Suryaa.co.in

Editorial

శహభాష్…షర్మిల!

* ‘మెఘా’ను దునుమాడిన తొలి నేత
* తెరాసపై మాటల తూటాలు
* తెలంగాణలో… ‘అతనొక్కడే’
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘తెలంగాణలో ఏ ప్రాజెక్టులయినా ఒక్క మెగా కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అందులో భాగస్వాములు కాబట్టి. మెగా కంపెనీపై ఎందుకు విచారణ జరపరు? దానిపై సీబీఐ విచారణ చేయాలి. మెగా కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలి. దీనిపై నేనే కాదు తెలంగాణలో అంతా మాట్లాడాలి. రాజకీయ పార్టీలు మాట్లాడాలి’
– ఈ వ్యాఖ్యలు చేసింది ఏ బండి సంజయ్.. ఏ రేవంత్‌రెడ్డి, ఇంకో ప్రవీణ్‌కుమార్ అనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఈ విమర్శనాస్త్రాలు సంధించింది ఎవరంటే.. వైఎస్సార్‌టీపీ అనే ఒక చిన్న పార్టీ అధినేత్రి షర్మిల. ఆశ్చర్యమనిపించినా.. ఇదే నిఝం!
* * *

‘అమ్మకు పుట్టిన ఆరుగురూ సంగీత విద్వాంసులే’ అని వెనకటికి ఓ సామెత. ఆంధ్రాలో వైఎస్ కుటుంబమయినా, తెలంగాణలో కేసీఆర్ కుటుంబమయినా అంతే. వైఎస్-కేసీఆర్ సంతానాలను చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. అంతా సొంతగా తమ కష్టంతో పైకొచ్చినవారే. తొలినాళ్లలోనే వారికి తండ్రుల పేర్లు అక్కరకొస్తే, మిగిలినదంతా వారి సొంత తెలివితేటలే. జనంనాడి తెలుసుకునేందుకు వారి పడిన శ్రమ ఫలితమే ఈ స్థానం.

అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ అయినా, కవిత అయినా ఉద్యమంలో చాలా నేర్చుకున్నారు. వారికి ఉద్యమమే అన్నీ నేర్పింది.ఉద్యమ సమయంలో ఆంధ్రాప్రజలు మిగిలిన తెలంగాణ నేతలనుktr-kavitaద్వేషించినా, కేటీఆర్ ప్రసంగాలను మాత్రం ఇష్టపడేవారంటే ఆయన ఏ స్థాయిలో పరణతి చెందారో సుస్పష్టం. ఇప్పుడు వారిద్దరూ ఏ అంశంపైనయినా అనర్గళంగా, అచ్చ తెలుగులో మాట్లాడగలరు. ఇంష్లీష్, హిందీ భాషల్లో కూడా అంతే అలవోకగా మాట్లాడి మెప్పించే స్థాయికొచ్చారు. అటు తెలంగాణ మాండలికం, ఇటు అచ్చ తెలుగు భాష. సందర్భానుసారంగా మాట్లాడగల మాటల మాంత్రికులయ్యారు.

అటు ఆంధ్రాలో దివంగత నేత వైఎస్ కుమారుడు, సీఎం జగన్ అయినా, కుమార్తె షర్మిలయినా అనుభవంతో చాలా జీవిత పాఠాలు నేర్చుకున్నారు. జగన్‌కయితే జైలు జీవితం చాలా నేర్పితే, పాదయాత్రsharmila-reddy-jagan-mohan-reddy ‘ఓదార్పు’లో జనాలే ఆయనకు అన్నీ నేర్పారు. షర్మిల కూడా తక్కువేం కాదు. ఆమాట కొస్తే అన్నకంటే ఎక్కువ. అన్న జైలులో ఉంటే పార్టీ పగ్గాలు తీసుకుని పాదయాత్ర నిర్వహించారు. భారతదేశంలో అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు అన్నతో విబేధించి, తెలంగాణ కేంద్రంగా వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించారు. ఒకరకంగా చెప్పాలంటే జగనన్న ప్రసంగంతో పోలిస్తే, షర్మిలక్క ప్రసంగం సూటిగా, పదునుతేలి కనిపిస్తుంటుంది. ఆకర్షణీయంగా ఉంటుంది.

