-అలాంటి చెల్లెలను దేశంలో ఎక్కడైనా చూశామా?
-ప్రెస్‌మీట్‌లో ఆమె కన్నీళ్లు పెట్టినా ఎవరూ నమ్మరు
-షర్మిల తీరుతో వైయస్‌ఆర్ ఆత్మ క్షోభిస్తుంది
-బాబు కళ్లల్లో ఆనందం కోసమే షర్మిల ఆరోపణలు
-జగన్‌కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరింది?
-ఆస్తి వివాదాల పరిష్కారం కోసం కుటుంబంలో చర్చలు
-కానీ షర్మిల గొంతెమ్మ కోరికలతో చర్చలు కొలిక్కి రాలేదు
-హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ జాతీయ -ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి వి.విజయసాయిరెడ్డి
హైదరాబాద్: శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్నను వేటాడి, వెంటాడి, కాటేసే విషపు పాము వంట షర్మిలను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్‌ఆర్ మరణానికి చంద్రబాబు కారకుడని అనేకసార్లు చెప్పిన షర్మిల, ఇప్పుడు అదే చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్, ప్రజలకు ఏం చేస్తాడని షర్మిల ప్రశ్నించడం తగదని ఆయన మండిపడ్డారు. తల్లి, చెల్లిని జగన్ మోసం చేశాడంటూ అదే పనిగా ప్రచారం చేయాలని షర్మిలకు చంద్రబాబు బ్రాండింగ్ ఇచ్చాడని, ఆ అజెండానే అమలు చేస్తూ, ఆయన్ను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు.
వైయస్సార్ దుర్మార్గమైన చావు చస్తారన్న చంద్రబాబు ప్రకటన తర్వాత, నాలుగైదు రోజుల్లోనే ఆయన చనిపోయారని.. అలాంటి వ్యక్తితో కలసి పని చేయడం, చేతులు కలపడం, పసుపు చీర కట్టుకుని ఆయన మెప్పు పొందడం అత్యంత దారుణమని, ఇంతటి అమానవీయ ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా? అని విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.
రాజారెడ్డి నాటి నుంచి తనకు వైయస్ కుటుంబంతో అనుబంధం ఉందన్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు తాను, వైవీ సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నామని షర్మిల మాట్లాడడం బాధాకరమని ఆవేదన చెందారు. తన అన్నపై అన్యాయంగా కేసు పెట్టి, బెయిల్ కూడా రాకుండా చేసి, 16 నెలలు జైల్లో పెట్టి హింసించిన కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేస్తూ, షర్మిల ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారని నిలదీశారు. ఆ కన్నీళ్లకు విలువ లేదన్న ఆయన, ఇప్పుడు షర్మిల ప్రవర్తనతో వైయస్సార్‌గారి ఆత్మ కూడా క్షోభిస్తుందని చెప్పారు.
అసలు షర్మిల తన అన్న జగన్‌కు రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని సూటిగా ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, అది ఇద్దరూ కుమ్మక్కు కావడం వల్లనే కాదా? అని నిలదీశారు. తండ్రి మరణం తర్వాత 10 ఏళ్లకు జగన్, తన చెల్లిపై ప్రేమతో స్వార్జిత ఆస్తిలో 40 శాతం ఇస్తూ జగన్ 2019, ఆగస్టులో ఎంఓయూ చేస్తే.. అయిదేళ్ల తర్వాత చంద్రబాబు డైరెక్షన్ మేరకు కుట్రపూరితంగా, ఆ షేర్లు బదిలీ చేసుకుని, జగన్ బెయిల్ రద్దు చేయించాలని చూశారని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై హైకోర్టు కూడా స్టేటస్‌కో ఇచ్చిన నేపథ్యంలో, ఆ ఆస్తులకు సంబంధించిన షేర్లను బదిలీ చేస్తే, అది కోర్టు ధిక్కారం అవుతుందన్న ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఒపీనియన్ మేరకు, కేసులు తేలిన తర్వాత ఆ షేర్లు షర్మిలకు బదలాయించేలా ఎంఓయూలో కండిషన్ పెట్టారని చెప్పారు. అయితే ఆ షేర్ సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయంటూ, జగన్ సంతకాలు కూడా లేకుండా, ఎవరికీ తెలియకుండా, గిఫ్ట్ డీడ్స్ కూడా లేకుండా, దొంగ సంతకాలతో షర్మిల ఆ షేర్స్ బదిలీ చేసుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు.
