ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, నవంబర్ 1: సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్గా తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలని, అందమైన అంకెల రూపంలో చూపడం కాదని సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ జరగాలని, సమస్యలను పరిష్కరిస్తూ సిబ్బంది సామర్థ్యం పెంచేలా పర్యటనలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ 66వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర సాధనకై అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని అన్నారు. ఆ మహనీయుని గుర్తుచేసుకుంటూ అభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమం, సామాజిక న్యాయంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా కృషి చేయాలని కోరారు.
కేసిఆర్ పైఎత్తుకు చిత్తై నారా బాబు పిరికితనంతో లొంగిపోయాడని, పలాయనం చిత్తగించాడని రామోజీ తన సొంత పేపర్లోనే “కీర్తించారని గుర్తుచేశారు. తప్పు చేయకపోతే నక్కజిత్తుల నారా భయపడాల్సిన అవసరం ఏముంది అన్నారు. ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు అడ్డంగా పట్టుబడ్డా, ప్రత్యక్ష ఆధారాలు లేవని “కొత్త పలుకు” లో సరికొత్తగా సమర్ధింపులు చేశారని అన్నారు. ఇంత జరిగినా అప్పుడప్పుడు పుట్టల్లో నుంచి, కలుగుల్లో నుంచి తలలు బయటపెట్టి విషనాలుకలు చాచే ప్రయత్నం మాత్రం ఇంకా తెలంగాణలో మానుకోవడం లేదని అన్నారు.