• పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలి
• జిల్లా కలెక్టర్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు
గుర్ల: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన అనంతరం ఉపముఖ్యమంత్రి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లతోను, అధికారులతోను సమీక్షించారు.
ఈ సందర్భంగా పెద పెంకిలో నెలకొన్న బోద వ్యాధి సమస్య, ఆ వ్యాధి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. పరిసరాలు పరిశుభ్రత, ఇతర ఆరోగ్య చర్యలు తీసుకోవాలి. కొద్ది సంవత్సరాల క్రితం బలిజిపేట ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. ప్రజలకు ఈ సమస్యపై అవగాహన కల్పించాలి’ అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టామని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు, కాలువల శుభ్రత, తుప్పలను తొలగించడం, దోమలు నివారణ చర్యలు చేపడుతున్నట్లు, ఫాగింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు.
తాగు నీటి పథకాల వద్ద శుభ్రత పాటించడటం తోపాటు క్లోరినేషన్ చేస్తున్నామన్నారు. పెద పెంకిలో ప్రత్యేక చర్యలు చేపట్టడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఆ గ్రామంలో 19 రౌండ్లు మందులు సరఫరా చేశామని, మైక్రో ఫైలేరియా లార్వా సర్వే కోసం ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు.