పొత్తులతో డెబ్బై సీట్లు వైసీపీకి బిగ్ లాస్…. జగన్ ఇకనైనా మేలుకోండి
అదేంటో పొత్తులు అంటే ఏపీనే గుర్తుకువస్తుంది. ఉమ్మడి ఏపీలో కూడా ఎక్కువగా పొత్తులు పెట్టుకున్నది ఏపీ మూలాలు ఉన్న టీడీపీనే. ఇక విభజన తరువాత కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించింది. 2019లో కూడా అనధికార పొత్తులు వ్యూహాత్మకమైన పొత్తులుగా చూడాలి. అయితే విపక్షాల చీలిక ద్వారా మరోమారు అధికారంలోకి వస్తామని అంచనా వేసి జనసేనను విడిగా పోటీ చేసేలా బాబు స్కెచ్ గీశారు అంటారు.
కానీ నాడు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కారణంగానూ జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వాలి అన్న జనాల కోరిక వల్లనూ, బాబు వ్యూహం ఫలించలేదు. ఇక 2024 నాటికి మళ్ళీ పదేళ్ళ క్రితం నాటి పొత్తులనే ముందుకు తెస్తున్నారు. ఈసారి పొత్తులతో వెళ్తే, కచ్చితంగా వైసీపీని గద్దె దించగలమని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇలాంటి పొత్తుల లెక్కలలో బాబుది మాస్టర్ మైండ్. ఆయన లెక్కలు వేసీ వేసీ అలా పండిపోయారు కూడా. ఏపీలో జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా కలిస్తే ఒక రకమైన పొత్తు ఉంటుంది. లేకపోతే బీజేపీ ప్లేస్ లో కమ్యూనిస్టులు చివరలో కాంగ్రెస్ కూడా వచ్చి చేరినా చేరవచ్చు. అంటే ఇది 2009 నాటి మహా కూటమి పొత్తులుగా చూడాలి అన్న మాట.
ఈ పొత్తులతో వైసీపీ చిత్తు అని, 2019 ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. అదెలా అంటే 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తే వచ్చాయి కానీ బంపర్ మెజారిటీలు వచ్చినవి అరవై దాకా సీట్లు మాత్రమే. మిగిలిన చోట్ల చాలా తక్కువ మెజారిటీలతో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. చాలా తక్కువగా వైసీపీ సొంతం చేసుకున్న సీటు అంటే విజయవాడలోని మల్లాది విష్ణు సీటు అని చెప్పాలి.
ఇక్కడ కేవలం పాతిక ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అంటే ఇది టీడీపీకి ఎంత స్ట్రాంగ్ సీటు అన్నది చూడాలి. పైగా ఇక్కడ టీడీపీ జనసేన విడిగా పోటీ చేశాయి. ఇలాంటి సీట్లే ఏపీలో మొత్తం 70 దాకా ఉన్నాయట. కొన్ని చోట్ల నాలుగు అయిదు వందల ఓట్లతో వైసీపీ గెలిస్తే మరికొన్ని చోట్ల వేయి లోపు ఓట్లతో బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సీట్లు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలోనే యాభై దాకా ఉన్నాయని అంటున్నారు. సో ఇపుడు తేలేది ఏంటి అంటే.. జనసేన టీడీపీ కనుక కలిస్తే ఈ డెబ్బై సీట్లనూ కైవశం చేసుకుంటాయా అన్న చర్చ అయితే వస్తోంది. మారిన రాజకీయంతో చూస్తే.. యాంటీ ఇంకెంబెన్సీ కూడా వైసీపీకి ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వైసీపీకి ఈ పొత్తులు బిగ్ లాస్ అని చెబుతారు.
అలా కనుక చూసుకుంటే ఈ పొత్తులతో ఈజీగా మ్యాజిక్ ఫిగర్ ని, రెండు పార్టీలు రీచ్ అవుతాయని తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ పొత్తుల పట్ల, వైసీపీ అంత కలవరంగా ఉందని కూడా చెబుతున్నారు. చూడాలి మరి.. ఈ పొత్తులు ఎలాంటి రిజల్ట్ ని ఇస్తాయో. ఎందుకంటే రాజకీయాల్లో రెండు రెళ్ళు నాలుగు ఎపుడూ కానే కాదు కాబట్టే ఈ చర్చ.
– ఎం.ఎన్.రెడ్డి