సరే. షర్మిల అందరిమాదిరిగా పార్టీ పెట్టి, తన మానాన తాను వెళ్లడం లేదు. తెలంగాణలో అత్యంత శక్తిసంపన్నుడయిన సీఎం కేసీఆర్‌ను ఢీకొంటున్నారు. ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌పై వీలున్నప్పుడల్లా సెటైర్ల బాణాలు సంధిస్తున్నారు. నిజానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ దళపతి బండి సంజయ్‌కు వారి వారి జాతీయ పార్టీల దన్ను ఉంది.

అయితే.. షర్మిల ఒక్కరే ఎలాంటి దన్ను లేకుండా, సొంత మీడియా అనాధను చేసినా, మొండి ధైర్యంతో వారిద్దరికీ మించిన, దారుణ విమర్శనాస్త్రాలు తెరాస పాలనలపై సంధిస్తున్నారు. కేసీఆర్‌ను దారుణమైన తిట్లు తిడుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎంట్రీ అంశంపై బహుశా షర్మిల సంధించినన్ని విమర్శనాస్త్రాలు ఏ నేత కూడా విసిరి ఉండకపోవచ్చు. అయినా షర్మిలపై టీఆర్‌ఎస్ నుంచి తన సహజ సిద్ధమైన ఎదురుదాడి లేదు. కారణం తెలియకపోయినా అది పెను ఆశ్చర్యమే. కేసీఆర్‌ను ఎవరు విమర్శించినా ఇంతెత్తున లేచి, ఎగసిపడే టీఆర్‌ఎస్ సిపాయిలు గానీ, చివరకు మహిళా నేతలు గానీ షర్మిల అన్ని తిట్లు తిడుతున్నా కిమ్మనకపోవడం ఆశ్చర్యమే కదా మరి?!

ప్రధానంగా… ఏపీ-తెలంగాణలో అన్ని ప్రాజెక్టులనూ సొంతం చేసుకున్న మెగా కృష్ణారెడ్డికి చెందిన,Megha-Krishna-Reddy-display2 ‘మెయిల్’పై నేరుగా యుద్ధం ప్రకటించిన ఏకైక విపక్ష నేతగా షర్మిల అందరినీ విస్మయపరుస్తున్నారు. ఎందుకంటే.. ‘మెగా’ అన్ని పార్టీలకూ ఆప్తురాలే. అందరికీ ఆపద్బాంధవుడే. ఎవరు సీఎంగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా తొలి తాంబూలం ఆ కంపెనీకే. ముఖ్యమంత్రులను తప్ప, మంత్రులను పెద్దగా పట్టించుకోని ‘మెయిల్’ పలుకుబడి, సర్కారు ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోయింది.

megha-babuటీడీపీ, కాంగ్రెస్ హయాంలో కేవలం మెగా కోసమే.. కొత్త ప్రాజెక్టులు తెరపైకి తెచ్చారన్న ప్రచారం ఉండేది. ఇరిగేషన్, మున్సిపల్, ట్రాన్సుపోర్ట్, విద్యుత్ శాఖల్లో ‘మెగా మెరుపుల’ తర్వాతే, ఏ కంపెనీ అయినా! అలాగని మెగా కేవలం అధికారంలో ఉన్నవారినే ‘చూస్తుందనుకుంటే’ పొరపాటు. ప్రతిపక్షాలను కూడా యధాశక్తిన ‘మెప్పిస్తుంది’. అదే ‘మెగా టాలెంట్’ మరి. ఇక మీడియా సంగతి సరే సరి. ఆ కంపెనీపై విమర్శలు వచ్చినప్పుడు, అవి మరుసటిరోజు మీడియాలో భూతద్దం వేసి వెతికినా కనిపించవు. పొలిటికల్ పల్సుతోపాటు, మీడియా పల్సు కూడా బాగా తెలిసిన బహు గొప్ప సంస్థ అది.

