– బహిరంగ వేదిక పైన సంతకం చేసిన ఆరు గ్యారెంటీలు, చట్టబద్ధత ఫైలు ఎక్కడికి పోయింది?
– సీఎం సంతకం చేసిన ఫైల్ కు దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారు?
– అభయహస్తం భస్మాసుర హస్తం గా మారింది
– రేపో ఎల్లుండో పరాభవ నామ సంవత్సరం..ప్రజలకు మాత్రం అన్ని పరిహాస నామ సంవత్సరాలే
– ఓట్లకు ముందు దానకర్ణ.. ఓట్ల తర్వాత కుంభకర్ణ
– తెలంగాణ జనం సొమ్ముతో…ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలా?
– గవర్నర్ ప్రసంగంపై కెటిఅర్ ఎద్దేవా
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం అంటే ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళసై , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అంశం పైన, ఫైలు పైన సంతకం చేశారని ప్రకటించారు. దీనితో పాటు రాహుల్ గాంధీ కూడా మొదటి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత తెస్తామని చెప్పారు. అయినా ఇప్పటిదాకా ఆ ఫైలు ఎక్కడికి పోయింది?
ముఖ్యమంత్రి ప్రజల మధ్య బహిరంగ వేదిక పైన సంతకం చేసిన ఆరు గ్యారెంటీలు, చట్టబద్ధత ఫైలు ఎక్కడికి పోయింది? మాయమైన ఆ ఫైల్‌కు సంబంధించిన అంశం పైన ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. గవర్నర్ ప్రసంగానికి విలువ, విశ్వసనీయత లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. మొదటి గవర్నర్ ప్రసంగానికే విలువ లేనప్పుడు, మూడవ గవర్నర్ ప్రసంగానికి ఏమి విలువ ఉంటుంది?
సీఎం సంతకం చేసిన ఫైల్ కు దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారు? ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి చేసిన ఫైల్‌కు జీరో వాల్యూ.. ముఖ్యమంత్రి చేసిన డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ. ఇవన్నీ చూస్తుంటే విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ ఉన్నదని అర్థమవుతున్నది. 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విలువ రెండున్నర లక్షలు ప్రతి కుటుంబానికి అని చెప్పారు. మరి ఇప్పటిదాకా రెండున్నర సంవత్సరాలు అవుతున్నా.. ఈ రెండున్నర లక్షల లబ్ధి కలిగిన ఒక్క కుటుంబమైనా రాష్ట్రంలో ఉన్నదా? గవర్నర్ ప్రసంగంలో రెండున్నర సంవత్సరాలుగా జరిగిన పొరపాట్లను, సమస్యలను ప్రస్తావిస్తారని అనుకున్నాం. ఆరున్నర లక్షల రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే సభలో చెప్పారు.
సభలో మంత్రులు చెప్పిన మాటలకు విలువ లేకుండా సభ్యులు అబద్ధాలు చెబితే స్పీకర్ ఆపాలి. సభ బయట ఎలాగో అబద్ధాలే చెప్తున్నారు. కనీసం శాసనసభలోనైనా నిజాలు చెప్పాలి. ఆనాడు కాళోజీ గారు ‘ఇది నా గొడవ కాదు.. మీ గొడవ’ అన్నారు. మేము కూడా ఈరోజు ప్రజల సమస్యలను సభలో ప్రస్తావిస్తున్నాం. మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్న జార్జ్ ఆర్వెల్ మాట ఈరోజు రాష్ట్రానికి సూట్ అవుతుంది.
ఆరు గ్యారెంటీలతో మోసపోయిన మహిళలు, వికలాంగులు, ఆడబిడ్డలు, రైతన్నలు ఏమన్నా ధన్యవాదాలు చెప్పాలా అని ప్రభుత్వం స్పష్టం చేయాలి. టీఏలు, డీఏలు రాక నరకయాతన పడుతున్న పెన్షనర్లు ఏమన్నా చెప్పాలా?” ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాలు మారిపోతున్నాయి. కానీ ఆరు గ్యారెంటీలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు ఇచ్చింది అభయహస్తం కానీ అమలు మాత్రం భస్మాసుర హస్తం గా మారింది
మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పాలన కూలగొట్టు చెడగొట్టు పడగొట్టు అన్నట్లుగా మారింది. రేపో ..ఎల్లుండో పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం! కానీ..ప్రజలకు మాత్రం అన్ని పరిహాస నామ సంవత్సరాలే! మూడు ముక్కల్లో మీ పాలన గురించి చెప్పాలంటే.. ఎగ్గొట్టు..కూలగొట్టు..చెడగొట్టు! అన్నట్టు మారింది. ఏమున్నది చెప్పుకోవడానికి 28 నెలల్లో..!
బాకీలు…బకాయిలు ! డైవర్షన్లు..కమీషన్లు! బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు ఆల్‌టైం రికార్డు అప్పులు..క్యూలైన్లలో చెప్పులు! ఇదే మిగిలింది
420 ఎగనామాలు..మూడున్నర కోట్ల మందికి పంగనామాలు! నోటిఫికేషన్లు నిల్లు..లూటిఫికేషన్లు ఫుల్లు! అన్నట్టు మారింది. చెక్ డ్యాముల పేల్చివేత…అడుగడుగునా అణచివేత క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం ఇదే కాంగ్రెస్ తీరు. స్కాములు కళకళ..స్కీములు వెలవెల…రైతన్నలకు బేడీలు..నిరుద్యోగుపై లాఠీలు మోగుతున్నాయి. ఫిరాయింపులు కంపు..బస్సు చార్జీల వాయింపు…ఫుడ్ పాయిజన్ చావులు..ఫుట్ బాల్ సరదాలే సరిపోయింది.
గల్లీల్లో చెత్త కుప్పలు..ఢిల్లీకి విమాన యాత్రలు… మాటలు ధడేల్ ..చేతలు తుపేల్దరఖాస్తులు..దఫ్తర్లు..దండాలు అన్నట్లు మారింది. నిన్నటి గ్యారెంటీ కార్డులు.. నేడు బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తున్నాయి! టీ20 వరల్డ్ కప్ పెడితే.. ఇండియా గెలిచింది! 420 వరల్డ్ కప్ పెడితే.. మాత్రం మీరే గెలుస్తారు! ఒకసారి..చదివి చెప్పండి ఇందులో ఎన్ని పూర్తి చేస్తారో ఎన్ని పూడ్చి వేసారో! ఓట్లకు ముందు దానకర్ణ.. ఓట్ల తర్వాత కుంభకర్ణ..! మాదిరి ఉంది
అప్పుడు.. అపర దాన కర్ణుడిలా అందరికీ వాగ్దానాలు ఇచ్చారు.. ఇప్పుడు ఎవరొచ్చి ఏం అడిగినా కలియుగ కుంభకర్ణడిలా ఉలకరు..పలకరు!
తెలంగాణ జనం సొమ్ముతో…ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలా? ఢిల్లీ..బీహార్..మహారాష్ట్ర..ఇప్పుడు కేరళ ఎక్కడ ఎలక్షన్స్ వస్తే ఆ రాష్ట్రాల్లో ఫుల్ పేజీ కలర్ ఫుల్ అడ్వర్టయిజ్ మెంట్స్ ఇస్తున్నారు. ప్రజాధనం.. కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం చేస్తున్నారు