తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్‌నాయుడు, క్రైస్తవ మత పెద్దలు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి లాంఛనంగా వేడుకలకు శ్రీకారం చుట్టారు.
క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమని శాసనమండలి సభ్యులు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడని వ్యాఖ్యానించారు. సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా తన స్వార్ధ రాజకీయాలతో ముడిపెడుతూ అసమానతలు లేని అందమైన సమాజ స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై అవాకులు చెవాకులు పేలుతున్న చంద్రబాబు విద్వేషపూరిత వైఖరిపై అప్పిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి దాన్నీ రాజకీయం చేస్తూ.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరారు. అదే సమయంలో విలువలు, విశ్వసనీయతతో, అణగారిన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారికి దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉండాలని ప్రార్థించారు.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై అనునిత్యం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న ప్రతిపక్షం, దానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా దుష్ట శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. ఆ దేవుడ్ని నమ్ముకున్న అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సాటి మనిషితో సత్సంబంధాలు ఉన్న ప్రతి మనిషికీ దేవుడి దీవెనలు ఎళ్ళవేళలా మెండుగా అందుతూనే ఉంటాయని తెలిపారు.
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. పాప కర్మల నుంచి మానవులను విముక్తి చేసేందుకు దేవుడే మానవుడుగా అవతరించిన శుభ దినమే క్రిస్మస్ అని అన్నారు. సెమీక్రిస్మస్ వేడుకల్లో నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, తిరుపతి స్మార్ట్ సిటీ ఛైర్పర్సన్ నారుమల్లి పద్మజ, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, వైఎస్సార్ గ్లోబల్ ట్రస్ట్ డైరెక్టర్, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జాషువా డేనియల్, నోవా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ నోవా, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర్ రెడ్డి, లిడ్‌క్యాప్ డైరెక్టర్ డాక్టర్ కోనేరు సత్య ప్రియ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.