-సర్పంచులు గ్రామపంచాయతీల కరెంట్ బిల్లులు కట్టవద్దు
-పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే కరెంటు బిల్లులను చెల్లించాలి
-రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సర్పంచుల నిధులు రూ,, 8660 కోట్లను వెంటనే తిరిగి ఇవ్వాలి
– లక్ష్మీ ముత్యాలరావు , వై.వి.బీ. రాజేంద్రప్రసాద్ డిమాండ్
ఆం.ప్ర. సర్పంచుల సంఘం మరియు ఆం.ప్ర. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అధ్యక్షతన జరిగినాయి. ఈ సమావేశానికి 26 జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలకు చెందిన జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు హాజరైనారు. ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్రప్రసాద్ , వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు ప్రారంభ, అధ్యక్షోపన్యాసం చేస్తూ “ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామానికి సేవ చేద్దామని ఎన్నో ఆశలతో, ఆశయాలతో సంవత్సరన్నర క్రితం ఎన్నికై వచ్చిన సర్పంచులు పలు ఇబ్బందులు పడుతున్నారు. 73,74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు ఇవ్వవలసిన నిధులు, విధులు అధికారాలను ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ( 2018-2019 నుంచి 2021-2022 వరకు) 14,15 వ ఆర్థిక సంఘం నిధులు రూ,,8660 కోట్లను దారి మళ్లించేసుకొని తన సొంత అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడంతో గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి. సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోతున్నారు.” అని “రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన రూ,,8660 కోట్లు మా సర్పంచులకు తిరిగి ఇవ్వాల్సిందే అని” వై.వి.బి. రాజేంద్రప్రసాద్ మరియు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు డిమాండ్ చేశారు.
తీర్మానాలు
1) రాష్ట్రంలోని గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు మరియు క్లాప్ మిత్రాల జీతాలు సర్పంచులు ఎవరూ కట్టవద్దని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ మరియు ఆం.ప్ర. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పిలుపునిచ్చారు. పాత పద్ధతిలోనే గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు మరియు క్లాప్ మిత్రాల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తీర్మానించడమైనది.
2) గ్రామ సచివాలయాల పేరుతో ఎమ్మెల్యేలకు ఇస్తున్న 20 లక్షల రూపాయలు గ్రామపంచాయతీలోకి ఇచ్చి సర్పంచుల ద్వారానే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించడమైనది.
3) గ్రామ పంచాయతీల, సర్పంచుల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను వాలంటీర్లును తీసుకురావాలి . ప్రస్తుతం వారు స్వతంత్ర శాఖ ఉద్యోగులుగా గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు సమాంతర వ్యవస్థ గా పని చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. 73,74 వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243g, 11వ షెడ్యూల్లో గ్రామపంచాయతీలకు ఇచ్చిన 29 అంశాలు – శాఖలు ప్రకారం గ్రామ సచివాలయాలు, సచివాలయ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు ను సర్పంచుల ఆధ్వర్యంలోనే పని చేయించాలి. ఆ 29 శాఖలకు చెందిన సిబ్బందిని, నిధులను మరియు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే పర్యవేక్షణ అధికారాలను మా గ్రామ ప్రభుత్వాలకు, సర్పంచులకు ఇస్తూమరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గానే వారిని మార్పుచేసి వారికి జీతాలు, సెలవులు ఇచ్చే అధికారంకూడా సర్పంచులకు ఇస్తూ,ఈ సమాంతర వ్యవస్థన, శాఖను రద్దు చేస్తూ తగిన స్పష్టమైన ఆదేశాలను, జీవోలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మాంచడమైనది . ఇది సర్పంచుల ఆత్మ అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మరియు గౌరవ, మర్యాదలను కాల రాసినట్లే. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన సర్పంచుల కంటే తాత్కాలిక ఉద్యోగులయిన వాలంటీర్ల కే ఎక్కువ అధికారాలు ఉండటం సిగ్గుచేటైన విషయం. పంచాయతీరాజ్ అధికారాలను సచివాలయాల వాలంటీర్లు, వ్యవస్థ హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు .
4) జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే కేంద్ర నిధులను ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం, కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు,సర్పంచులకుఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించడమైనది .
5) సుమారు 12000 మైనర్ గ్రామ పంచాయతీలకు 1984 నుంచి గత ప్రభుత్వాలు ఇచ్చిన మాదిరే వీధి దీపాలకు, తాగునీటి పథకాలకు, గ్రామ పంచాయతీ ఆఫీసులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. బిల్లులు కట్ చేసుకోకూడదని, పాత బకాయిలు గా చూపిస్తున్న సుమారు రూ,, 6000 కోట్ల విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించడమైనది.
6) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12,918 గ్రామపంచాయతీలకు పంపించిన 14వ ఆర్థిక సంఘం నిధులు 2018 – 19 సంవత్సరానికి రూ,,1729.23 కోట్లు. 2019 – 20 సంవత్సరానికి రూ,,2336.58 కోట్లు మరియు 15 వ ఆర్థిక సంఘం నిధులు 2020 – 21 సంవత్సరానికి రూ,,2625 కోట్లు. 2021 – 22 సంవత్సరానికి రూ,,1938 కోట్లు మొత్తం కలిపి రూ,,8660 కోట్ల రూపాయలు మా గ్రామపంచాయతీల సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో కనిపించడం లేదు. జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వాడి వేసుకుంది. అదేమంటే విద్యుత్ బకాయిల కింద జమ చేసుకున్నామని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. ఇది అన్యాయం. పంచాయతీలకు 1984 నుంచి ఉచితంగా విద్యుత్తు ని అన్ని ప్రభుత్వాల సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు , వై.యస్.ఆర్ లు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కట్టమంటే ఎలా? కనుక ఇది ప్రభుత్వ దోపిడి, ఇది అన్యాయం. కనుక మా నిధులు మాకు వెంటనే ఇవ్వాలి. ఆ మొత్తం 8660 కోట్ల రూపాయల నిధులను మా గ్రామ పంచాయతీలకు తిరిగి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించడం అయినది.
7) సర్పంచ్ కన్నా గ్రామ వాలంటీర్లకు అంగన్వాడీ ఆయాలకే గౌరవ వేతనాలు ఎక్కువగా ఇస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గౌరవ సలహాదారులకైతే నాలుగు లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం విపరీతంగా ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సర్పంచ్ కు, ఎంపీటీసీలకు 15 వేల రూపాయలు, ఎంపీపీ లకు, జడ్పీటీసీలకు 30 వేల రూపాయలు, మున్సిపల్ కౌన్సిలర్లకు 20 వేల రూపాయలు, కార్పొరేటర్లకు 30 వేల రూపాయలు, మున్సిపల్ చైర్మన్ లకు లక్ష రూపాయలు, కార్పొరేషన్ చైర్మన్ లకు రెండు లక్షల రూపాయలు, జిల్లా పరిషత్ చైర్మన్ లకు రెండు లక్షల రూపాయలు గౌరవ వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించడమైనది .
తదుపరి మొదలగు మొత్తం 12 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని…పైన పేర్కొన్న డిమాండ్ల సాధన కోసం వివిధ ఆందోళనా కార్యక్రమాలు, సర్పంచులు జిల్లా సదస్సులు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, చలో ఢిల్లీ మొదలగు ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని రాజేంద్రప్రసాద్ , లక్ష్మీ ముత్యాలరావు అన్నారు .
ఈ సమావేశంలో సర్పంచుల సంఘం నాయకులు రావిపాటి సుధాకర్, పగడాల రమేష్,కొండబాబు (ప్రకాశం జిల్లా), కొండయ్య, ముని రెడ్డి (కడప జిల్లా), సావిత్రి, బుచ్చిరాజు, ప్రభాత్ (తూ. గో జిల్లా), చింతకాయల ముత్యాలు, సన్యాసినాయుడు,ఎరుకనాయుడు (విశాఖ జిల్లా) శంకర్ యాదవ్, భానుజీ నాయుడు (శ్రీకాకుళం జిల్లా) స్వామి నాయుడు (విజయనగరం జిల్లా) అన్నవరం (ప.గో. జిల్లా) శంకర్ యాదవ్, వసంత కుమార్, రవి ప్రసాద్ (కృష్ణాజిల్లా) కల్లూరి శ్రీనివాస్, రామకృష్ణ (గుంటూరు జిల్లా) నాగేంద్ర రెడ్డి, శివకుమార్ (నెల్లూరు జిల్లా) కోకా ప్రకాష్ నాయుడు, ఎస్ శేఖర్, మణి రాజు (చిత్తూరు జిల్లా) డేగల కృష్ణమూర్తి, ప్రభాకర్ రెడ్డి (అనంతపూర్ జిల్లా) శ్రీనివాస్ యాదవ్, జైపాల్, భూమా గోపాల్ రెడ్డి (కర్నూలు జిల్లా) మరియు పంచాయతీరాజ్ ఛాంబర నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, ముల్లంగి రామకృష్ణారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య , అనేపు రామకృష్ణ నాయుడు, వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, బొర్రా నాగరాజు, కర్రోతు సత్యనారాయణ, గేదల రాజారావు, తుంపల్లి రమణ, పిల్లి సత్తిరాజు, వీరభద్ర ఆచారి, కడలి గోపాలరావు, గోగినేని వసుధ, మానం విజేత, రావి పాటి సంధ్య, ఎలవర్తి లక్ష్మి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.