-నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న TSLPR బోర్డు
-బోర్డు నిర్వాకంతో అర్హత కోల్పోయిన లక్షలకు పైగా అభ్యర్థులు
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
పోలీసు నియామకాలకు సంబంధించి పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను సవరించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నప్పటి ప్రభుత్వం స్పందించక పోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తప్పుబట్టారు. ఇదే విషయంపై తాను బహిరంగ లేఖ రాసినప్పటికీ ఈ సర్కార్ దున్నపోతుపై వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని ఆయన మండి పడ్డారు.పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల నిర్వహణలో లోపాలు, దేహదారుడ్య పరీక్షల నిబంధనలు వెంటనే సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పరీక్ష కోసం సిద్ధం అవుతున్న అభ్యర్తులు కరీంనగర్ లో బండి సంజయ్ ను కలిశారు.ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పాత నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించేలా చేయాలని వారు సంజయ్ ను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను TSLPR బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని సంజయ్ అన్నారు.
లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో ఏ రాష్ట్రం లో కూడా లేని నిబంధనలను TSL పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పొందుపరిచిందని ఆయన విమర్శించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ లో కూడా ఈ స్థాయి నిబంధనలు లేవని ఆయన అన్నారు.ఈ నిబంధనల వల్ల దాదాపు లక్ష మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఆరోపణలున్నాయని సంజయ్ పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురద్రుష్టకరమని సంజయ్ అన్నారు.
ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవదాన్ని సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు.తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8 మీటర్లుగానే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంలో ఉన్న శాస్త్రీయత ఏంటని ఆయన ప్రశ్నించారు.లాంగ్ జంప్ తోపాటు షాట్6 పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలు సవరించకపోతే ఈ ప్రభుత్వాన్ని యువత క్షమించదని ఆయన హెచ్చరించారు.