Suryaa.co.in

Telangana

బీజేపీకి షాక్‌… క‌మ‌లం వీడి కారెక్కిన బీజేపీ నేత‌

-గులాబీ గూటికి బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అప్పాల గ‌ణేష్, ఆయ‌న అనుచ‌రులు
-కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్, జూలై 12: బీజేపీ రాష్ట కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, నిర్మ‌ల్ మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ అప్పాల గ‌ణేష్ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. బుధ‌వారం దివ్యా గార్డెన్ లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేశారు. గులాబీ కండువా క‌ప్పి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అప్పాల గ‌ణేష్, ఆయ‌న అనుచ‌రుల‌ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

అంత‌కుముందు బైల్ బ‌జార్ నుంచి దివ్యా గార్డెన్ వ‌ర‌కు అప్పాల గ‌ణేష్, ఆయ‌న అనుచ‌రులు భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. అప్పాల గ‌ణేష్ తో పాటు బీఆర్ఎస్ లో చేరిన వారిలో కౌన్సిల‌ర్లు క‌త్తి న‌రేందర్, సైండ్ల శ్రీధ‌ర్, మాజీ కౌన్సిల‌ర్లు చందుప‌ట్ల ర‌వి, తోట న‌ర్స‌య్య‌, గోపు గోపి, నేల అరుణ్ కుమార్, సాకీర్, అలీం, అప్పాల ప్ర‌భాక‌ర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు యువ‌కులు, కుల‌సంఘాల నేత‌లు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… సీయం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో దేశంలో ప్ర‌గ‌తిప‌థంలో అగ్ర‌గామిగా నిలుస్తుంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పంద‌న వ‌స్తుంద‌ని తెలిపారు. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు బీఆర్ఎస్ లో చేరుతున్నార‌ని పేర్కొన్నారు.

మ‌రోవైపు కొత్త‌గా ఏర్ప‌డ్డ నిర్మ‌ల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో శ‌ర‌వేగంగా వృద్ధి చెందుతుంద‌ని వెల్ల‌డించారు. మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ అప్పాల గ‌ణేష్ లాంటి వారు సొంత పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. స‌మిష్టిగా ప‌ని చేసి నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాన్ని మ‌రింత అభివృద్ధి చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మ‌ల్ జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షులు, ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, జిల్లా గ్రంథాల‌య సంస్థ‌ల చైర్మ‌న్ ఎర్ర‌వోతు రాజేంద‌ర్, జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్మ‌న్ వెంక‌ట్రామ్ రెడ్డి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్,నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ‌ బీఆర్ఎస్ అధ్య‌క్షులు మారుగొండ రాము, ఇత‌ర బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE