– కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన 150 మంది నాయకులు
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు గ్రామస్తులందరూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాబు నాయక్, ప్రస్తుత కాంగ్రెస్ ఉపసర్పంచ్ తావూరియా మరియు ఆరుగురు వార్డు సభ్యులు పార్టీ మారడం గమనార్హం. వెంకటేశ్వర తండా సర్పంచ్ సేవ్యా నాయక్, కొల్లూరు మాజీ సర్పంచ్ రాజు, నాయకులు చందర్ నాయక్ నేతృత్వంలో రెండు బస్సుల్లో గ్రామస్తులు ఎర్రవల్లి నివాసానికి తరలివచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై, పార్టీ నాయకత్వంపై నమ్మకంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చేరిన నాయకులు తెలిపారు. స్థానిక నాయకత్వం మరియు కేసీఆర్ విజన్ పట్ల గౌరవంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.