పెరాలసిస్ ఇంటికే పరిమితం
ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు
సివిల్స్ ఫలితాల్లో 887వ ర్యాంకు
ఇదీ వేములపాటి హనిత స్వయంకృషి
( ఘంటా వీరభద్రరావు)
విశాఖపట్నం: సహజంగా మనం విధి వెక్కిరించిందన్న పదం విధివంచితుల విషయంలో వాడుతుంటాం. కానీ విచిత్రం. ఆమె విధినే వెక్కిరించింది. పక్షవాతంతో లేవలేని పరిస్థితిలో ఉండి కూడా, కఠోరశ్రమతో సివిల్స్ పరీక్ష రాసి 887వ ర్యాంకు సాధించింది. ఇప్పుడు చెప్పండి. ఆమెను విధి వెక్కిరించిందా? విధినే ఆమె వెక్కిరించిందా?
కాలం కాళ్లు కదలలేని స్థితిలో పడేస్తే.. ఆమె సంకల్పం ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు సాధించినప్పటికీ అనుకోకుండా వచ్చిన పెరాలసిస్ ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయినప్పటికీ నిరాశ చెందక.. చదువుపై ఆసక్తిని చంపుకోలేక.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురించి ముందుకు సాగింది. సివిల్స్ ఫలితాల్లో 887వ ర్యాంకు సాధించింది. ఆమె వైజాగ్‌కు చెందిన వేములపాటి హనిత.
విశాఖపట్నం జిల్లాకు చెందిన హనిత చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా చురుకు. ఇంటర్మీడియట్ వరకు వైజాగ్‌లోనే చదివింది. 2012లో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ సీటు సాధించింది. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో అనుకోని ఓ కుదుపు. అకస్మాత్తుగా పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కే పరిమితమైంది. దీంతో ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటు వచ్చినప్పటికీ.. ఇంజనీరింగ్ విద్యను వదులుకోవాల్సి వచ్చింది.
ఇంటికే పరిమితమైనప్పటికీ హనిత చదువును మాత్రం విడిచిపెట్టలేదు. తన తల్లిదండ్రుల సహకారంతో దూర విద్యలో డిగ్రీని పూర్తి చేసింది. డిగ్రీ తర్వాత అక్కడితోనే తన జీవితం అయిపోకూడదని భావించిన హనిత.. సివిల్స్‌పై ఫోకస్ చేసింది. 2019 నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 887వ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా హనిత మాట్లాడుతూ.. సివిల్స్‌లో ర్యాంకు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. తనలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్లు ఎక్కడా కుంగిపోకుండా.. ధైర్యంతో ముందుకెళ్తే ఇలాంటి విజయాలు ఎన్నో సాధించవచ్చని పేర్కొంది.