ఫుడ్ ప్రాసెసింగ్… డేటాసెంటర్లు
ఫార్మా సెక్టార్… క్లీన్ ఎనర్జీ లో భారీ ప్రాజెక్టులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి.
ఇన్ఫ్రాకీ డిసి పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టుందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది.
జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఏజీపీ గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన–అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లు అవుతుంది. 3 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం–వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు.
వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్–డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు లబించనున్నాయి.
రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.
ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది.
అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3 వేలకి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు.
హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9 వేలకి పైగా ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు.
గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500–3 వేల మందికి ఉపాధి కల్పించనుంది.
భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఆహార–పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకనుంది.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.