పార్టీ నేతలతో లోకేష్ సమావేశంలో చర్చ – రైతాంగ సమస్యలపై టీడీపీ ఆందోళన
రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు నారా లోకేష్ సూచన
అమరావతి:- రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని… అయితే సాగు చేసిన పంటలు కూడా వర్షభావం కారణంగా నేడు నీరందక ఎండిపోతున్నాయని తెలుగు దేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశాను.
పార్టీ నేతలతో నారా లోకేష్ నిన్న జరిపిన సమావేశంలో, ఈ రోజు ఉదయం జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. జిల్లాల వారీగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి, రైతుల దీన స్థితిని నేతలు లోకేష్ కు వివరించారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని నేతలు తెలిపారు. కొన్ని జిల్లాల్లో 70 నుంచి 80 శాతం వర్షపాతం లోటు ఉందని నేతలు వివరించారు. నెల రోజులుగా చినుకు లేకపోవడం, ఎండలు మండుతుండడంతో సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్న విషయాన్ని నేతలు చర్చించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖలు పూర్తిగా మూసివేశారని…కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు కనీస స్థాయిలో కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సందర్భంగా లోకేష్ అభిప్రాయపడ్డారు.
సబ్సిడీల నిలిపివేత, పెరిగిన సాగు ఖర్చులతో సతమతం అవుతున్న అన్నదాతలపై కరువు పరిస్థితుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.. పార్టీ నేతలు, కార్యకర్తల క్షేత్ర స్థాయిలో పర్యటించాలని….రైతుల సమస్యలపై చర్చించాలని లోకేష్ సూచించారు. అన్నదాతల కష్టాలపై ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని పార్టీ యంత్రాంగాన్ని లోకేష్ ఆదేశించారు.
రైతన్నల కష్టాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రైతులు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని….తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.