Suryaa.co.in

Editorial

శివ..శివ.. ‘జగన్గురువు’ అది కూడా చెప్పరా స్వామీ!

-‘తిరుమల పట్టువస్త్రాల’పై మళ్లీ పాత పంచాయితీనే
-భార్యను తీసుకువెళ్లకపోవడంపై మళ్లీ అవే విమర్శలు
-మళ్లీ తెరపైకి జగన్ మత ప్రస్తావన
-శివలింగానికి తాళ్లు కట్టినా స్వరూపానంద స్వరపేటిక పలకదా?
-హిందూ సంస్థల విమర్శల వాన
( మార్తి సుబ్రహ్మణ్యం)

mp-raju2‘సీఎం జగన్మోహన్‌రెడ్డి సతీసమేతంగా  బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలి. స్వతహాగా క్రైస్తవుడయిన జగన్, తనకు హిందూమత సంప్రదాయాలపై నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా హిందూమతాన్ని గౌరవించాలి’
– వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

nagothu-ramesh-pic‘సీఎం జగన్ ఈసారైనా సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పిస్తేనే ఆ కుటుంబాన్ని హిందువులుగా గుర్తిస్తారు. లేకపోతే ఆయనను అన్యమతస్తుడిగానే భావించాల్సి ఉంటుంది. పీఠాల చుట్టూ తిరిగితే సరిపోదు. ఆయన హిందువునని నిరూపించుకోవాలి. తనకు హిందూ మత సంప్రదాయాలపై నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వకపోతే, ఆయనను అన్యమతస్తుడిగానే హిందూ సమాజం గుర్తిస్తుంది’
– బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు

deepak-reddy‘సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలని పండితులు చెబుతున్నా లెక్కలేనితనం. జగన్ పెళ్లి పులివెందులలోని చర్చిలో పాస్టర్ ఆధ్వర్యంలో జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం సంతకాలు పెట్టి రిజిస్టరు చేసుకున్నారు. ఆయన వివాహ ఆహ్వానపత్రికలో క్రిస్టియన్లుగా పేర్కొన్నారు. లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటిపై పెద్ద శిలువ ఇప్పటికీ కనిపిస్తుంటుంది. షర్మిల కూడా వెస్లీ చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. కాబట్టి జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు, డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే. ఆయన సతీసమేతంగా తిరుమలకు వెళ్లాలి. కానీ సింగిల్‌గా వెళుతున్నారు’
– టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి

మళ్లీ పాత కథే. కాకపోతే కొత్తగా వినిపించిన పాత కథ. రెండు,మూడు అదనపు అంశాలతో తెరపైకొచ్చిన కొత్త కథ. అవి ఏపీ సీఎం జగనన్న తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లినప్పుడల్లా వినిపించే మాటలే. కాకపోతే ఈసారి కాస్త కొత్తగా విమర్శలు. అంతే తేడా. మిగిలిన స్పందన వ్యవహారమంతా సేమ్ టు సేమ్.
సీఎం జగనన్న తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి, మళ్లీ యథావిధిగానే సతీమణిcm-tpt లేకుండా ఒంటరిగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు.. దానికి సంబంధించి ఉదయం నుంచే విమర్శల వాన మొదలయింది. ఈసారైనా జగనన్న తన భార్యతో కలసి పట్టువస్త్రాలు సమర్పించకపోతే, ఆయన కుటుంబానికి హిందూమతంపై నమ్మకం లేదనుకోవలసి ఉంటుందని ఆ విమర్శల సారాంశం. తాత్పర్యం, ప్రతిపదార్ధం కూడా!

మిగిలిన సీఎంల మాదిరిగానే జగనన్న కూడా సతీసమేతంగా పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించరన్నది మరో విమర్శల వర్షం. కేవలం స్వరూపా-చినజీయరు పీఠాలకు వెళ్లినంత మాత్రాన, జగనన్నను హిందువుగా ఎవరూ నమ్మరని.. సతీసమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పిస్తేనే, అసలైన హిందువుగా గుర్తిస్తారన్నది.. చివరాఖరకు కమలదళం కూడా వేసిన పెద్ద అభాండం. ఇదీ.. సీఎం జగన్ తిరుమల పర్యటనకు ముందు, అంటే ఉదయం నుంచి ఆంధ్రదేశంలో మొదలైన హిందూ సంస్థల అలజడి.

సరే.. జగనన్న పర్యటన సందర్భంగా వైసీపేయులు తిరుమలలో స్వామి ఫొటోలు లేకుండానే వేసిన, జగనన్న భారీ ఫ్లెక్సీలపై పెద్ద గత్తరే జరిగిందనుకోండి. స్వామి వారు కొలువుదీరిన ప్రాంతంలో ఈ జగనన్న ఫ్లెక్సీల జాతరేంటని

 

భక్తులు, తెదేపాయలు ఆందోళన చేయడం, పోలీసులు వారి మక్కెలు విరగ్గొటి జీపుల్లో పడేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో అంతా చూసిందే అనుకోండి. అది వేరే విషయం. అసలు ఫ్లెక్సీలే నిషేధించిన జగనన్నకు.. వైసీపేయులు అదే ఫ్లెక్సీలతో స్వాగతం చెప్పడేమిటి చెప్మా అన్నది బుద్ధిజీవుల హాశ్చర్యం.

ఇంతకూఎక్కడో తన మానాన తాను, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న స్వరూనందస్వామికి, జగనన్న సతీసమేతంగా కాకుండా ఒంటరిగా పట్టువస్త్రాలు సమర్పించిన ఎపిసోడ్‌కూ, లింకేమిటని అనుకుంటున్నారా? కచ్చితంగా ఉందంటోంది భక్తజనావళి మరి!

విద్యార్ధి దారితప్పితే, నయానో-భయానో నచ్చచెప్పి దారికి తీసుకురావలసిన బాధ్యత గురువులదే. ఒక విద్యార్థి పెద్దయిన తర్వాత చెడ్డపేరు తెచ్చుకున్నాడంటే, అది అతని గురువు లోపమన్నది శాస్త్రాలు చెప్పేమాట. అలాగే జగనన్న ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలకు, లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. ఆయనను హిందూమతంలోకి మార్చిన స్వరూపాభగవాన్‌దేనన్నది హిందూసమాజం ఉవాచ.

అదెలాగంటే… జగన్ సీఎం అయేందుకు స్వరూపానంద భగవత్పాదుల వారు, కఠోర తపస్సు ద్వారా సాధించిన సర్వశక్తులను ధారపోశారన్నది, స్వామివారే పూర్వాశ్రమంలో సెలవిచ్చారు. అది ప్రతి హిందువు గుండెల్లో.. టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ వేసే ‘గ్రీన్‌చాలెంజ్’ మొక్కలా నాటుకుపోయింది. అంటే ఈరోజు కోట్లాదిమంది అక్కచెల్లెమ్మకు.. ‘తమ్ముడన్నయ్య’గా మారిన జగనన్న ప్రస్తుత స్థితికి- రాజసానికి ఈ రాజగురువేనన్నది, హిందూ సమాజం ఎప్పుడో గుర్తించింది.

అందుకోసం జగనన్నను రిషికేషు తీసుకువెళ్లి మరీ నదిలో మూడు మునకలేయించడం, పుష్కరస్కానాలు చేయించడం వంటి లోకకల్యాణం కూడా చేయించిన విషయం, హిందూ సమాజానికి ఇంకా గుర్తే. అందుకే హిందూ సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు తమ మతానికి ఏదైనా హాని కలిగినప్పుడు.. జగనన్నను కాకుండా, స్వామివారి సన్నిధికే వెళ్లి తమ గోస వెళ్లబోసుకుంటారు. పనిలోపనిగా పదవులు ఆశించే ఆశావహులు కూడా, చినముషిడివాడకు తరలిపోతుంటారు. అది వేరే ముచ్చట.

మరి తమ జగనన్నను ఈ స్థాయికి తీసుకువచ్చిన జగన్గురువైన అంతలావు ఈ జగద్గురువు.. హిందూ మతాచారాలు- ఆలయ ప్రవేశ ప్రాధాన్యాలు- ఏయే సందర్భంలో ఒంటరిగా వెళ్లాలి? ఏ సమయాల్లో సతీసమేతంగా వెళ్లాలి అన్న ఆచారాల గురించి ఆయనకు ఎందుకు వివరించలేదు? తిరుమలకు అన్యమతస్తులు వెళ్లినప్పుడు, ‘తనకు హిందూమత సంప్రదాయాలపై విశ్వాసం ఉంద’ంటూ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని స్వామీజీ ఎందుకు చెప్పలేదు?

ఆయనకు ఇవన్నీ చెవిలో ఉపదేశించి ఉంటే, ఇప్పుడు జగనన్న హిందూ సమాజం నుంచి ఇన్ని విమర్శలు ఎదుర్కొనే వారు కాదు కదా? ఆ పద్ధతులేమిటో విడమరచి వివరించి ఉంటే, ఇప్పుడు ప్రత్యర్ధులు జగనన్నపై క్రైస్తవ ముద్ర వేసేవారు కాదు కదా? హిందూ సమాజం ‘ఆయన ఏ మతస్తుడ’ని అనుమానపు చూసేది కాదు కదా? అసలు ప్రతి బ్రహ్మోత్సవాలకూ జగనన్నకు ఈ లంపటం ఉండేది కాదు కదా? అన్నది జగనన్న-స్వరూపానందస్వామిని జమిలిగా కొలిచే భక్త శిఖామణుల బాధ.

నిజంగా స్వరూపా భగవత్పాదులు ఆ ఆచారాలేమిటి? ఒంటరిగా ఎవరు పూజా కార్యక్రమాలు చేస్తారు? జంటగా ఏ పూజలు చేస్తారని జగనన్నకు వివరించి ఉంటే.. అసలు ఆయన తొలి బ్రహ్మోత్సవాలకే సతీసమేతంగా వెళ్లేవారన్నది హిందూ సమాజం నమ్మిక. జగన్న కోసం కఠోర తపశ్శక్తులూ ధారపోసి, ఆయనను సీఎంను చేసిన జగద్గురువు ఆదిశంకరుల అంశలో పుట్టిన స్వరూపానంద సరస్వతి వంటి.. త్రికాల-మహాజ్ఞాని, ఇంత చిన్న విషయాన్ని ఎలా మరిచిపోయారన్నదే అనంతకోటి భక్తజనుల హాశ్చర్యం.

ఇంతకూ చివరాఖరగా చెప్పొచ్చేమేమిటంటే.. బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా వెళ్లాలని జగన్గురువులు ఆదేశించి ఉంటే, జగనన్న కచ్చితంగా తిరుమలకు సతీసమేతంగానే వెళ్లేవారన్నది.. హిందూ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంలో జగనన్న, జగద్గురువుల వారి సలహా తీసుకున్నారో లేదో ఎవరికీ తెలియదు. అది మాత్రం నిక్కము! కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిది? సతీసమేతంగా వెళ్లమని చెప్పని జగన్గురువుదా? సతీసమేతంగా వెళ్లాలా? లేదా అని జగద్గురువు సలహా కోరని జగనన్నదా? ఇది సమాధానం తెలిసినా, దొరకని భేతాళ ప్రశ్న.

కాసేపు ఈ డిక్లరేషను, పట్టువస్త్రాల సమర్పణ పంచాయతీని పక్కకుపెట్టి.. ముచ్చటగా మూడురోజుల క్రితం కాకినాడ జిల్లా అనపర్తిలో శివలింగానికి జరిగిన అపచారమేమిటో చూద్దాం. అక్కడి ఓ ఆలయం వద్ద అధికార వైసీపీ నాయకులు సరదా పడి ఓ సమావేశం పెట్టుకున్నారు. దానికోసం టెంటూ, కుర్చీలు తెచ్చారు. అక్కడి వరకూ బాగానే ఉంది. పాపం వారికి టెంటు తాడు ఎక్కడ కట్టాలో అర్ధం కాలేదు. పక్కనే భక్తులు పూజలు చేసే శివలింగం కనపడింది. అంతే.. ఠక్కున ఆ తాడును పాములా శివలింగానికి చుట్టేసి,

పనికానిచ్చేశారు. బహుశా శివుడు కూడా మెడలో పాముతో ఉంటాడు కాబట్టి, శివలింగానికీ తాడునే పాములా చుట్టేస్తే తప్పేమిటనుకున్నట్లున్నారు. మొత్తానికయితే పని జరిగిపోయింది.

ఇదంతా నాలుగు గోడల మధ్య జరిగిన అపచారమనుకుంటే, కచ్చితంగా కాకరకాయలో కాలేసినట్లే. ఈ యవ్వారమంతా ఎవరో ఎంచక్కా వీడియో తీసి, సోషల్‌మీడియాలోకి వదిలి మూడురోజులయింది. దానిపై రచ్చ జరుగుతూనే ఉంది. హిందూ సంస్థలు ఇంకా యాగీ చేస్తున్నాయి. వైసీపీ నాయకులపై చర్యలకు డిమాండు చేస్తూనే ఉన్నాయి. అయితే స్పందన శూన్యం. అంతర్వేది రథ దహనం మాదిరిగా!

శివలింగానికి ఇంత అవమానం జరిగి, హిందూ సమాజం అంతా నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. త్రికాలజ్ఞాని అయిన స్వరూపా భగవత్పాదుల్లో చలనం లేదేంటి చెప్మా అని, హిందూ సమాజం నోరెళ్లబెడుతోంది. జరిగింది అపచారం మాత్రమే కాదు, కిరాతకమని.. శివుడి మెడకు ఉరివేసిన తలారులను శిక్షించాలని, స్వామివారు పల్లెత్తు ధర్మాగ్రహం వ్యక్తం చేయకపోవడం, తాడేపల్లిలోని తన శిష్యుడి వద్దకు వెళ్లి.. ఆమేరకు ఆదేశించకపోవడమే జగన్గురు భక్తకోటి ఆశ్చర్యం కూడా. అసలు ఈ కిరాతకం జరుగుతుందని, అంతలావు తపోశ్శక్తిమంతుడికి ముందస్తుగా తెలియకపోవడం మరో హాశ్చర్యమంటున్నారు. ఏమో బాబూ .. నిజం ‘జగన్నా’ధుడికెరుక?! స్వామి వారి లీలలు ఒక పట్టాన ఎవరికీ అర్ధంకావు కదా?

LEAVE A RESPONSE