– చంద్రబాబు వైఖరితో మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు
– రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం
– అభివృద్ధి కేంద్రీకరణ రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు
– దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర బిడ్డలు ఇంకా వలసబాట
– రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఏకంగా రూ.3.30 లక్షల కోట్లు
– అయినా శ్రీకాకుళం ప్రాజెక్టులకు నిధులేవి?
– అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా?
– వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కావాలి
– కానీ, ఈ బడ్జెట్లో కేవలం రూ.80 కోట్ల కేటాయింపు
– ప్రధానిగారితో మాట్లాడి, ఒడిషా ప్రభుత్వంతో ఆ ఎస్సెల్పీని ఉపసంహరింపచేయాలి
– మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో అయిదు కోట్ల ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. నిపుణుల కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఆయన వైఖరితో మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ధర్యాన ప్రసాదరావు తెలిపారు. ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పని చేసిన నాటి సీఎం వైయస్ జగన్, అప్పుడు ఒడిషా సీఎంను కూడా కలిసి చర్చించారని గుర్తు చేశారు. వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.80 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని ధర్మాన ప్రసాదరావు తప్పుబట్టారు.
రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడి పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోయిందని కమిటీ గుర్తు చేసింది. కాగా, ఇప్పుడు సీఎం చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. అమరావతి పేరుతో కేవలం సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం నిధులన్నీ అక్కడే కుమ్మరిస్తే, భవిష్యత్తు తరాలు మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారు?. మరోవైపు 80 ఏళ్లైనా కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా? ఇది ధర్మమా?
అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు. మరి అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు గోచీలు కట్టుకుని కూలీలుగా మిగిలిపోవాలా?.
వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు. ట్రిబ్యునల్లో మనకు అనుకూలంగా నాడు జగన్ హయాంలో తీర్పు వచ్చింది. దాన్ని అమలు చేయడానికి నాటి సీఎం వైయస్ జగన్, ఒడిషా వెళ్లి, అక్కడి సీఎంతో చర్చించారు. మరి ఇన్నేళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒడిషా సీఎంతో మాట్లాడారా? ట్రిబ్యునల్ తీర్పు తర్వాత ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసినా, చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఒడిషా వెళ్లి ఆ సీఎంతో మాట్లాడలేదు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలి.
నిజానికి వంశధారపై ట్రిబ్యునల్ తీర్పు జగన్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. దానికి సంబంధించిన గజిట్ ఇప్పుడు వస్తే… అదంతా తామే చేశామని అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని చెబుతున్నారు. వారు సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.
ఒడిషా ప్రభుత్వ ఎస్సెల్పీ గురించి మంత్రి అచ్చెన్నాయుడు మర్చిపోయినట్లు ఉన్నారు. ఆయనకు ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధానిగారితో మాట్లాడి, ఒడిషా ప్రభుత్వంతో ఆ ఎస్సెల్పీని ఉపసంహరింపచేయాలి. ఇంకా వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అవసరం కాగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.80 కోట్ల కేటాయింపు తమ ప్రాంతాన్ని మోసం చేయడమే అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.