Suryaa.co.in

Andhra Pradesh

శేషాచలం కొండలు @”పుష్ప”..ఎవరు?

కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు నిగ్గు తేల్చాలి

ఎర్రచందనం “పుష్ప” లకు కొమ్ముకాస్తున్న ఇంటి దొంగల భరతం పట్టండి. దీర్ఘకాలికంగా తిష్ట వేసిన అన్నీ శాఖలలోని అధికారులను సాగనంపండి శ్రీవారి ఎర్రచందనం సంపదను సంరక్షించండి. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలలో అపారమైన అరుదైన వెలకట్టలేని ఎర్రచందనం సంపద “కర్పూర హారతి” లా కరిగిపోతున్నా ప్రభుత్వ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?

తిరుమల కొండపై నుంచి ఇటీవల టోల్ గేట్ చెకింగ్ పాయింట్లు దాటుకొని టీటీడీ “ఎలక్ట్రికల్ బస్” ను దర్జాగా తీసుకెళ్లిన తరహాలో , ఎర్రచందనం దుంగలను యదేచ్చగా రాజమార్గంలో అధికార బలంతో,అవినీతి అధికారుల సహకారంతో తరలించేస్తున్నారా? అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయి. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలపై కన్నేసిన రాజకీయ నాయకుల,అవినీతి అధికారుల “డేటా” బయట పెట్టండి వారి భరతం పట్టండి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించకపోతే తిరుమల శ్రీవారి శేషాచలం కొండలలోని “నల్ల బంగారాన్ని” దారి దోపిడీ దొంగల్లా దోచేస్తున్నారు. శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డ వాహనాల యజమాని ఎవరు? స్మగ్లర్ల వెనక ఉన్న సూత్రధారి ఎవరు? విజిలెన్స్,పోలీస్, అటవీ శాఖ,అధికారులు బహిరంగ ప్రకటన చేయాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ టాస్క్ ఫోర్స్ నిఘా అధికారులకు పట్టు బడిన ప్రతిసారి డ్రైవర్,నలుగురు కూలీలు, 7 దుంగలు మాత్రమే దొరకడం భక్తులలో ప్రజలలో పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

శేషాచలం కొండలలోని శ్రీవారి ఎర్రచందనం సంపాదన కొల్లగొడుతున్న “పుష్ప” ల భరతం పట్టాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను, అటవీ,టీటీడీ విజిలెన్స్,పోలీస్ అధికార యంత్రాంగాన్ని శ్రీవారి భక్తునిగా డిమాండ్ చేస్తున్నాను. శ్రీవారి శేషాచలం కొండల్లోని ఎర్రచందనం సంపదన సంరక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు నిఘా సంస్థలకు లేఖ రాస్తున్నానన్నారు.

వృక్షో రక్షితి రక్షితః

నవీన్ కుమార్ రెడ్డి
శ్రీవారి భక్తులు
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్

LEAVE A RESPONSE