– బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: లగచర్ల రైతు హీర్యా నాయక్ కు పోలీసులు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల భూములు లాగేసుకోవాలని చూసి.. తిరిగి వారిపైనే కేసులు పెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. సంకెళ్లు ఎవరికెయ్యాలి? రైతుకా? రేవంత్ కా? అని ఆయన ప్రశ్నించారు.
“ఫార్మా విలేజ్ కోసం భూములు లాకోడ్డానికి చూసింది రేవంత్. రైతులతో కనీస చర్చలు జరపకుండా అధికారులను పంపింది రేవంత్. పోలీసులతో దాడి చేయించింది రేవంత్. ఫార్మా విలేజ్ ప్రతిపాదన రద్దు చేసుకుంది రేవంత్. రైతులను ఆందోళనకు గురి చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చింది రేవంత్. ఇందులో రైతుల తప్పు ఏంటి..? తప్పు చేసిన వాళ్ళు జల్సాలు చేసుకుంటుంటే.. బువ్వ పెట్టే తల్లి లాంటి భూమి కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలా..? ఇది ప్రజా స్వామ్యమా..? రాచరికమా..?” అని ప్రశ్నించారు.
ఫార్మా ఉందని, తరువాత లేదని చెప్పి ఆ తర్వాత రద్దు చేసుకున్నారు అంటే తప్పు చేసింది సర్కారే అని ఒప్పుకున్నట్టే కదా అన్నారు. ఫార్మా లేదంటూనే ఫార్మా నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకున్నప్పుడు, సర్కారు పెట్టిన కేసులు ఎందుకు వెనక్కి తీసుకోరని ప్రశ్నించారు. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం సేకరించిన 19,000 ఎకరాల భూమి ఉండగా.. అది ఇవ్వకుండా మళ్లీ భూమి సేకరించాల్సిన అవసరం ఏంటని అడిగారు. రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బందిపోటు దొంగలకు, హంతకులకు వేసినట్టుగా రైతులకు బేడీలు వేయడంపై మనసును కలచివేసిందన్నారు. చేయని నేరానికి వారిని అరెస్ట్ చేసి.. నెలరోజులకు పైగా జైళ్లో పెట్టి వేధిస్తున్నారని.. ఇప్పుడు ఇలా బేడీలు వేసి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఇప్పటికైనా లగచర్ల అంశంపై స్పందించి రైతులకు జైలు నుంచి విముక్తి కల్పించాలని కోరారు.
అలాగే రైతులకు బేడీలు వేసిన పోలీసులపై, రాష్ట్ర సర్కారుపై, ఫార్మా క్లస్టర్ పేరుతో పేదల భూములు గుంజుకోవాలని చూసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.