Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో పల్లె నిద్ర

-జగన్ మూర్ఖత్వానికి రాష్ట్రం బలికావాలా..?
-అవినీతి చేయమని జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువు ఏమైనా చెప్పాడా?
-పవర్ రిఫార్మ్స్ వల్ల 2004లో పవర్ పోయినా రాష్ట్రం బాగు పడింది
-పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం
-ఓట్ల అవకతవకలపై దిల్లీని కూడా వదిలిపెట్టను
-మీడియాతో చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు కాకపోతే సంపద సృష్టించే అమరావతిని చంపేస్తాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక మనిషి మూర్ఖత్వానికి-పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడెలా సంపద సృష్టిస్తోందో, అమరావతి కూడా రాష్ట్రమంతటికీ సంపద సృష్టి కేంద్రంగా ఉండేదని ఆయన అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కింద తాను కూడా త్వరలోనే పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు తెలిపారు.

అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు అక్కడ భూమి ధరెంత, ప్రకటించాక ఎంత, ఇప్పుడెంత? అని ప్రశ్నించిన చంద్రబాబు… రాజధానిగా కొనసాగించి ఉంటే ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా అంటూ నిలదీశారు. జీవనాడి పోలవరాన్ని ముంచేస్తే, ప్రజల్లో చైతన్యం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణా-గోదావరి నదుల్ని సక్రమంగా వినియోగించుకుంటే ఏపీ-తెలంగాణల్లో ప్రతీ ఎకరాకు నీళ్లివ్వవచ్చన్నారు.

ప్రకృతి వనరులతో పాటు ప్రైవేటుగా ఎవరైనా 40ఏళ్లుగా సంపాదించుకున్న ఆస్తులు కూడా వీళ్లకే కావాలా అంటూ మండిపడ్డారు. భూ కబ్జాలు సెటిల్మెంట్లతో వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. రైతుల కోలుకోలేని దుస్థితిలో ఉన్నారని తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించటమే కాదు వారి జీవన విధానం మారేలా ప్రణాళికలు చేస్తామన్న చంద్రబాబు… కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారన్నారు.

మహిళల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం
మేనిఫెస్టోలో మహిళలకు ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు పథకాలే కాకుండా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు వారి ద్వారా చేసే ఆలోచన ఉన్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెల్లడించారు. మహిళల్ని వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా కుటుంబం-సమాజం రెండూ బాగుపడేలా చూస్తామన్నారు. అమ్మ కష్టాలు తాను దగ్గర ఉండి చూశానని, అందుకే గ్యాస్ సిలిండర్లు ఆనాడు తీసుకువచ్చామని తెలిపారు.

కట్టెల పొయ్యి మీద మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశానన్న చంద్రబాబు… పెరిగిన వంట గ్యాస్ ధరలతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారని, అందుకే మూడు సిలిండర్లు ప్రకటించామని వివరించారు. మహిళా శక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అమెరికాకు ఇప్పటి వరకూ మహిళ అధ్యక్షురాలిగా కాలేదన్నారు. ఈ విధానం పోవాలనే మినీ మేనిఫెస్టో లో మహా శక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఇంత అవినీతి చేయమని జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువు ఏమైనా చెప్పాడా..? అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లక్షల కోట్ల ప్రజా సంపద నాశనం చేసి, లక్షల కోట్లు అప్పు చేయమని ఖురాన్ చెప్పిందా..? అని మండిపడ్డారు. అధికారంలో ఉండగా నేనేం చేశానో ప్రజలు చూశారు.. గత నాలుగేళ్లుగా జగన్ ఏం చేస్తున్నాడో కూడా జనం బేరీజు వేసుకున్నారు.. పవన్ కల్యాణ్ ఏం చెప్తున్నాడో వింటున్నారని అన్నారు.

500 రూపాయల నోట్లు కూడా రద్దు చేసేస్తే ఎన్నికల్లో డబ్బులు పంచే శని వదిలిపోతుంది అన్న చంద్రబాబు.., రాజకీయాల ద్వారా సేవ చేయాలంటే డబ్బులు పంచాలా? అని ప్రశ్నించారు. ఏపీ – మహారాష్ట్రలను కలిపేస్తే మూడు రాజధానులు – ముగ్గురు సీఎంల సమస్య తీరుతుందనే జోకులు హల్చల్ చేస్తున్నాయన్నారు. ఋషికొండపై జగన్మోహన్రెడ్డి కట్టుకునే విలాసవంతమైన భవనం కోసం దేశ విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పిస్తున్నారట అని చంద్రబాబు విమర్శించారు.

పవర్ రిఫార్మ్స్ వల్ల 2004లో పవర్ పోయినా రాష్ట్రం బాగుపడిందన్నారు. ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ చేసే సంస్కరణలు తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో అమలయ్యే విద్యుత్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్తే నాకు ఓట్లు పడకపోవచ్చు.. ఈ తరం వారికి చేసిన కృషి తెలియకపోవచ్చు.. కానీ, అభివృద్ధి చేశాననే సంతృప్తి మాత్రం తనకుందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కింద తాను కూడా త్వరలోనే పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు తెలిపారు.

తెలుగుదేశంతో పొత్తుంటుందని ఆశిస్తున్నామన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. దగా పడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొచ్చి, సెట్ చేయటమే తన ముందున్న లక్ష్యమన్నారు. పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరమని పేర్కొన్నారు.

ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి చులకన కాదల్చుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం-ప్రజలు గట్టిగా ఉంటే కేంద్రం ఎందుకు దిగి రాదనటానికి జల్లికట్టు ఘటనే ఓ ఉదాహరణగా చంద్రబాబు పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం చేశాడా అని నిలదీశారు. ఓట్ల అవకతవకలపై దిల్లీని కూడా వదిలిపెట్టమని తెలిపారు. అక్రమాలు సరిదిద్దకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత కూడా పోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE