Suryaa.co.in

Editorial

కన్నాకు సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జి

– సీనియర్లతో మాట్లాడి ఓకే చేసిన చంద్రబాబు
– సత్తెనపల్లిలో గ్రూపు రాజకీయాలకు బాబు చెక్‌
– తమ్ముళ్లలో వెల్లివిరిసిన ఆనందం
( మార్తి సుబ్రహ్మణ్యం)

సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు సత్తెనపల్లి సీనియర్లతో మాట్లాడి, ఏకాభిప్రాయం సాధించారు. పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులుతో మాట్లాడి, సత్తెనపల్లి కథను సుఖాంతం చేశారు.

ఎన్నికల నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అక్కడి గ్రూపు రాజకీయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోటీలో ఉన్న నేతలతో మాట్లాడి ఏకాభిప్రాయం సాధిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అని కొన్ని సందర్భాల్లో కటువుగా స్పష్టం చేస్తున్నారు.

అయితే ముందు బుజ్జగింపు, ఏకాభిప్రాయ సాధనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని, ఇన్చార్జిగా నియమించిన వారికి సహకరించి, గెలిపించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే కన్నాకు సత్తెనపల్లి ఇన్చార్జి పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది.

నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ గ్రూపు రాజకీయాలు నాయకత్వానికి చాలాకాలం నుంచి శిరోభారంగా పరిణమించాయి. వర్గాల కుమ్ములాటతో పార్టీ పరువు బజారుకెక్కింది. సొంత పార్టీ ఆఫీసుల ఏర్పాటు, సొంత కార్యక్రమాలతో పార్టీ నాయకత్వం ఆగ్రహించి, వారిని పార్టీ ఆఫీసుకు పిలిపించి, మందలించాల్సిన పరిస్థితి. ఎన్నికల ముందు.. స్వయంగా కోడెలకు టికెట్‌ ఇవ్వవద్దంటూ, గుంటూరు పార్టీ ఆఫీసులోనే ధర్నాలు నిర్వహించిన సందర్భం పార్టీని చికాకుపెట్టింది. దీనితో అక్కడ ఎవరికీ ఇన్చార్జి పదవి ఇవ్వకుండా, వేచి చూసే ధోరణి అవలంబించింది.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి టీడీపీలో చేరడంతో, కథ కొత్త మలుపు తిరిగింది. ఆయనకు సత్తెనపల్లి ఇన్చార్జి పదవి ఇస్తారన్న ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతోంది. నిజానికి ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, పులిచింతల నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం, సత్తెనపల్లిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

కన్నా మంత్రిగా ఉన్నప్పుడే పులిచింతల పునరావాస కార్యక్రమాలు చురుకుగా సాగాయి. పులిచింతల ప్రాజెక్టు కోసం మంత్రిగా ఉన్న కన్నా, ఎక్కువ కష్టపడిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 4 వేల కుటుంబాలకు, ఇంకా పునరావాసం కల్పించని కారణంగా వారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే, వారికి పునరావాసం కల్పిస్తానని ఆ కుటుంబాలకు కన్నా హామీ ఇచ్చారు. దానికోసమే ఆయన సత్తెనపల్లిని ఏరికోరి ఎంచుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కేవలం ఇచ్చిన మాట ప్రకారమే సులభంగా గెలిచే గుంటూరు బదులు సత్తెనపల్లిని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

నిజానికి సత్తెనపల్లి ఇన్చార్జి కన్నాకు ఇవ్వడం ద్వారా, చంద్రబాబునాయుడు తెలివైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. అక్కడ వైవి ఆంజనేయులు- కోడెల శివరామ్‌లలో ఎవరికీ పూర్తి మద్దతు లేదు. మిగిలిన నాయకులది మండల-గ్రామ స్థాయి. వైవి వివాదరహితుడు. కోడెల శివరామ్‌కు ఇన్చార్జి ఇస్తే, ఒక వర్గం దూరమవుతుంది. ఆంజనేయులుకి ఇస్తే ఇంకో వర్గం పనిచేయదు.

టీడీపీ హయాంలో సత్తెనపల్లిలో జరిగిన అరాచకాలు, బె దిరింపులు, అవినీతి, వసూళ్లను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కోడెల వారసులకు ఖచ్చితంగా సీటు ఇవ్వాలని మూకుమ్మడిగా కోరే పరిస్థితి లేదు. చివరకు కమ్మ సామాజికవర్గం కూడా ఆయన వైపు లేరు. సత్తెనపల్లిలో కాపుల సంఖ్యాబలం ఎక్కువ. వారికితోడు కమ్మ-వైశ్యుల సంఖ్య కూడా ప్రభావితం చేసేదే. ఆ మూడు కులాలతో సఖ్యతగా ఉండే కన్నాకు సత్తెనపల్లి ఇన్చార్జి ఇవ్వడం ద్వారా, తమ్ముళ్లను సమరానికి సమాయత్తం చేశారు.

చంద్రబాబు తాజా నిర్ణయంతో సత్తెనపల్లి తమ్ముళ్లలో సమరోత్సాహం తొంగిచూస్తోంది. అనుభవజ్ఞుడు, వివాద రహితుడు, అందరికీ అందుబాటులో ఉంటూ, కార్యకర్తల కోసం పోరాడే యోధుడైన కన్నాకు, ఇన్చార్జి పదవి ఇవ్వడంతో.. ఇక అక్కడ అసలైన యుద్ధం ప్రారంభం కానుంది.

LEAVE A RESPONSE