– ఓ వైపు జగన్ భారతీల ఆంతరంగికులకు డీఫాల్ట్ బెయి రద్దు
– మరో వైపు దంపతులకు పండగలలో సెట్టింగులు వేసే అనుచరుడి ఫ్యామిలీ ఆస్తుల జప్తు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశమైన ఏపీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులో నిందితులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
డిఫాల్ట్ బెయిల్ రద్దు – హైకోర్టు సంచలన నిర్ణయం!
మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏమాత్రం ఊరట లభించలేదు. ముగ్గురు నిందితులకు దిగువ కోర్టు (ఏసీబీ కోర్టు) గతంలో మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీంతో, కేసు దర్యాప్తులో మరింత వేగం పుంజుకోనుంది, నిందితులకు చట్టపరంగా ఇబ్బందులు పెరగనున్నాయి.
చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు గ్రీన్ సిగ్నల్!
వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం స్కామ్‌లో మరో కీలక ఘట్టం మొదలైంది. నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్‌రెడ్డి, మరియు మోహిత్ రెడ్డి భార్య లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సిట్ నివేదిక ఏం చెప్పింది?
కేసును దర్యాప్తు చేసిన సిట్ (SIT) బృందం… కమీషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. సిట్ చేసిన విజ్ఞప్తి మేరకు, అక్రమార్జనగా భావిస్తున్న ఈ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద, ఈ కుంభకోణం కేసులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో, హైకోర్టు తీర్పు మరియు ఆస్తుల జప్తు ప్రక్రియ… కేసు తీవ్రతను, దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల చిక్కుముడులను మరింతగా బయటపెట్టే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి! జైల్లో వున్న చెవిరెడ్డికి ఈ వార్త తెలిస్తే ఎంత వయలెంట్ అవుతాడో. అసలే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు వీడ్కోలు పలికే సమయంలో ఆలస్యానికి మామూలు గొడవ చేయలేదు.

