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు సినిమాలను ప్రేమించే సినీ నెటిజన్లు రంగంలోకి దిగి.. తెలుగు సినీ పెద్దల తీరును వాషింగ్‌పౌడర్ నిర్మాతో, బ్రష్ పెట్టి మరీ కడిగేస్తున్నారు. సమంతను అవమానించారని కొందరు.. నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ తప్పుడు ఆరోపణలు చేశారని మరికొందరు.. టన్నుల కొద్దీ కారుస్తున్న కన్నీరును, సినీ నెటిజన్లు తుప్పు వదిలేలా కడిగిపారేస్తున్నారు.
ఈ సందర్భంగా ముంబయి నటి జిత్వానీని తెరపైకి తీసుకువస్తున్నారు. జిత్వానీని జగన్ సర్కారు ముంబయి నుంచి చెరబట్టి.. బె జవాడకు తీసుకువ చ్చి, జైల్లో వేసిన ఘటనను, నాగార్జున ఎపిసోడ్ లో గుర్తు చేస్తున్నారు. జిత్వానీని అరెస్టు చేసినప్పుడు మౌనంగా ఉన్న తెలుగు పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా సినీ పెద్దలు ఆత్మరక్షణలో పడటం అనివార్యంగా మారింది.
జిత్వానీ కూడా సినీ నటే కదా? మరి ఆనాడు జగన్ ప్రభుత్వం ఆమెను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో వేసినప్పుడు ఈ ఎన్టీఆర్.. ఈ పోసాని.. ఈ ప్రకాష్‌రాజ్.. ఈ రోజా ఎక్కడ ఉన్నారు? గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా? అప్పుడు జగన్ ప్రభుత్వ చర్యను ఖండించి, జిత్వానీకి తెలుగు పరిశ్రమ ఎందుకు మద్దతుగా నిలవలేదు? అప్పుడు ఇంత ధైర్యంగా ఎందుకు ట్వీట్లు చేయలేదు? జగన్‌ను చూస్తే ఫ్యాంట్లు ఎందుకు త డిపేసుకున్నారు? మీ బాక్సులు బద్దలుకొడతారని భయపడ్డారా? మరి నాగార్జునను మంత్రి వ్యక్తిగతంగా అంటే మీకెందుకు ఉలుకు? అంత ఐక్యత జిత్వానీ అరెస్టు అప్పుడు ఏమైంది? అంటూ సినీ నెటిజన్లు.. తెలుగుసినీ పెద్దలపై, సోషల్‌మీడియాలో ఒంటికాలితో లేస్తున్నారు.
పోనీ జిత్వానీ అరెస్టు విషయం, అప్పట్లో బయటకు తెలియదనుకున్నప్పటికీ.. నెల క్రితం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకు ఖండించలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తనను ఏపీ ఐపిఎస్ అధికారులు.. ఏవిధంగా హింసించారో స్వయంగా మీడియాకు వెల్లడించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయినప్పటికీ ఎన్టీఆర్, ప్రకాష్‌రాజ్, రాంగోపాల్‌వర్మ, రోజా, పోసాని ఖండించకపోవడాన్ని సినీ అభిమానులు తూర్పారపడుతున్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
కాగా తాజాగా నాగార్జున ఫ్యామిలీకి, సినిమా పెద్దలు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో.. హటాత్తుగా జిత్వానీ అరెస్టు అంశంపై ‘వ్యూహాత్మక మౌనవ్రత’ వ్యవహారం, సినీ పెద్దలకు ఇరకాటంగా పరిణమించింది. దీనిపై సోషల్‌మీడియా వేదికగా.. సినీ అభిమానులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు, సినిమా పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దానితో నాగార్జున అంశంపై అత్యుత్సాహం ప్రదర్శించిన వారంతా ఇప్పుడు జిత్వానీ అరెస్టుపై మౌనానికి కారణమేమిటో స్పందించాల్సిన అనివార్య పరిస్థితి.
మరి దీనిపై తెలుగు సినిమా సోషలిస్టు తమ్మారెడ్డి భరద్వాజ, జగన్ వీరభక్తుడు పోసాని, జగన్ పదవి ఇచ్చిన అలీ, జగన్ కళ్లలో మెరుపుల కోసం సదా పరితపించే రాంగోపాల్‌వర్మ, మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే జగన్ ముందొస్తారన్న రోజక్క.. సినీరంగ వ్యవహారంపై చురుకుగా ఉండే శివాజీ, నిజాలు నిర్భయంగా మాట్లాడే నిర్మాత నట్టికుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎలాగూ ఇలాంటి ప్రశ్నలు వేసే ధైర్యం, సినిమా జర్నలిస్టులకు సహజంగా ఉండదు. ఒకవేళ ప్రశ్నిస్తే సదరు జర్నలిస్టును మళ్లీ ఏ ప్రెస్‌మీట్లకూ పిలవరన్నది బహిరంగమే. సినిమా జర్నలిస్టులలో సగంమంది హీరోలు, నిర్మాతలకు పీఆర్వోలే. జర్నలిస్టులతో సినీ పెద్దలు పెద్దగా మాట్లాడే ధైర్యం చేయరు. కాబట్టి జిత్వానీ అరెస్టుపై తమ మౌనానికి కారణాలను సినీ పెద్దలు, ఎక్స్ వేదికగా ట్వీట్ చేయాల్సిందే. మరి అంత దమ్ము వారికి ఉందా?