Suryaa.co.in

Andhra Pradesh

పేదల క‌ళ్ల‌ల్లో సంతోషం చూస్తున్నా

– ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభ‌మైన ఫించ‌న్లు పంపిణీ
– ల‌బ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

కోవూరు : 1 వ తేదీనే ఇంటికి పింఛను వస్తుండటంతో పేదల కళ్లలో సంతోషం చూస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలంలోని గుమళ్లదిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛను పంపిణీ జరుగుతుండగా ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి , టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి స్వ‌యంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అవ్వాతాత‌ల్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ పింఛన్లను అందించారు.

వృద్ధులకు, వితంతువులకు రూ. 4వేల ఫించ‌ను, దివ్యాంగులకు 6 వేల నగదును అంద‌జేశారు. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న ఏకైక నాయ‌కుడు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అని ఆమె అన్నారు. తాను పెత్తనం చేసే నాయకురాలిని కాదని, సేవకురాలినని అన్నారు. ప్రజలతో మమేకమైతేనే వారి సమస్యలు తెలుస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో తిరిగి తెలుసుకుంటేనే ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయగలుగుతామన్నారు.

అనంతరం గుమళ్లదిబ్బలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలుకు వెళ్లి బడిలో వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగా లేదని విద్యార్థులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తెచ్చారు. భోజనం నాణ్యత విషయంలో తగిన ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, గోపిరెడ్డి, కోవూరు ఎంపీపీ పార్వతి, సర్పంచ్ యాకసిరి విజయ, వేగురు సర్పంచ్ అమరావతి, ఎంపిటిసి నాగరాజు, విమలమ్మ, పాల రవి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE