– మత్స్యరంగ వృద్ధి, ఎగుమతుల విస్తరణపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ: దేశంలోఆక్వా రంగం వృద్ధి, మార్కెట్ విస్తరణ, మత్స్యకారుల ఆర్థిక బలోపేతం, దక్షిణ భారత ఆక్వా ఉత్పత్తుల తక్షణ రవాణా సౌకర్యాల ప్రాముఖ్యతపై బుధవారం రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు, కేంద్రం సమగ్ర నివేదికను అందించింది.
కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2024–25లో భారత్ 16.98 లక్షల టన్నుల సముద్ర ఆహారాన్ని ₹62,408 కోట్లు విలువతో 130 దేశాలకు ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రొయ్యల ఉత్పత్తిలో ముఖ్య కేంద్రంగా నిలిచిన కాకినాడ–గోదావరి ప్రాంతం ఈ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
అమెరికా(36%), చైనా(17%), యూరోపియన్ యూనియన్(15%) ప్రధాన మార్కెట్లుగా నిలిచాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కొత్త మార్కెట్ల విస్తరణ, విలువ జోడింపుపై కేంద్రం చేపట్టిన చర్యలు కాకినాడ నుండి రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతి యూనిట్లకు అవకాశాలను పెరుగనున్నాయి అని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో విలువ ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తి, స్థానిక ప్రాసెసింగ్ యూనిట్లకు లాభం చేకూరే అవకాశం ఉందని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.
కొత్త మార్కెట్ల విస్తరణ కోసం ఎంపీఈడీఏ ద్వారా అవగాహన కార్యక్రమాలు, కొనుగోలుదారు–అమ్మకందారు సమావేశాలు, విలువ జోడింపుపై శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ పేర్కొన్నారు. దేశీయ వినియోగం పెంచేందుకు పీఎంఎంఎస్వై కింద 34,788 మౌలిక సదుపాయ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. విలువ ఆధారిత సముద్ర ఆహారాలపై జీఎస్టీని 12% నుంచి 5%కు తగ్గించడం వినియోగాన్ని పెంచుతుందని చెప్పారు.
మత్స్యకారులకు కేసీసీ ద్వారా రూ. 2 లక్షల వరకు రుణాలు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక టాప్-అప్ లోన్లకు ప్రస్తుతం నిబంధనలు లేవని కేంద్రం మంత్రి స్పష్టం చేశారు.. దక్షిణ భారతదేశం నుండి ఆక్వా ఉత్పత్తుల రవాణా కోసం ప్రత్యేక రైలు సేవ ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని రైల్వే శాఖ కేంద్రమంత్రి తెలిపారు.