మరి అంతలావు సంస్థ మీద.. అందునా తెలంగాణలో కీలక ప్రాజెక్టులు చేస్తున్న సూపర్ ‘మెగా’ సంస్థపై.. ముందు వెనుకా ఎవరూ దన్ను లేని, నమ్మకం-మొండితనమే పెట్టుబడిగా ఒక చిన్న పార్టీ పెట్టిన షర్మిల,MEgha-kcr ఒంటికాలితో శివంగిలా లేవడమే అద్భుతం కదా? మాటల మాంత్రికులయిన రే వంత్, సంజయ్ లాంటి వాళ్లూ సాహసించని వేళ, నేత పాలకులకు అతి దగ్గరయిన కంపెనీపై ఒక మహిళా నేత, సాటి ఆంధ్రా వ్యక్తికి చెందిన కంపెనీపై యుద్ధం ప్రకటించడం మరి అద్భుతమే కదా? అంటే ఆంధ్రాకు చెందిన షర్మిల, అదే ఆంధ్రాకు చెందిన ‘మెగా’పై మెరుపుమాటల దాడులు చేస్తుంటే, తెలంగాణ నేతలు మాత్రం.. ఆంధ్రా కంపెనీపై మాట్లాడేందుకు భయపడుతున్నారనే కదా అర్ధం? సగటు తెలంగాణా వాడికి అర్ధమయ్యేది అదే కదా మరి?!

గత ఎనిమిదేళ్లలో ఇప్పటి రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ గానీ, అప్పటి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, కిషన్‌రె డ్డిగానీ ఏ సందర్భంలో కూడా మెగా సంస్థ దక్కించుకున్న కాంట్రాక్టుల వైనంపై ఒక్క మాట మాట్లాడిన వారు లేరు. ఒకటి రెండు సందర్భంలో, రేవంత్‌రెడ్డి మెగా సంస్థ గురించి ప్రస్తావించారు. ఇక తెలంగాణ ఉద్యమ సంస్థలు, ఇప్పటికీ ఆంధ్రా కంపెనీ అయిన మెగాకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తుంటాయి. కానీ వాటి స్వరం అత్యంత బలహీనం.

విపక్షాలు.. కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు, అందులో కమిషన్ల గురించి ఆరోపించాయే తప్ప.. ఆ కాంట్రాక్టులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ గురించిగానీ, ఆ కంపెనీ అధిపతికి కేసీఆర్‌తో సాన్నిహిత్యం గురించి గానీ, పల్లెత్తు మాట్లాడిన పాపాన పోలేదు. ఎవరి మొహమాటాలు వారివి. ఎవరి అవసరాలు వారివి. కాబట్టి కారణాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. తెరాస సహా… తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీలు, నేతలు, ఉద్యమకారులు అప్పట్లో ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనంపై ఒంటికాలితో లేచేవారు. తాము అధికారంలోకి వస్తే, వారిని బ్లాక్‌లిస్టులో పెడతామని, విచారణ జరిపిస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికినవే.

కానీ, తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పటిదాకా, ఆంధ్రా కాంట్రాక్టర్లను అడ్డుకున్న ఘటనలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. పైగా.. ఆంధ్రాలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తెలంగాణలో నిర్భయంగా కాంట్రాక్టులు చేస్తున్న వైచిత్రి.