కేసులు తేలక ముందే షేర్ల బదిలీ జరిగితే, జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉందన్న విషయం తెలిసినా, షర్మిల ఆ పని చేశారంటే, జగన్ తిరిగి సీఎం కాకూడదన్న లక్ష్యంతోనే, చంద్రబాబుతో కలిసి కుట్ర చేసినట్లు తేలిందని చెప్పారు.
ఇవీ కూతురుకు వైయస్ ఇచ్చిన ఆస్తులు:
వైయస్సార్ బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంచారని, ఆ మేరకు షర్మిలకు ఈ ఆస్తులు దక్కాయంటూ, ఆ వివరాలు వెల్లడించారు.
విజయలక్ష్మి మినరల్స్, కోడూర్ మిల్స్, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ, బెరైటీస్ మినరల్స్ స్టాక్స్, సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్, ఎస్‌ఆర్‌ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్టు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, సెట్టుగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు, పులివెందులలో 7.6 ఎకరాలు, హైదరాబాద్. బంజరాహిల్స్. రోడ్ నెం.2లో 280 గజాల ఇల్లు, విజయవాడలో రాజ్, యువరాజ్ థియేటర్లు.
అప్పులను ఏనాడైనా షర్మిల పంచుకున్నారా?
ఇవన్నీ షర్మిలకు దక్కినా.. జగన్ తన స్వార్జితంలో 40 శాతం రాసిచ్చిన విషయాన్ని మరోసారి ప్రస్తావించిన విజయసాయిరెడ్డి.. జగన్ తన వాటాగా వచ్చిన ఆస్తులను, వ్యాపారాలను దక్షతతో అభివృద్ధి చేశారని చెప్పారు.
భారతి సిమెంట్స్ కోసం రూ.1400 కోట్ల రుణం తీసుకుని, ఆ తర్వాత తీర్చేశారని, తొలి కొన్నేళ్లలో సాక్షి మీడియాలో ఏటా రూ.20కోట్ల నష్టం వచ్చిందన ఆయన, ఆ నష్టాలు, అప్పులను ఏనాడైనా షర్మిల పంచుకున్నారా? అని ప్రశ్నించారు.
అన్నకు ద్రోహం చేసిన సోదరి
పెళ్లైన 25ఏళ్ల తర్వాత, తండ్రి చనిపోయాక 10 ఏళ్లకు చెల్లికి తన స్వార్జితంలో 40 శాతం వాటా రాసివ్వడమే కాకుండా, గత 10 ఏళ్లలో రూ.200 కోట్లు ఆమెకు ఇవ్వడం దేశంలో ఎక్కడైనా చూశామా? ఇంత వరకు ఆ పని ఎవరైనా చేశారా? అని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.
అన్నకు ద్రోహం చేసిన సోదరిగా షర్మిల చరిత్రలో మిగిలిపోతుందన్నారు. జగన్ అతి మంచితనం వల్లనే షర్మిలకు, స్వార్జిత ఆస్తిలో వాటాలు ఇచ్చి ఈ అనర్థాలును కొని తెచ్చుకున్నారనేది నిర్వివాద అంశమని స్పష్టం చేశారు.
షర్మిల వల్లే చర్చలు కొలిక్కి రాలేదు
ఈ తగాదా పరిష్కారం కోసం చర్చలు జరిగాయన్న ఆయన, షర్మిల గొంతెమ్మ కోరికల వల్లనే అవి కొలిక్కి రాలేదని చెప్పారు. తాను చెప్పేది వాస్తవమని, ఈ విషయాలన్నీ షర్మిలకు కూడా తెలుసని చెప్పారు.
‘సరస్వతి పవర్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం చంద్రబాబును కలిస్తే.. జగన్‌ను ఈ రకంగా ఇబ్బంది పెడితేనే తాను ఆ పని చేస్తానని చంద్రబాబు చెప్పారని’.. షర్మిల స్వయంగా ఆ చర్చల సందర్భంగా తెలిపారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ అరెస్ట్ చేసినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.