-రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణితో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ముందు నుంచి మొత్తుకుంటున్నదే ఇప్పుడు నిజం అయింది – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్
– వైసీపీ సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్య ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం హత్యే – ఈ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి – వైవీబీ
– ఆత్మహత్య చేసుకున్న ధనలక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. రాష్ట్రంలోని 12,918 మంది అధికార, ప్రతిపక్ష సర్పంచుల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. రాజేంద్రప్రసాద్
– రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన ఆర్థిక సంఘం నిధులు రూ,,8660 కోట్లను తక్షణమే మా గ్రామ పంచాయతీల అకౌంట్ల లో జమ చేయాలి – రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు
– లేకపోతే ధనలక్ష్మి ఆత్మహత్య లాంటి పరిస్థితులే రాష్ట్రంలో పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది – లక్ష్మీ ముత్యాలరావు
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ లు ముందు నుంచి మొత్తుకుంటున్నట్లే నిన్న దర్శి మండలం, రామచంద్రపురం పంచాయతీ సర్పంచ్ బాదం ధనలక్ష్మి గారు చేసిన పనులకు బిల్లులు రాక, గ్రామ అభివృద్ధి కోసం చేసిన అప్పులు, వడ్డీలు బాధలు తాళలేక ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మేము ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గార్ని మా సర్పంచుల సమస్యలపై దృష్టి సారించి, చేసిన పనులకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరినా వారు పట్టించుకోలేదని, 14,15 వ ఆర్థిక సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు పంపిన రూ,,8660 కోట్లను దారి మళ్లించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకోవడం వల్లనే బిల్లులు రాక వైసీపీ పార్టీకి చెందిన సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, మొన్ననే ఒక వైసీపీ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకోవడం జరిగిందని, ఇప్పుడు సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్య అని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి రాష్ట్రంలోని 12,918 మంది అధికార, ప్రతిపక్ష సర్పంచులు చేసిన పనుల తాలూకా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో మరింత మంది సర్పంచుల ఆత్మహత్యలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని, అలాగే ఈరోజు ధనలక్ష్మి ఆత్మహత్య రేపు అప్పుల బాధలో ఉన్న మరో సర్పంచ్ కావచ్చు అని, కావునా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరూ ఐక్యమై మన నిధులు, విధులు, అధికారాలను సాధించుకుందామని రాజేంద్రప్రసాద్ సర్పంచులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా వెంటనే మా సర్పంచుల బిల్లులు విడుదల చేయకపోతే, రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరం కలిసి ఉద్యమాలు,పోరాటాలు ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావులు తీవ్రంగా హెచ్చరించారు.
సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్యకు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ తరపున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.