ఇలాంటి వాస్తవ విచిత్ర పరిస్థితిలో… ఆంధ్రా పుట్టినిల్లు- తెలంగాణ మెట్టినిల్లుగా ఉన్న షర్మిల.. అంతపెద్ద బిజినెస్ టైకూన్, తెలంగాణలో అతి పెద్ద కాంట్రాక్టరుగా ఉన్న ఆంధ్రా కంపెనీ మెగాపై ఒంటికాలిపై లేచి, అసలు ఆ కంపెనీనే బ్లాక్‌లిస్టులో పెట్టాలని, సీబీఐ విచారణ జరపాలని గళం విప్పడం నిస్సందేహంగా సాహసమే. దాని వెనుక అసలు లక్ష్యం, కారణాలు ఏమిటన్నది పక్కనపెడితే, తెలంగాణలో పుట్టి అధికారంలోకి రావాలని ఆత్రుత పడుతున్న విపక్ష నేతలు కూడా విస్మయపడేలా.. ఒక్కమాటలో చెప్పాలంటే.. నిఖార్సయిన తెలంగాణ నేతలు సిగ్గుపడేలా, షర్మిల మెగాపై ప్రారంభించిన ఈ మాటల దాడి ఒక సంజయ్.. మరో రేవంత్ లాంటి నేతల చిత్తశుద్ధిని ప్రశ్నించేదే. ఇక వారూ మాటల దాడి ప్రారంభించాల్సిన అనివార్య పరిస్థితి. లేకపోతే ‘రేవంత్‌రెడ్డి, సంజయ్‌కు వాళ్లకు కావల్సింది వాళ్లకు ఇస్తున్నారన్న’ షర్మిల ఆరోపణ నిజమనుకునే ప్రమాదం లేకపోలేదు మరి!

షర్మిల హటాత్తుగా ఇప్పుడే మెగాపై దాడి ఎందుకు ప్రారంభించారు? ఆ అవసరం ఏమిటి? దాని వెనుక మతలబేమిటి? ఆ హెచ్చరిక లో ఎన్ని సంకేతాలున్నాయన్న ప్రశ్నలు-అనుమానాలకు కాలమే సమాధానమిస్తుంది. ఒకవేళ షర్మిల.. రాబోయే రోజుల్లో కూడా, శరపరంపరగా మెగాపై మెరుపుదాడి చేస్తే ఆమె చిత్తశుద్ధిని ఎవరూ శంకించరు. కానీ మధ్యలోనే మాటల దాడికి విశ్రాంతి ఇస్తే, ఆమెను ఎవరూ పట్టించుకోకపోగా, షర్మిల కూడా సగటు రాజకీయ నేతగానే చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

నిజానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత పలుకుబడి, సంపన్న కంపెనీల్లో మెగా ఒకటి. కాళేశ్వరం, దేవాదుల, హైదరాబాద్-మన్నెగూడ హైవే రోడ్ ప్రాజెక్టు, ఆంధ్రాలో పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులన్నీ మెగానే దక్కించుకుంది. ఇక విద్యుత్‌తో నడిచే బస్సులు కూడా, రెండు రాష్ట్రాలకూ అదే కంపెనీ తయారుచేస్తోంది. వ్యాపార రంగంలో ‘మెగా మెరుపులు’ చూడాలంటే గూగుల్‌లోకి వె ళితే సరి. అయితే, అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు, అంకితభావంతో పనిచేసే యంత్రాంగం, పని నాణ్యత వంటి అంశాల్లో మెగా ప్రతిభను ఎవరూ శంకించలేరు. అది వేరే విషయం.

కానీ.. ఒకప్పుడు తన తండ్రికి ఇష్టుడైన అదే మెగా కంపెనీ లక్ష్యంగా, ఇప్పుడు ఆయన కూతురు షర్మిల పట్టుబిగించడమే విస్మయం కలిగిస్తోంది. మెగాపై సీబీఐ విచారణ జరపాలని, తెలంగాణలో ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని, అన్ని ప్రాజెక్టులు మెగా కంపెనీకే ఎలా ఇస్తున్నారంటూ వరసపెట్టి శరపరంపరగా, ధైర్యంగా విమర్శల వర్షం కురిపిస్తున్న షర్మిల ఇప్పుడు.. తెలంగాణలో ‘అతనొక్కడే’ అని శహభాషులందుకుంటున్నారు.

LEAVE A RESPONSE