-ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టించినా చర్యలు తీసుకోవడంలో హ్యాండ్సప్
-వేల కోట్ల విలువైన అక్రమ దందాలో భాగముండటంతోనే ఉన్నతాధికారుల మౌనం. వారి దారిలోనే కింది స్థాయి అధికారులు
-వరదాపురం, మరుపూరు, మొగళ్లూరు, విరువూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఈ రోజుకీ ఎలాంటి చర్యలు లేకపోవడమే అందుకు నిదర్శనం
-వైసీపీ నేతలతో కుమ్మక్కైన ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిస్తారనే నమ్మకం కూడా లేదు. కలెక్టర్, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం
-త్వరలోనే టీడీపీ ప్రభుత్వం రాబోతోంది. ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తాం. అక్రమ మైనింగ్ లో భాగస్వాములైన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు
-నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, వేల కోట్ల విలువైన క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. ప్రజల సొత్తును ఇష్టారాజ్యంగా దోచేస్తున్న మంత్రి కాకాణి, వైసీపీ ప్రజాప్రతినిధులతో కలెక్టర్, ఎస్పీ మంత్రి, రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు కుమ్మక్కు కావడం సిగ్గుచేటు.
అక్రమ మైనింగ్ కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత మండలమైన పొదలకూరు అడ్దాగా మారింది. విరువూరు ఇసుక రీచ్, వరదాపురం మైన్, మరుపూరుతో పాటు మొగళ్లూరు రెవెన్యూ భూముల్లో మైనింగ్ ద్వారా వేల కోట్లు దోచేశారు.వరదాపురం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై గత ఏడాది డిసెంబర్ 2న నేను పోరాటం చేపట్టాను.
ఈ రోజుకీ ఎవరిపై కేసు పెట్టలేదు. పూచికపుల్లంత రికవరీ జరగలేదు. మైన్ ప్రాంతంలో వెలుగుజూసిన ప్రమాదకరమైన పేలుడు పదార్థాలకు సంబంధించి చర్యలు లేవు. వీటికి సంబధించి కలెక్టర్ దగ్గర సమాధానమే లేదు.మేం సత్యాగ్రహాలు చేసినా, నిరసనలు తెలిపినా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మైనింగ్ ను ఆపలేమని జిల్లా అధికారులు చేతులెత్తేశారు.
కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని స్థాయిల్లోని అధికారులు తాము జీతాలు తీసుకుంటాము, మంత్రి కాకాణికి, వైసీపీ ఎమ్మెల్యేలకు కాళ్లు వత్తుతాం కానీ చర్యలు తీసుకునే దమ్ము తమకు లేదని రుజువు చేశారు.కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసిన తర్వాత కేంద్ర అధికారుల జోక్యం చేసుకోవడంతో వరదాపురంలో తవ్వకాలు ఆపారు. ఆ వెంటనే మొగళ్లూరులోని ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ మొదలుపెట్టారు.
మొగళ్లూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఫిబ్రవరి 12న నెల్లూరు కలెక్టరేట్ స్పందనలో కలెక్టర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు లేవు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మార్చి 18న మొగళ్లూరులో మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని మేం పరిశీలించాం. ఉదయం 7.55 గంటలకు కూడా మైనింగ్ కొనసాగుతోంది. జీపీఎస్ ఆధారిత ఫొటోలను కలెక్టర్ కు పంపాం.
కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పంపిన ఫొటోలు కావడంతో ఒక అధికారిని మైనింగ్ జరిగే ప్రాంతానికి పంపి మమ అనిపించారు.మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తన సహాయకుడితో పాటు డ్రైవర్ కలిసి మైన్ ను చూసి వెళ్లారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూమిలో వందల కోట్ల విలువైన క్వార్జ్ట్ ను తవ్వేస్తుంటే ఆర్డీఓ, తహసీల్దార్లు స్పందించరంట.
సామాన్యులపై ప్రతాపం చూపించే పొదలకూరు పోలీసులు ఈ అక్రమ మైనింగ్ దందాను పట్టించుకోరంట. ఈసీ(ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్) లేకపోయినా ఐదేళ్లుగా విరువూరు ఇసుక రీచ్ లో తవ్వకాలు ఆపలేదు. ఏడాదిగా రాపూరు, సైదాపురం, గూడూరు రూరల్, పొదలకూరు మండలాల్లో పట్టపగలే ప్రజల సొత్తును దోచేస్తుంటే పట్టించుకోని కలెక్టర్ నిన్న చర్యలు తీసుకుంటున్నామంటూ ఒక మెసేజ్ ఇచ్చారు. కానీ తీసుకున్న చర్యలు శూన్యం.
ప్రధానంగా సైదాపురంలో ఏడాదిగా యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే కలెక్టర్, ఎస్పీలకు కళ్లు కనిపించలేదా? కాకాణి గోవర్దన్ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్ లో కలెక్టర్, ఎస్పీ భాగాలు పెట్టుకున్నారు. వేల కోట్ల దోపిడీలో భాగస్వాములయ్యారు. వాటాలు ఉండటంతోనే చర్యలు తీసుకునే విషయంలో అధికారులు వెనక్కి తగ్గుతున్నారు. వరదాపురంలో రూ.500 కోట్లు, మరుపూరులో రూ.400 కోట్లు, మొగళ్లూరులో రూ.500 కోట్ల విలువైన క్వార్ట్జ్, విరువూరులో రూ.300 కోట్ల విలువైన ఇసుక లేచిపోయింది.
ఈ స్థాయిలో దందా జరుగుతుంటే చూసీచూడనట్టుండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అక్రమ దందాలో వాటాలు లేకుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు. మొగళ్లూరులోనూ ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో బ్లాస్టింగులు చేసి భారీ గుంత ఏర్పరిచారు. జనం సొత్తు ఈ స్థాయిలో దోపిడీ జరుగుతుంటే పట్టించుకునే బాధ్యత అధికారులకు లేదా?
అక్రమ మైనింగ్ సమాచారాన్ని పక్కా ఆధారాలతో పట్టిస్తే చర్యలు తీసుకోని అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ ఎలా అవుతారు? ఇంత బరితెగించిన జిల్లా ఉన్నతాధికారులను మా జీవితంలో చూడలేదు. వీరిపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం. ఈ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. త్వరలో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ అక్రమాలన్నింటిపై విచారణ జరిపిస్తాం.
శంకరన్, జన్నత్ హుస్సేన్, సుజాతారావు వంటి ఎందరో ఐఏఎస్ అధికారులు తమ నీతినిజాయతీ, సేవాగుణంతో ప్రజల గుండెల్లో శాశ్వత చోటు సంపాదించుకున్నారు. ఈ రోజు నెల్లూరులో ఉన్న అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ హోదాల పరువు కూడా తీసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం.