– ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చట్ట విరుద్ధం
* ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడు రూపంలో వద్దు
* హైకోర్టు ఆదేశాల ఉల్లంఘిస్తున్న కూటమి ప్రభుత్వం
* యాదవుల, హిందువుల మనోభావాలు కించ పరిస్తే చూస్తూ ఊరుకోము
* బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్పష్టీకరణ
తాడేపల్లి: శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీ వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. గుంటూరు సమీపంలోని తక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చట్ట విరుద్ధం అని, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ జరిగితే మాత్రం రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజం మొత్తం గుంటూరు వెళ్లి తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
మేము వారికి వ్యతిరేకం కాదు.. కానీ
ఎన్టీఆర్ విగ్రహాలకు మేము వ్యతిరేకం కాదు.. కానీ శ్రీ కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలను నెలకొల్పడం, ఆవిష్కరించడం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. గతంలో ఖమ్మంలో ఇలాగే ఆవిష్కరణకు ప్రయత్నిస్తే హైకోర్టు కల్పించుకుని శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు వద్దు అని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా, గుట్టుచప్పుడు కాకుండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనికి కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరు కానున్నారు. దీనిపై చర్చించడానికి ఈరోజు నేను ఆ గ్రామానికి వెళ్లి స్థానికులతో మాట్లాడినా, వాళ్లు వినే పరిస్థితిలో లేరు. అవసరమైతే మరిన్ని విగ్రహాలు ఇలాగే పెడతాం అంటూ వితండవాదం చేస్తున్నారు. కానీ ఇది కోర్టు ఆదేశాల ఉల్లాంఘన, మనో భావాలను కించ పరచడమే. ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.
హిందువుల, యాదవుల మనోభావాలు కించ పరుస్తారా?
ఎన్టీఆర్ గొప్ప నటుడు. కానీ ఆయన ఒక పార్టీ వ్యక్తి. ఆయన ఒక పార్టీ ఆస్తి. కాబట్టి ఆ వ్యక్తి విగ్రహాన్ని శ్రీకృష్ణుడు వేషధారణలో ఆవిష్కరించడం ముమ్మాటికీ తప్పే. ఇది హిందువుల మనో భావాలను కించ పరచడమే. యాదవులు ఇలవేల్పుగా ఇంటింటా కొలుస్తున్న శ్రీ కృష్ణ భాగవానుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు, దాన్ని అధికార పార్టీ నేతలే వెళ్లి ఆవిష్కరిస్తుండడం, హిందువులు సహా యాదవ సమాజం మనో భావాలను కించ పరచడమే. దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మీరు ఈ ఆవిష్కరణ చేస్తే మాత్రం యాదవులతో సహా అన్ని హిందూ సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అని ఆర్సీ వై హెచ్చరించారు.